అనే నేను..?

Cp Radhakrishnan Oath taking: బీజేపీ తాను అనుకున్న ఒక కార్యక్రమాన్ని మొత్తానికి పూర్తి చేయిస్తోంది. రాజకీయంగా ఎత్తులు, పై ఎత్తులతో ఉపా రాష్ట్రపతి ఎన్నికలు సాగాయి. చివరకు కమలనాథులదే పై చేయి అయ్యింది. ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్… రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక ఇప్పుడు ఆయన రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా కొనసాగుతారు. ఇది రాధాకృష్ణన్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన ఘట్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. చంద్రబాబు పార్టీ టీడీపీ.. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండడం వల్ల.. రాధాకృష్ణన్ విజయాన్ని సమర్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏలోని సీనియర్ నాయకులతో పాటు, ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి.

ఈ కార్యక్రమంతో బీజేపీ తన పట్టును నిలుపుకున్నట్లైంది. నిజానికి ఓ దశలో.. ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవం అవుతుందని బీజేపీ ఆశించింది. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కూడా కోరింది. కానీ.. ఇండియా కూటమి తమవైపు నుంచి అభ్యర్థిని నిలబెట్టడంతో బీజేపీకి పోరాటం తప్పలేదు. రాధాకృష్ణన్ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి.. బీజేపీ వ్యూహాత్మకంగా జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా అంచనాలు తప్పిపోకుండా వ్యవహరించి.. తమ అభ్యర్థిని గెలిపించుకుంది. తద్వారా మరోసారి ఇండియా కూటమికి షాక్ ఇచ్చినట్లైంది.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా సహా పలువురు మంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్‌ ధన్‌ఖడ్‌, వెంకయ్యనాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. రాజీనామా చేసిన తర్వాత ధన్‌ఖడ్‌ బహిరంగంగా కనపడడం ఇదే తొలిసారి.

సీపీ రాధాకృష్ణన్‌కి 68 ఏళ్లు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 మే 4న పుట్టారు. ఆయన తన యంగ్ ఏజ్ నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో క్రమంగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998, 1999 సంవత్సరాల్లో రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2003 నుంచి 2006 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర గవర్నర్‌గా వివిధ రాష్ట్రాల్లో సేవలందించారు. వ్యవసాయవేత్త, పారిశ్రామికవేత్త అయిన ఆయన… సమాజ సేవ, పేదల సాధికారతకు కృషి చేశారు. ఆయన విద్యాభ్యాసం గమనిస్తే…. వి.ఓ. చిదంబరం కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చేశారు. ఆయన టేబుల్ టెన్నిస్‌లో కాలేజీ ఛాంపియన్‌. క్రికెట్, వాలీబాల్‌ అంటే చాలా ఇష్టం.

ఉప రాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరిగాయి. ఇందులో రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా 452 ఓట్లతో విజయం సాధించారు, ఇండియా బ్లాక్ అభ్యర్థి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు పొందారు. మొత్తం 781 మంది ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 767 మంది ఓటు వేశారు. 15 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది గత ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే దగ్గరి మార్జిన్‌గా చెప్పవచ్చు. ఎన్డీఏకు 427 ఎంపీల మద్దతు ఉండగా, వైసీపీకి చెందిన 11 ఎంపీలు కూడా రాధాకృష్ణన్‌కు మద్దతు ఇచ్చారు. ఇది ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది. బిజూ జనతా దళ్ (బీజేడీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల నుంచి తప్పుకున్నాయి. ఇది రాధాకృష్ణన్ విజయాన్ని మరింత సులభతరం చేసింది. Cp Radhakrishnan Oath taking.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులు రాధాకృష్ణన్‌ను అభినందించారు. రాధాకృష్ణన్ తన విజయాన్ని “జాతీయవాద భావజాల” విజయంగా అభివర్ణించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యసభలో నిష్పక్షపాతంగా, గౌరవంగా వ్యవహరించే ఆయన, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.