మళ్ళీ జిల్లాలోఉగ్ర కదలికలు..!

Bodhan Town Terrorist Suspects: బోధన్ పట్టణం మరోసారి ఉలిక్కి పడింది. కొద్ది నెలల క్రితమే రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులకు అడ్డాగా మారిందనే నేపథ్యంలో జరిగిన దాడుల తర్వాత డిల్లీ ప్రత్యేక పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల అధికారులు ఏకకాలంలో చేసిన ఆకస్మిక దాడులు కలకలం రేపుతున్నాయి. మూడేళ్ల అనంతరం జిల్లాలో ఉగ్ర సంబంధాల నేపథ్యంలో అరెస్ట్ ఘటన ఆందోళన రేపుతోంది. గతంలో పీఎఫ్ఐ, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో లింక్ ఉన్న వ్యక్తులు నిజామాబాద్ జిల్లాలో కార్యకలాపాలు కొనసాగించారు. ప్రధానంగా పిఎఫ్ఐ సంస్థ ఉగ్ర శిక్షణ కోసం నిజామాబాద్ నగరాన్ని కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు

అయితే ఎన్ఐఏ, జిల్లా పోలీసులు పకడ్బందీగా జరిపిన దాడులతో కనుమరుగైంది. మళ్ళీ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానించి ఓ వ్యక్తిని బోధన్ పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం స్థానిక బోధన్ కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసులు తిరిగి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలిసింది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండానే కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు బోధన్ పట్టణంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఉగ్రవాద సంస్థల చర్యలపై కేంద్రం నిఘా పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి ఢిల్లీలో కొందరిని ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే నేపథ్యంలో పకడ్బందీ సంవత్సరం మేరకు బోధన్ పట్టణం పై దృష్టి పెట్టిన కేంద్ర నిఘా బలగాలు పకడ్బందీగా పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా తెలిసింది. తెల్లవారుజామునే ఆ వ్యక్తిని అరెస్టు చేసిన కేంద్ర నిఘా సంస్థలు ఆయన నుంచి ఓ తుపాకీ, కొంత సామాగ్రి సేకరించినట్లు చర్చ జరుగుతుంది.

కేంద్ర నిఘా విభాగం ఈ విషయంలో ఎలాంటి సమాచారాన్ని మీడియాకు చెప్పకుండా రహస్యంగా ఉంచింది. స్థానిక పోలీసులకు కూడా ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో బోధన్ పోలీసులు ఈ విషయంపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు.

మూడేళ్ల క్రితం 2022 ఇదే సెప్టెంబర్ నెలలో ఉగ్ర వాదులకు శిక్షణ ఇస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పిఎఫ్ఐ )సంస్థ జాడ తెలిసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) అప్పట్లో ఆకస్మికంగా స్థానిక పోలీసులకు కూడా సమాచారం లేకుండా నిజాంబాద్ జిల్లాతో పాటు ఏకకాలంలో 23 చోట్ల ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపెల్లి, ఆటోనగర్, హౌసింగ్ బోర్డ్, మాలపల్లి, గుండారం, పులాంగ్ లతో పాటు బోధన్, నవీపేట్, ఆర్మూర్, ఎడపల్లి మండలాల్లో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు, శిక్షణ ఇలా వివిధ సంబంధాలపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. సోదాల్లో కంప్యూటర్లు, పాస్పోర్ట్లు , సాహిత్యం, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై దేశ ద్రోహం కింద అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. తర్వాత వరుసగా 29 మందిపై కేసు నమోదు చేసి దాదాపుగా అందరిని అరెస్టు చేశారు.

నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్ పట్టణాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, కడప, అనంతపురం జిల్లాలో కూడా పిఎఫ్ఐ కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా నిజామాబాద్ లో జరిగిన దాడుల తర్వాత ఎన్నయ్యే నిర్ధారణకు వచ్చింది. ఇక్కడి నుండే పూర్తి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెలుగు చూసింది. ఎన్ఐఏ తో పాటుగా స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పిఎఫ్ఐ ఆట కట్టించడం సులభమైంది.

నిషేధిత పిఎఫ్ఐ ఉగ్ర సంస్థ నిజామాబాద్ నగరం కేంద్రంగా ఉగ్ర శిక్షణ కొనసాగించింది. మదర్సాలలో ఎంపిక చేసిన యువకులను పిఎఫ్ఐ లో చేర్చుకొని, మత ద్వేశాలను రెచ్చగొట్టడం, మత కల్లోలాలను సృష్టించడం, గొడవలు రేకెత్తించడం, ఒక వర్గంపై దాడులకు ప్రేరేపించడం లాంటి వాటిపై శిక్షణను ఇచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఉగ్రవాదానికి సంబంధించి సాహిత్యాన్ని, పెన్ డ్రైవ్లు, లాప్టాప్ లు పూర్తిగా పోలీసులు తీసుకున్నారు. ప్రధానంగా కరాటే ముసుగులో జగిత్యాల జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే ఉగ్ర శిక్షకుడు నిజామాబాద్ కేంద్రంగా అడుగులు వేశాడు. పి ఎఫ్ ఐ కార్యకలాపాలకు ప్రధాన శిక్షకుడిగా అబ్దుల్ ఖాదర్ అనేక మందిని ప్రేరేపించాడు. అబ్దుల్ ఖాదర్ తో పాటుగా షేక్ షాదుల్లా, ఎండి ఇమ్రాన్, అబ్దుల్ మోహిన్ లు కీలక సూత్రధారులుగా ఉన్నారు. వీరితో పాటుగా ఆర్మూర్ కు చెందిన యువకుడు కూడా కీలక సంబంధాలు తనిఖీల్లో బయటపడ్డాయి. Bodhan Town Terrorist Suspects.

పాకిస్తాన్ నుంచి డబ్బులు రావడం, విదేశీ కాల్స్ మాట్లాడటం వంటివి ఫోన్లో బయటపడ్డాయి. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో అధికారులు సోదాలు నిర్వహించారు ఎడపల్లిలోని ఎమ్మెస్సీ ఫారం లో కూడా సోదాలు నిర్వహించి పాస్పోర్టు, బ్యాంక్ అకౌంట్ స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎన్ఐఏ, స్థానిక పోలీసులు చాకచక్యంగా వివరించడంతో పిఎఫ్ఐ కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపారు. అప్పటినుంచి జిల్లాలో ఎలాంటి ఉగ్రవాద కలపాలు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే గతంలో బోధన్ పట్టణం కేంద్రంగా ఐఎస్ఐ తీవ్రవాది అజాం గోరి కూడా తన కార్యకలాపాలను కొనసాగించారు. సైకిల్ షాప్ యజమాని హత్యతో అజాం గోరి ఐఎస్ఐ కదలికలు బయటపడ్డాయి. ఆర్మూర్ పట్టణంలో కూడా గతంలో ఐఎస్ఐ సంస్థతో లింకులు ఉన్నట్లుగా పోలీసులు భావించారు. ఏమైనా మళ్లీ నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి.