
Karnataka ballot paper Election: కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అనధికారిక అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణలను బలపరచడానికి సిద్దరామయ్య సర్కార్ పలు నిర్ణయాలు తీసుకున్నారా… ఇంతకు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ తో నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ అనధికారిక అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణలను బలపరచడానికి సిద్దరామయ్య సర్కార్ ఈ ఆలోచన చేస్తోంది. అలాగే రాష్ట్రంలో సొంతంగా ఓటర్ లిస్ట్ తయారు చేసుకోవడానికి నడుంబిగించింది.
కేంద్రంలో ఉన్న బీజేపీతో ఈసీ కుమ్మక్కు అయిందని రాహుల్ గాంధీ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య సర్కార్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల సమగ్రతను కాపాడటానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ఎన్నికల చట్టాలలో మార్పులు చేసినట్లు అయితే బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జీఎస్ సంగ్రీషి అన్నారు.
రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలను కర్ణాటక నుంచే ప్రారంభించారు. బెంగళూర్ లో ర్యాలీ నిర్వహించిన ఆయన ఓట్ల చోరితోనే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.ఇందుకు ఉదాహారణగా ఆయన బెంగళూర్ సెంట్రల్ లోక్ సభ స్థానమైన మహాదేవపురలో ఓ ఇంటిలో 80 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. లక్ష ఓట్లకు పైగా దొంగ ఓట్లు వేశారని అన్నారు. ఇంతకుముందు ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పుడూ ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారని ఆరోపణలు గుప్పించేది. ప్రస్తుతం అది కాస్త ఓట్ల చోరి అంటూ కొత్త ఆరోపణలకు దిగింది. అయితే మహాదేవపురలో ఒకే ఇంటిలో ఉన్న ఓట్లకు సంబంధించి ఆరా తీసినప్పుడూ అక్కడికి ఎక్కువగా వలస కూలీలు వస్తున్నట్లు తెలిసింది. వారంతా వివిధ పనులు చేసుకుంటూ బెంగళూర్ లో జీవిస్తున్నారని తేలింది.
కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ కూడా స్పందించింది. రాహుల్ గాంధీ అఫిడవిట్ తో తమకు ఫిర్యాదు ఇవ్వాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని కోరింది. దీనిపై ఆయన ఎన్నికల సంఘానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కర్ణాటక క్యాబినేట్ ఇదే అంశంపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో నిర్వహించే అన్ని గ్రామ పంచాయతీ, తాలుకాలు, జిల్లా పంచాయత్, మున్సిపల్ ఎన్నికలను కేవలం బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని, ఇందుకు అవసరమైన అన్ని చట్టాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక లో ఇక నుంచి ప్రత్యేకంగా ఓటర్ లిస్ట్ తయారు చేసుకోవాలని కూడా సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నిలకు వీటినే ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇన్నాళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటర్ లిస్ట్ ను మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించే వారు. ఇక ముందు వాటిని స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడబోమని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించబోతోంది. ఇందుకు కర్ణాటక క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించడానికి మరొక కారణంగా ఈవీఎంల కొరత, సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఉదహరిస్తోంది.ఒకే సమయంలో జిల్లా, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపింది. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. కాబట్టి వాటిని ఇప్పుడు ఏకకాలంలో నిర్వహించాలని అనుకుంటోంది. ఓట్ చోరి ఆరోపణలు న్యాయస్థానాల్లో నిలబడతాయో లేదో అనే సంశయంతో ప్రభుత్వం ఈ కారణాలను ఉదహరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ‘‘ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
ఇక మరోసారి ఈవీఎలం పారదర్శకత, విశ్వసనీయతపై సందేహాలు తలెత్తాయి. ప్రపంచంలోని అనేక అభివృద్ది చెందిన దేశాలు కూడా ఈవీఎంలపై సందేహాలను లేవనెత్తి బ్యాలెట్ పేపర్లకు తిరిగి వచ్చాయి.ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఓటర్లలో గందరగోళం రాకూడదు. కర్ణాటకలో బ్యాలెట్ పేపర్ విధానానికి మొగ్గు చూపాం’’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఉనికిలో లేని చాలామంది పేర్లను జాబితాలో ఉన్నాయి. దీని కారణంగా ఈవీఎంలపై పెరుగుతున్న అనుమానాల కారణంగా బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని క్యాబినేట్ భావించింది’’ అని ఆయన చెప్పారు. Karnataka ballot paper Election.
కర్ణాటక స్థానిక సంస్థల చట్టాలలోని మార్పును మంత్రి వర్గం ఆమోదించిన తరువాత దానిని గవర్నర్ కు సమర్పించాలి. ఇది చట్టంగా మారితే దానిని శాసనసభ, శాసనమండలిలో ఆమోదించాలి. అయితే శీతకాల అసెంబ్లీ సమావేశాలు నవంబర్ లో ఉన్నందున ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం కష్టం. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి సిద్ధరామయ్య సర్కార్ ప్రయత్నిస్తోంది. ఆర్డినెన్స్ జారీ అయిన తరువాత ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం, చేర్చడం, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించడం అనే అధికారాలు ఎన్నికల కమిషన్ కు బదిలీ అవుతాయి. ఇది ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తాయి. మరోపక్క రాబోయే 15 రోజుల్లో వీటి పద్దతును ఖరారు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతుండడంతో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.