హీట్ పుట్టిస్తున్న బీహార్ రాజకీయం..!

Congress rally: బీహార్‌లో ఓ కాంగ్రెస్ నేత మోదీ, ఆయన తల్లిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్నాయి. బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల వల్లే పట్నాలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఈ వ్యాఖ్యల వల్లే కాంగ్రెస్ అగ్రనేతలపై కేసులు నమోదయ్యాయి. అసలు కాంగ్రెస్ నేతలు ఏం వ్యాఖ్యలు చేశారు..? ఈ ఘటనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు? బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏమిటి? బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వివాదం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపనుంది?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బిహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల దర్భంగలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. నౌషాద్ అనే కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వీ యాదవ్ ఉన్న ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై అసభ్యమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దర్భంగ బీజేపీ నేతలు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో, దర్భంగ పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. నిందితుడు నౌషాద్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై బీజేపీ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అంతేకాకుండా, ఈ ర్యాలీని నిర్వహించినందుకు రాహుల్ గాంధీపై కూడా బీజేపీ ప్రత్యేకంగా ఫిర్యాదు చేసింది, దీనితో ఈ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపింది.

ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, ఆయన తల్లి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. మోదీ తల్లి హీరాబెన్ ఒక సామాన్య కుటుంబంలో జీవితం గడిపి, విలువలతో పిల్లలను పెంచి, తన కొడుకును దేశానికి విశ్వసనీయ నాయకుడిగా తీర్చిదిద్దారని… అలాంటి మహిళపై అసభ్య పదజాలం వాడడం భారతీయులు ఏమాత్రం సహించరు అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు, ఇది కాంగ్రెస్ నీచమైన రాజకీయ సంస్కృతిని చాటుతుంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టారు.

అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను తీవ్రంగా తిరస్కరించింది. బీజేపీ ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చడానికి ఈ ఘటనను ఉపయోగిస్తోందని ఆరోపిస్తోంది. బీజేపీ ఎన్నికలలో ఓటమి భయంతో ఇలాంటి డ్రామాలను క్రియేట్ చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే, ఈ ఘటన రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఉన్న ర్యాలీలో జరగడం వల్ల ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ర్యాలీలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానితులుగా ఉండటం కూడా గొడవ పెద్దదవ్వడానికి కారణమైంది. Congress rally.

పట్నాలో ఈ వివాదం హింసాత్మక రూపం దాల్చింది. కాంగ్రెస్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టగా, రెండు పార్టీల కార్యకర్తలు జెండాలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. రాళ్ల దాడులు, బాహాబాహీ ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ హింసాత్మక ఘర్షణలు బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత హీటెక్కించాయి. బీహార్‌లో ప్రతి కొడుకు మోదీ తల్లికి జరిగిన అవమానానికి తగిన సమాధానం ఇస్తాడని బీజేపీ నేతలు తెలిపారు. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాం అని హెచ్చరించారు. అయితే ఈ ఘర్షణల వెనుక ప్రభుత్వం హస్తం ఉందని… నీతీష్ కుమార్ తప్పు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదం రాజకీయంగా కీలకమైన అంశంగా మారింది. బీజేపీ ఈ ఘటనను కాంగ్రెస్ నీచమైన స్వభావంగా చిత్రీకరిస్తూ, దీనిని ఎన్నికల ప్రచారంలో ఒక ఆయుధంగా ఉపయోగిస్తోంది. కాంగ్రెస్ ఎప్పుడూ మోదీని దూషించింది, ద్వేష పూరిత సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది బీజేపీ అంటోంది. అటు ఈ ఘటన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది, ముఖ్యంగా తేజస్వీ యాదవ్ ర్యాలీలో ఉన్నందున ఆయన కూడా పరోక్షంగా లక్ష్యంగా మారారు. బీహార్‌లో మాతృ గౌరవం, సాంస్కృతిక విలువలు వంటి భావోద్వేగ అంశాలు ఎన్నికలలో పెద్ద పాత్ర పోషిస్తాయి, దీనిని బీజేపీ తమ అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q