భారత రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయం..!

India’s 97 Tejas fighter jets: ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత రక్షణ రంగంలో భారత్ స్వదేశీ తయారీకి ఊపిరి పోస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో విదేశీ ఫైటర్ జెట్లపై ఆధారపడిన భారత్, ఇప్పుడు స్వదేశీ యుద్ధ విమానాలైన తేజస్‌పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి? మిగ్-21 స్థానంలో ఎలాంటి యుద్ధ విమానాలను తీసుకురానున్నారు? భారత్‌లో స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఇతర యుద్ధ విమానాలు ఏవి?

ఆపరేషన్ సిందూర్ విజయం భారత రక్షణ వ్యూహం చాలా మార్పుల వచ్చాయి. పాకిస్థాన్ తో ఘర్షణల సమయంలో భారత్ లో తయారైన స్వదేశీ ఆయుధాలు ఎంతో సత్తాని చాటాయి. ప్రపంచానికి భారత్ పవర్ ఏంటో చూపించాయి. స్వదేశీ తయారీకి కొత్త ఊపిరి పోశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 97 తేజస్ మార్క్-1A యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ భారీ ఆర్డర్‌ను బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అప్పగించనున్నారు. ఈ డీల్ విలువ సుమారు 1.2 లక్షల కోట్ల రూపాయలు, ఇది భారత రక్షణ రంగంలో అతిపెద్ద స్వదేశీ ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది. HAL ఇప్పటికే 40 తేజస్ మార్క్-1 విమానాలను భారత వైమానిక దళానికి సరఫరా చేసింది, కొత్త ఆర్డర్ ద్వారా తేజస్ ఫ్లీట్‌ను మరింత విస్తరించడంతో పాటు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయనుంది.

భారత వైమానిక దళంలో 1960ల నుంచి సేవలందిస్తున్న మిగ్-21 యుద్ధ విమానాలు సాంకేతికంగా వెనుకబడి, తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ సోవియట్ యుగం విమానాలు తక్కువ స్పేర్ పార్ట్స్ లభ్యత, అధిక నిర్వహణ ఖర్చులతో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 200కు పైగా మిగ్-21 విమానాలు కూలిపోవడంతో, ఈ పాత ఫ్లీట్‌ను రిటైర్ చేసి, ఆధునిక తేజస్ విమానాలతో భర్తీ చేయాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతికత, మల్టీ-రోల్ సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక భద్రతా ప్రమాణాలతో మిగ్-21లను తేజస్ యుద్ధ విమానాలు సమర్థవంతంగా రీప్లేస్ చేయనున్నాయి. భారత వైమానిక శక్తికి కొత్త బలాన్ని అందిచనున్నాయి.

తేజస్ యుద్ధ విమానం భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు ఒక గొప్ప ఉదాహరణ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రూపొందించిన తేజస్, 4.5 జనరేషన్ మల్టీ-రోల్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది 8.5 టన్నుల బరువుతో, 1.6 మాక్ వేగంతో 15,240 మీటర్ల ఎత్తులో ఎగరగలదు. 3,000 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంది. తేజస్‌లో అత్యాధునిక రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, నెట్‌వర్క్-సెంట్రిక్ వార్ఫేర్ సామర్థ్యాలు ఉన్నాయి. ఇందులో ఆస్ట్రా, డెర్బీ బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైళ్లు, లేజర్-గైడెడ్ బాంబులు, యాంటీ-షిప్ మిస్సైళ్లను మోసుకెళ్లగల 13 హార్డ్‌పాయింట్లు ఉన్నాయి. GE ఇంజన్‌తో పనిచేసే తేజస్, తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది, ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-గ్రౌండ్ ఆపరేషన్లలో మంచి పాత్ర పోషిస్తుంది.

తేజస్ విమానాలు భారత వైమానిక దళంలో కీలక బలంగా మారడమే కాక, దేశీయ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని పెంచుతున్నాయి. తేజస్ లో 65%కి పైగా స్వదేశీ విడి భాగాలు ఉంటాయి. HAL బెంగళూరు, నాసిక్‌లోని తయారీ ప్లాంట్లలో ఈ ఆర్డర్‌లను త్వరగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. విమాన వాహక నౌకలైన INS విక్రాంత్, INS విక్రమాదిత్య నుంచి ఆపరేట్ చేయడానికి తేజస్ నేవీ వెర్షన్ రూపొందించబడింది. అలాగే, తేజస్ ట్విన్-సీటర్ ట్రైనర్ వెర్షన్, డ్రోన్ వెర్షన్ వంటి విభిన్న రూపాలు భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానాలు ఆర్జెంటీనా, ఈజిప్ట్, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు. దీని ద్వారా భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త దిశను చూపనుంది.

తేజస్‌తో పాటు భారత్‌లో స్వదేశీయంగా అభివృద్ధి చేయబడుతున్న ఇతర యుద్ధ విమానాలు రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తయారు చేస్తున్న లైట్ యుటిలిటీ హెలికాప్టర్ సాయుధ దళాలకు రవాణా, నిఘా, రెస్క్యూ ఆపరేషన్లలో బహుముఖ పాత్ర పోషిస్తుంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనేది స్టెల్త్ సాంకేతికతతో కూడిన 5వ జనరేషన్ యుద్ధ విమానం, ఇది మిరాజ్-2000, జాగ్వార్, మిగ్-29 వంటి విమానాలను భర్తీ చేయనుంది, 2030 నాటికి ఫ్లైట్ టెస్టింగ్ ప్రారంభం కానుంది. HTT-40 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ భారత వైమానిక దళ పైలట్ల శిక్షణ కోసం రూపొందించబడింది, 2026 నాటికి సరఫరా ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టులు భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని పెంచడమే కాక, అంతర్జాతీయంగా భారత్‌కు గుర్తింపు తెస్తున్నాయి. India’s 97 Tejas fighter jets.

తేజస్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో ప్రధాన స్థానం సంపాదించడం ద్వారా రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలమైన పునాది వేస్తున్నాయి. విదేశీ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, అత్యాధునిక సాంకేతికతను దేశంలోనే అభివృద్ధి చేయడం ద్వారా భారత్ రక్షణ శక్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. తేజస్ ఉత్పత్తి ద్వారా దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే కాక, లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తేజస్ ఎగుమతి అవకాశాలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ డిఫెన్స్ విజన్‌కు తేజస్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా భారత వైమానిక దళానికి కొత్త తరం టెక్నాలజీతో బలాన్ని అందిస్తోంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q