రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపగలరా..?

Russia and Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పడరాని పాట్లు పడ్డారు, కానీ ఫలితం రాలేదు. ఈ యుద్ధాన్ని ఆపితే ఆ పేరు చెప్పుకుని నోబెల్ బహుమతికి నామినేట్ చేయించుకోవచ్చని అనుకున్నారు. కానీ రష్యా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే చైనా పర్యటనలో మోదీ, పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఉక్రెయిన్ యుద్ధాన్ని కొత్త మలుపు తిప్పనున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధాన్ని ముగించే శాంతి దూతగా అవతరిస్తున్నారా అనే చర్చ మొదలైంది. అదే నిజమైతే ట్రంప్ కు కాదు మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలనే మాట వినిపిస్తుందని అంటున్నారు. అసలు ట్రంప్ కు సాధ్యం కానిది మోదీకి ఎందుకు సాధ్యమవుతోంది…? ట్రంప్ కంటే మోదీ ఏ విషయంలో మేలు..? పుతిన్ మనస్సు మార్చడం మోదీకే సాధ్యమా..? ట్రంప్ కు లేని ఒక అడ్వాంటేజ్ మోదీకి ఉంది అదేంటి..? తెలుసుకోవాలంటే చూడాల్సిందే.

2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న యుద్ధం ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో వేలాది మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, ఐరోపా సహా అనేక దేశాలు ప్రయత్నించాయి, కానీ ఫలితం రాలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనేక సార్లు ఫోన్ చేశారు.. నేరుగా సమావేశమయ్యారు. అయినా యుద్ధాన్ని ఆపలేకపోయారు. అయితే ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధాన్ని ముగించే శాంతి దూతగా మారనున్నారనే మాట వినిపిస్తోంది. 2024 ఆగస్టులో మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. ఆ సందర్భంలో మోదీ, తాము యుద్ధం నుంచి దూరంగా ఉన్నాం కానీ, శాంతి కోసం నిలబడతాం అని స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ మోదీ పర్యటన చారిత్రాత్మకం అని కొనియాడారు. భారత్ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇటు రష్యాతో భారత్‌కు దశాబ్దాలుగా ఉన్న స్నేహం, పుతిన్‌తో మోదీకి ఉన్న వ్యక్తిగత సంబంధం కూడా ఈ యుద్ధాన్ని ముగించడంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఇస్తున్నాయి.

చైనా పర్యటనలో పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించారు. పుతిన్ తన ఆరస్ సెనట్ లిమోజిన్‌ కారులో మోదీని తీసుకెళ్లి, 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంలో మోదీ ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని, శాంతి స్థాపనకు భారత్ సిద్ధంగా ఉందని పుతిన్‌కు సూచించారు. పుతిన్ ఈ సూచనలకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. భారత్-రష్యా సహకారం గ్లోబల్ శాంతి, స్థిరత్వానికి ముఖ్యం అని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పుతిన్, అమెరికా ఒత్తిడికి లొంగకపోవచ్చు, కానీ మోదీ సూచనలను గౌరవించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మోదీతో జెలెన్‌స్కీ ఏం మాట్లాడారు..?
ట్రంప్ కంటే మోదీతోనే పుతిన్, జెలెన్ స్కీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మోదీ ఇతర దేశాల నేతలను గౌరవంగా చూస్తారు. వారి వాదనలకు విలువనిస్తారు. ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో తమతమ వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే మోదీ రెండు దేశాల వాదనలు వింటున్నారు. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ, ట్రంప్‌తో వాషింగ్టన్‌లో జరిగిన చర్చల గురించి మోదీకి వివరించారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తోందని, శాంతి కోసం వెంటనే యుద్ధవిరమణ అవసరమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ సందర్భంలో మోదీ, భారత్ శాంతి ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తుందని, ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జెలెన్‌స్కీ, SCO సమావేశంలో మోదీ రష్యాకు శాంతి సందేశం అందించాలని కోరారు.

ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలాస్కాలో సమావేశమయ్యారు. ఈ చర్చలలో ట్రంప్ పూర్తి శాంతి ఒప్పందం కోసం పట్టుబట్టారు, కానీ పుతిన్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ పై అనేక దాడులు చేసింది. జెలెన్ స్కీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ సమావేశం కూడా జరగలేదు. దీంతో ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మోదీ మధ్యవర్తిత్యం ఫలిస్తుందనే మాట వినిపిస్తోంది.

మోదీ యొక్క దౌత్య నైపుణ్యం ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడంలో కీలక పాత్ర పోషించగలదని అనేక దేశాలు ఆశిస్తున్నాయి. భారత్ రష్యాతో దశాబ్దాల స్నేహం, ఉక్రెయిన్‌తో ఇటీవల బలపడిన సంబంధాలు మోదీని ఒక సమన్వయకర్తగా మార్చాయి. 2024లో మోదీ ఉక్రెయిన్ సందర్శన, జెలెన్‌స్కీతో చర్చలు, రష్యాతో సన్నిహిత సంబంధాలు భారత్‌ను శాంతి చర్చలకు మధ్యవర్తిగా నిలిపాయి. ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనలు, రష్యా ఆంక్షలు మధ్య సమతుల్యత సాధించడం మోదీకి పెద్ద సవాల్. అయితే, శాంతి ద్వారా పరిష్కారం, యుద్ధం ద్వారా కాదు అనే మోదీ సూత్రం రెండు దేశాలకూ ఆమోదయోగ్యంగా ఉంది. ఒకవేళ మోదీ ఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చగలిగితే, అది ప్రపంచ శాంతి దూతగా మోదీ స్థానాన్ని బలపరుస్తుంది.

ఒకవేళ మోదీ ఆధ్వర్యంలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరితే, ట్రంప్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఈ యుద్ధాన్ని ముగించాలని ఆశించారు, కానీ అలాస్కా సమావేశంలో విఫలమయ్యారు. మోదీ విజయం సాధిస్తే, ట్రంప్ ఒకవైపు ఈ శాంతిని స్వాగతించవచ్చు, ఎందుకంటే అది అమెరికా భౌగోళిక రాజకీయ లక్ష్యాలకు సహాయపడుతుంది. అయితే, మరోవైపు, ఈ విజయం మోదీకి గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు తెచ్చి, ట్రంప్ రాజకీయ ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. ట్రంప్ సలహాదారులు ఇప్పటికే భారత్‌ను మోదీ యుద్ధం అని విమర్శించారు, కాబట్టి మోదీ విజయం ట్రంప్ రాజకీయ వైఫల్యాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. Russia and Ukraine War.

మోదీ దౌత్య వ్యూహం ఒక రాజకీయ మాస్టర్‌స్ట్రోక్‌గా కనిపిస్తుంది. ఒకవైపు రష్యాతో సన్నిహిత సంబంధాలు, మరోవైపు ఉక్రెయిన్‌తో సహకారం, అదే సమయంలో అమెరికాకు స్వతంత్ర విదేశాంగ విధాన సందేశం ఈ మూడింటినీ మోదీ సమన్వయం చేస్తున్నారు. SCO సమావేశంలో మోదీ పుతిన్‌తో చర్చలు, జెలెన్‌స్కీతో ఫోన్ సంభాషణలు, ట్రంప్‌కు గట్టి సందేశం ఇవన్నీ భారత్ గ్లోబల్ రాజకీయ స్థానాన్ని బలపరిచాయి. మోదీ శాంతి చర్చలలో మధ్యవర్తిగా వ్యవహరిస్తే, అది భారత్‌ను గ్లోబల్ సౌత్ దేశాల నాయకుడిగా, బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థలో కీలక గేమ్ చేంజర్ గా నిలబెడుతుంది.