
Prime Minister’s visit to Japan: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ టూర్ కేవలం ఒక దౌత్య పర్యటన కాదు, ఇది భారత్-జపాన్ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం. ఓ పక్క అమెరికా భారత్ పై టారిఫ్ లు విధించిన సమయంలో మోదీ జపాన్ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అటు మోదీ జపాన్ లో పర్యటిస్తుండగానే ఆ దేశ ట్రేడ్ నెగోషియేటర్ అమెరికా పర్యటన రద్దు చేసుకోవడం వెనుక రహస్యం ఏమిటి? 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఎలా బలోపేతమవుతున్నాయి? మోదీకి ఆ దేశంలో ఎలాంటి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఎంతో ఆసక్తికరంగా సాగింది. మోదీకి భారతీయ సమాజాంతో పాటు.. జపాన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యంతో మోదీకి వెల్ కం చెప్పారు. అటు మోదీ పర్యటనలో ఆయనకు లభించిన బహుమతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..? నరేంద్ర మోదీ టోక్యోలోని ఆలయంలో అడుగుపెట్టగానే, ఆలయ ప్రధాన పూజారి ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. అదే దరుమా డాల్. ఈ గుండ్రని, ఎరుపు రంగు గల ఈ బొమ్మ జపాన్ కు ఒక సాంస్కృతిక చిహ్నం. అలాగే దృఢసంకల్పం, సౌభాగ్యం, లక్ష్య సాధనకు చిహ్నం. ఈ బొమ్మ భారతదేశం నుంచి చైనా వెళ్లిన బోధిధర్మ బొమ్మ అని అంటారు. ఆయన జెన్ బౌద్ధమతాన్ని స్థాపించినవాడు. బోధిధర్మ తొమ్మిది సంవత్సరాల పాటు గోడ వైపు చూస్తూ ధ్యానం చేశారు. దీని వల్ల ఆయన చేతులు, కాళ్లు కోల్పోయాయని చెబుతారు. అందుకే దరుమా బొమ్మకు చేతులు, కాళ్లు ఉండవు. ఈ బొమ్మ గుండ్రని డిజైన్ కలిగి.. దానిని కొట్టినా మళ్లీ నిటారుగా నిలబడుతుంది.
దరుమా డాల్ కేవలం అలంకరణ వస్తువు కాదు, ఇది ఒక శక్తివంతమైన లక్ష్య సాధన సాధనం. ఈ డాల్‌ను కొనుగోలు చేసినప్పుడు, దాని రెండు కళ్లు ఖాళీగా ఉంటాయి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, ఒక కన్నును నల్ల రంగుతో రంగు వేస్తారు. ఆ లక్ష్యం సాధించిన తర్వాత, రెండవ కన్నును రంగు వేస్తారు, ఇది విజయాన్ని సూచిస్తుంది. ప్రధాని మోదీకి ఈ డాల్‌ను అందజేసినప్పుడు, పూజారి ఈ సంప్రదాయాన్ని పాటించి, భారత్-జపాన్ సంబంధాలు మరింత బలోపేతం కావాలనే కోరికతో ఒక కన్నును రంగు వేసినట్లు తెలియజేశారు. ఇలా బొమ్మ ఇచ్చే సంప్రదాయం జపాన్‌లో కొత్త సంవత్సరం, కొత్త వ్యాపారం, చదువు మొదలు పెట్టినప్పుడు శుభసూచకంగా ఇస్తారు.
భారత్-జపాన్ సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్నాయి, బౌద్ధమతం, సాంస్కృతిక సంబంధాలు కలిగిఉంది. టెక్నాలజీ భాగస్వామ్యం, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, రక్షణ సహకారం వంటి అంశాలు ఈ సంబంధాలు రెండు దేశాల మధ్య కొత్త ఊపిరి పోశాయి. న్యూక్లియర్ ఒప్పందం, సివిల్ న్యూక్లియర్ సహకారం కూడా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైన అంశాలు. అమెరికా-భారత్ సంబంధాలు బలహీనపడిన ఈ సమయంలో, జపాన్ ఒక విశ్వసనీయ ప్రత్యామ్నాయ మిత్రదేశంగా ఉద్భవిస్తోంది. క్వాడ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, భారత్-జపాన్-ఆస్ట్రేలియా త్రైపాక్షిక సహకారం ఒక కొత్త అవకాశంగా మారుతోంది.
ప్రస్తుతం ట్రంప్ టారిఫ్‌లు భారత్, జపాన్‌లతో సహా అనేక దేశాల ఆర్థిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. మోదీ జపాన్ పర్యటన సమయంలోనే ఆ దేశ ట్రేడ్ నెగోషియేటర్ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం ట్రంప్ కు షాక్ ఇచ్చింది. 550 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజీ చర్చలు వాయిదా పడ్డాయనే మాట వినిపిస్తోంది. అమెరికా ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా, జపాన్ పరస్పర లాభదాయక ఒప్పందాలను కోరుతోంది. ఈ సందర్భంలో మోదీ జపాన్ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా మారింది.
అలాగే ప్రధాని మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో రక్షణ సహకారం, వాణిజ్య పెట్టుబడులు, డిజిటల్ టెక్నాలజీ, క్లైమేట్ యాక్షన్, ఇన్నోవేషన్ వంటి అనేక రంగాలపై చర్చించారు. అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జపాన్ మద్దతు అత్యంత కీలకం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి క్వాడ్ ఫ్రేమ్‌వర్క్‌లో భారత్-జపాన్ సహకారం కూడా చర్చకు వచ్చింది. జపనీస్ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో, భారత్‌లో పెట్టుబడి అవకాశాలను మోదీ ప్రస్తావించారు. ముఖ్యంగా టెక్నాలజీ బదిలీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
టోక్యో బిజినెస్ ఫోరమ్‌లో మోదీ సందేశం ఏంటి..?
టోక్యోలో జరిగిన బిజినెస్ ఫోరమ్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, జపాన్ కలిసి ఆసియాలో స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం పనిచేస్తాయని అన్నారు. అమెరికా టారిఫ్‌ల ఒత్తిడి సమయంలో, జపాన్‌తో భాగస్వామ్యం ప్రాధాన్యతను మోదీ వివరించారు. టెక్నాలజీ బదిలీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకారం, మాన్యుఫాక్చరింగ్ కలిసి పనిచేయడం వంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. ముఖ్యంగా భారత్ లో బుల్లెట్ ట్రైన్ నెట్ వర్క్ నిర్మాణంలో జపాన్ సహకారాన్ని మోదీ గుర్తు చేశారు. Prime Minister’s visit to Japan.
భారత్, చైనా కలిసి పని చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత దృష్ట్యా.. ప్రపంచ ఆర్థిక క్రమానికి ఓ స్థిరత్వాన్ని తీసుకురావాలంటే ఇరుదేశాలు ముందడుగు వేయక తప్పదన్నారు. జపాన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో పరస్పర గౌరవం, ఆసక్తి, సున్నితత్వంతో వ్యవహరిస్తూ.. వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్-చైనాల మధ్య బలపడనున్న స్థిరమైన, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q