
Nepal Army Curfew: జెన్-జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. నేపాల్‌ను ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కూడా కొనసాగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నాల్లో సహకరించాలని సైన్యం కోరింది. మరోవైపు, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారుల బృందంతో సమావేశం అయ్యారు.. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు ఇంతకు ఏంటా డిమాండ్లు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం రణరంగంగా మారింది. రెండు రోజులుగా జరిగిన విధ్వంసానికి నేపాల్ రాజధాని ఖాట్మండు అతలాకుతలం అయిపోయింది. ప్రభుత్వ భవనాలు, కార్లు, ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇక మాజీ ప్రధాని ఇంటికి నిప్పుపెట్డడంతో మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మీ చిత్రాకార్ సజీవ దహనం అయ్యారు. ఇక మంత్రులనైతే పరిగెత్తించి కొట్టారు. సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్కసారిగా పెల్లుబికిన ఆందోళనల తీవ్రతకు కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో సైనికులు రాజధాని కాఠ్‌మాండూ వీధుల్లో పహారా కాస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ వేళ.. విధ్వంసం, దోపిడీ, దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నేపాల్ (Nepal)ను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మన దేశం భద్రతను పెంచింది. ‘‘భారత్-నేపాల్ సరిహద్దులో హై అలర్ట్ జారీ చేశాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర సాయుధ పోలీసు దళం సహస్త్ర సీమా బల్ భద్రతను పర్యవేక్షిస్తోంది’’ అని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూగబోయాయి. తమ రోజువారీ జీవనానికి ఆటంకం ఏర్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ యువతరంగం నేపాల్ పాలనలో సమూల మార్పులు ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగా కొన్ని డిమాండ్లను ముందుంచింది. ‘‘ఈ ఉద్యమం ఒక పార్టీ, ఒక వ్యక్తి కోసం కాదు. మొత్తం ఒక జనరేషన్, దేశ భవిష్యత్తు కోసం. కొత్త రాజకీయ వ్యవస్థ ఆధారంగానే శాంతి నెలకొంటుంది.
అధ్యక్షుడు, నేపాల్ సైన్యం మా ప్రతిపాదనలను సానుకూలంగా అమలుచేస్తుందని భావిస్తున్నాం’’ అని ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని, మూడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. అలాగే ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగాన్ని పారదోలేందుకు, వలసలు అరికట్టేందుకు, సామాజిక అన్యాయాన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వీరి బృందం ఆర్మీ ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడిని కలవనుంది.
నేపాల్‌లో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే అంబులెన్సులు, శవపేటికలను తీసుకువెళ్లే వాహనాల వంటి అత్యవసర సేవలకు చెందిన వాహనాలకు అనుమతి ఇచ్చారు. నిరసనల పేరుతో ఏ విధమైన నిరసనలు, విధ్వంసం, దోపిడీ, అగ్నిప్రమాదాలు, వ్యక్తులు, ఆస్తులపై దాడులు చేస్తే వాటిని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు, భద్రతా సిబ్బంది కఠిన చర్యలు తీసుకుంటారు,” అని సైన్యం పేర్కొంది. పౌరులు, మీడియా ప్రతినిధులు కూడా పుకార్లను పట్టించుకోకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ అసాంఘిక వ్యక్తులు ఆందోళనల పేరుతో వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, అగ్నిప్రమాదాలు, దోపిడీ, వ్యక్తులపై హింసాత్మక దాడులు, అత్యాచార ప్రయత్నాలు వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు” అని ప్రకటనలో సైన్యం పేర్కొంది.ఇదిలా ఉండగా, ఖాట్మాండు విమానాశ్రయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం అయిన సింగ్‌దుర్భార్ వంటి కీలక ప్రదేశాలలో సైన్యం భద్రతను తమ ఆధీనంలోకి తీసుకుంది. సరిహద్దులను మూసివేశారు.
ఇక నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ సైన్యం అప్రమత్తం అయింది. ఇక భారతీయ పౌరుల కోసం సహాయం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. సహాయం కోసం హెల్ప్‌లైన్లకు ఫోన్లు చేయాలని భారత్ కోరింది. ఇక నేపాల్ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని భారత్ తెలిపింది.
రాజీనామా చేసి 24 గంటలు గడుస్తున్నా ఓలి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. ఆయనను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు ఏమైనా దాడి చేశారు. లేదంటే దుబాయ్‌కి పారిపోయారా? అన్నది ఇంకా తెలియలేదు. దీనిపై సైన్యం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఓలి సమాచారం తమకు కూడా తెలియదని సైన్యం వెల్లడించింది. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. క్షేమంగానే ఉన్నారా? లేదంటే దుబాయ్ వెళ్లిపోయారా? చర్చ నడుస్తోంది. Nepal Army Curfew.
అయితే ఓలి రాజీనామా చేశాక అజ్ఞాతంలోకి వెళ్లారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా నేపాల్ సైన్యం ఓలిని తన ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చిందని ఖాట్మండు నుంచి నివేదికలు అందాయి. కానీ ఆయన ఎక్కడున్నారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే ఓలి మయన్మార్ రాజధాని నేపిడాకు పారిపోయినట్లు మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని సైన్యం కొట్టిపారేస్తోంది. సైన్యం ఇంకా అధికారింగా నిర్ధారించలేదు.