పదో తరగతి విద్యార్థిని చంపేసిన ఎనిమిదవ తరగతి విద్యార్థి..!

Ahmedabad School Stabbing: అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన దారుణ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 8వ తరగతి విద్యార్థి, తన సీనియర్ అయిన 10వ తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. ఓ చిన్న వివాదం ఈ హత్యకు కారణమైంది. దీనికంటే హత్య చేసిన పిల్లవాడు తన స్నేహితుడితో చేసిన ఇంస్టాగ్రామ్ చాటింగ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. అసలు పిల్లల్లో పెరుగుతున్న ఇలాంటి హింసాత్మక ప్రవృత్తికి కారణాలు ఏమిటి? పిల్లలపై ఎక్కువగా ఎలాంటివి ప్రభావం చూపిస్తున్నాయి? తల్లిదండ్రులు, స్కూళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఈమధ్య చిన్నపిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఫోన్ కు అడిక్ట్ అయిన పిల్లలు వాటిని ఇవ్వకపోతే విచిత్రంగా ప్రవర్తించడం సైకోలా బిహేవ్ చేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల్లో నేర ప్రవృత్తి కూడా ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తోంది. ఓ చిన్న గొడవ అహ్మదాబాద్ లోని ఒక స్కూల్లో తోటి విద్యార్థి హత్యకు కారణమైంది. ఆ తర్వాత హత్యకు సంబంధించి దాడి చేసిన బాలుడు.. అతడి స్నేహితుడి మధ్య జరిగిన చాటింగ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. నిందితుడైన 8వ తరగతి విద్యార్థి తన స్నేహితుడితో, అవును, తానే అతన్ని పొడిచాను అని కూల్ గా అంగీకరించాడు. భయ్యా, నీవు ఏమైనా చేశావా? అని స్నేహితుడు అడగగా, నిందితుడు నీకెవరు చెప్పారు అని సమాధానం ఇచ్చాడు. అతడు చనిపోయాడని అనుకుంటున్నా అని స్నేహితుడు చెప్పగా, నిందితుడు అతనికి చెప్పు, నేనే చంపానని. అతనికి నా గురించి తెలుసు, ఇప్పుడే చెప్పు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ చాట్‌లో నిందితుడి దయలేని వైఖరి సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంత చిన్న వయసులో బాలుడు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడని ప్రశ్న తలెత్తుతోంది.

ఈ హత్యకు కారణం చిన్న విషయమే. మాట మాట పెరిగి కోపంతో కత్తితో పొడి చేశాడు. అరెరె, అంత చిన్న విషయానికి కత్తితో పొడవకూడదు. కొట్టి ఉండొచ్చు, చంపడం ఎందుకు అని స్నేహితుడు ప్రశ్నించాడు. కానీ నిందితుడువజరిగింది జరిగిపోయింది అని నిర్లిప్తంగా సమాధానం ఇచ్చాడు. స్నేహితుడు జాగ్రత్తగా ఉండు, కాసేపు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లు, చాట్‌లు డిలీట్ చేయి అని సూచించాడు. ఈ సంభాషణ చిన్న పిల్లల్లో హింసాత్మక మనస్తత్వాన్ని బయటపెట్టింది.

ఈ ఘటన అహ్మదాబాద్‌లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ వద్ద జరిగింది. స్కూల్ ముగిసిన తర్వాత, 10వ తరగతి విద్యార్థి నయన్ సంతాని ఇంటికి వెళ్తుండగా, 8వ తరగతి విద్యార్థి, ఇతర కొందరు విద్యార్థులతో కలిసి అతన్ని అడ్డుకున్నాడు. మెట్లపై ఎల్బోతో తాకడంతో జరిగిన వాగ్వాదం హఠాత్తుగా హింసాత్మకంగా మారింది. నిందితుడు కత్తితో నయన్‌ను కడుపులో పొడిచి, స్కూల్ వెనుకవైపు పారిపోయాడు. సీసీటీవీలో నయన్ గాయంతో స్కూల్లోకి తిరిగి వెళ్లిన దృశ్యం రికార్డైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నయన్ మరణించాడు.

ఈ ఘటన తర్వాత స్కూల్ వద్ద ఆందోళనలు చెలరేగాయి. నయన్ కుటుంబం, సింధీ కమ్యూనిటీ సభ్యులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ను ముట్టడించి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు స్కూల్ ఆస్తులను ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడి చేశారు. నిందితుడు మైనారిటీ సమాజానికి చెందినవాడు, బాధితుడు సింధీ సమాజానికి చెందినవాడని తెలియడంతో కొంత కమ్యూనల్ టెన్షన్ ఏర్పడింది. పోలీసులు జువెనైల్ యాక్ట్ కింద నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఘటన పిల్లల్లో పెరుగుతున్న హింసాత్మక ప్రవృత్తిపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది. చిన్న వయసులోనే ఇంత దూకుడు, హింస ఎందుకు? సామాజిక మాధ్యమాలు, హింసాత్మక వీడియో గేమ్స్, అనియంత్రిత కంటెంట్ ఎక్స్పోజర్ దీనికి కారణమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సామాజిక మాధ్యమాలు, క్రిమినల్ మైండ్‌సెట్‌తో కూడిన గేమ్స్ ఈ ప్రవర్తనకు దోహదం చేస్తున్నాయి అని గుజరాత్ విద్యాశాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా అన్నారు. మనోవిజ్ఞాన నిపుణులు, పిల్లల్లో కోప నియంత్రణ, సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలు అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. స్కూళ్లలో మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ శిక్షణ అవసరమని నొక్కి చెబుతున్నారు.

స్కూల్ యాజమాన్యంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 8వ తరగతి విద్యార్థి కత్తిని స్కూల్‌కు ఎలా తెచ్చాడు? మెటల్ డిటెక్టర్లు, సీసీటీవీ సర్విలెన్స్, రెగ్యులర్ బ్యాగ్ చెక్‌లు ఎందుకు లేవు? నయన్ గాయపడిన తర్వాత స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంపై కుటుంబం ఆరోపణలు చేసింది. నయన్ అరగంటసేపు గాయాలతో అలాగే పడి ఉన్నా, ఎవరూ అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు అని ఆరోపణలు వచ్చాయి. స్కూళ్లు విద్యతో పాటు విద్యార్థుల భద్రత, విలువలు, నైతికత నేర్పించే బాధ్యతను కూడా తీసుకోవాలని డిమాండ్‌లు వస్తున్నాయి. Ahmedabad School Stabbing.

ఈ ఘటన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. అయితే పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తిని అరికట్టడానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో తగినంత సమయం గడపాలి. పిల్లల మానసిక స్థితి, వారి స్నేహితులు, ఆసక్తుల గురించి తెలుసుకోవాలి. రోజూ కొంత సమయం మాట్లాడండి. పిల్లల సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టాలి. పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో, ఎవరితో చాట్ చేస్తున్నారో పరిశీలించాలి. అనవసర ఒత్తిడి లేకుండా సున్నితంగా గమనించాలి. కోపాన్ని నియంత్రించుకునేలా చేయాలి. ఎప్పటికప్పుడు స్కూల్‌లో భద్రతా చర్యలు, కౌన్సెలింగ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవాలి. పిల్లలు మానసిక ఒత్తిడిలో ఉన్నారా, బెదిరింపులు ఎదుర్కొంటున్నారా అని గమనించాలి. అవసరమైతే కౌన్సెలర్ సహాయం తీసుకోవాలి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q