ఫ్యామిలీ రాజకీయాలు…!!

Family Politics: ఇప్పటివరకు అనేక పార్టీలు.. కుటుంబాలను చీల్చిన సంఘటనలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకాగాంధీ నుంచి మొదలుకుని.. తాజాగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వరకు.. ఎంతో మంది పార్టీల నుంచి బయటికి రావడం, సస్పెండ్ అయ్యారు. ఇక కవిత సస్పె్న్షన్ ఎపిసోడ్‎తో దేశ వ్యాప్తంగా పార్టీల నుంచి సస్పెండ్ అయిన కుటుంబ సభ్యుల గురించి చర్చ మొదలైంది. మరీ వివిధ కారణాలతో సొంత పార్టీ నుంచి వేటుకు గురైన కొందరు ప్రముఖ నేతల గురించి తెలుసుకుందాం…

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గత కొద్ది రోజులుగా కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న కారణంతో కేసీఆర్ తన సొంత కూతురినే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

Maneka Gandhi: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజీవ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. మేనకా గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువైనా బీజేపీలో కొనసాగుతున్నారు. సంజయ్ గాంధీ వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలనుకున్న మేనకా గాంధీ ఆశయాలు.. ఇందిరాగాంధీ ఆలోచనలకు సరిపోలేదు. ఇక అప్పటికే తన పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దే పనిలో ఇందిరా గాంధీ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే పార్టీలోని తన మద్దతుదారులతో కలిసి 1982లో ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మేనకా గాంధీ సొంతంగా ఏర్పాటు చేయడం సంచలనం రేపింది. ఇది కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించే చర్యగా భావించిన ఇందిరా గాంధీ.. మేనకా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం జనతాదళ్ పార్టీలో చేరి.. ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మేనకాగాంధీ.. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

Nandamuri Harikrishna: దివంగత నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ లో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. పార్టీ లైన్ క్రాస్ చేశారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు.. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసిన హరికృష్ణ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు. దీంతో చివరికి తన పార్టీని టీడీపీలో హరికృష్ణ విలీనం చేశారు.

MK Alagiri: ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కగజం (డీఎంకే) పార్టీలోనూ కూడా కుటుంబ పోరు సాగింది. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల మధ్య రాజకీయ వారసత్వం విషయంలో వివాదం తలెత్తింది. కరుణానిధి ఉన్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అళగిరి పార్టీ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటంతో డీఎంకే నుంచి బహిష్కరణ వేటు వేశారు. ఆ తర్వాత కరుణానిధి రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ పార్టీని నడిపించి.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు.

Sasikala: అన్నాడీఎం పార్టీలో కీలక నేతల్లో శశికళ ఒకరు. ఆమె దివంగత తమిళనాడు సీఎం జయలలితకు సోదరి గుర్తింపు. జయలలిత హయాంలో ఆమె అన్నాడీఎంకే పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయ్యారు. కానీ జయలలిత మరణం తర్వాత పార్టీ చోటు చేసుకున్న పరిణామాలతో శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు.

Shivpal Singh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‎ను కొన్నేళ్ల పాటు పరిపాలించిన సమాజ్ వాదీ పార్టీలోనూ కుటుంబ పోరు కొనసాగింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతోపాటు.. వ్యతిరేకంగా వైఖరి అనుసరించడంతో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్.. తన సోదరుడు శివపాల్ యాదవ్‌ను ఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్.. సమాజ్‌వాదీ పార్టీని నడిపిస్తున్నారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ లోక్‌సభ ఎంపీలుగా ఉన్నారు.

Anupriya Patel: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మరో పార్టీ అప్నాదళ్‌లోనూ కుటుంబ పోరు నెలకొంది. అప్నాదళ్ పార్టీ వ్యవస్థాపకులు సోన్ లాల్ పటేల్.. తన కుమార్తె అనుప్రియ పటేల్‌ పైనే సస్పెన్షన్ వేటు వేశారు. అప్నాదళ్ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేసినందుకు.. అనుప్రియ పటేల్‎పై చర్యలు చేపట్టినట్లు ఆ పార్టీ తెలిపింది. సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అనుప్రియా పటేల్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం అనుప్రియా పటేల్.. కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.

Tej Pratap Singh Yadav: బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీలోనూ అధికారం కోసం పార్టీలో పోరు నడిచింది. ఆర్జేడీ పార్టీ నుంచి తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆ పార్టీ అధినేత, బిహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడంతో తేజ్ ప్రతాప్ యాదవ్‌పై వేటు వేశారు.

Prajwal Revanna & Dushyant Chautala: సెక్స్ కుంభకోణంలో దోషిగా తేలడంతో తన మనువడు, మాజీ ఎంపీ రేవణ్ణను జీడీఎస్ నుంచి బహిష్కరించారు మాజీ ప్రధాని దేవగౌడ. ఐఎన్ఎలీడి పార్టీ వ్యవస్థాపక సభ్యులు, హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడటంతో తన మనవడు దుష్యంత్ చౌతాలాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Ajit Pawar: మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లోనూ కుటుంబ పోరు రచ్చకెక్కింది. రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ స్థాపించిన ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్.. ఏకంగా పార్టీనే చీల్చారు. 2023 జూలైలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే శివసేన- బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో షిండే శివసేన-బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి.

Raj Thackeray: మహారాష్ట్రలో బాలాథ్రాకే స్థాపించిన శివసేన పార్టీ నుంచి రాజ్ థాకరే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. బాలాథ్రాకే తమ్ముడు శ్రీకాంత్ థాక్రే కుమారుడే రాజ్ థాక్రే. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో సొంత తమ్ముడి కుమారుడు అని కూడా చూడకుండా రాజ్ థాక్రే పార్టీ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేవా సమితి పేరుతో రాజ్ థ్రాకే కొత్త పార్టీ పెట్టారు.

YS Sharmila: ఏపీలో తన సోదరుడు వైఎస్ జగన్‎తో విభేదించి వైసీపీకి రాజీనామా చేశారు షర్మిల. ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించి రాజకీయాలు చేశారు. కొన్నాళ్లకు వైస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q