భూమికి క్షేమంగా తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా..!

Shubhamshu Shukla Axiom-4 mission: భారత అంతరిక్ష చరిత్రలో మరో బంగారు అధ్యాయం చేరింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష వీరుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి విజయవంతంగా తిరిగి వచ్చారు. ఈ చారిత్రక యాత్ర 41 సంవత్సరాల తర్వాత మరోసారి అంతరిక్షంలో భారత్‌ కీర్తి పతకాన్ని ఎగురవేసింది. అసలు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి ఎలా చేరింది? శుభాంశు శుక్లా తిరిగి రావడంతో భారత్‌లో ఎలాంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి? ఇప్పుడు శభాంశు సుక్లా ఏం చేయబోతున్నారు?

యాక్సియం-4 మిషన్‌ విజయవంతమైంది. శుభాంశు శుక్లా అలాగే ముగ్గురు ఇతర అంతరిక్ష యాత్రికులు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా భూమికి సురక్షితంగా చేరారు. జూన్ 25న నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఐఎస్ఎస్ కు వెళ్లిన ఈ టీమ్ 18 రోజులు అక్కడే ఉంది. సోమవారం ఐఎస్ఎస్ నుంచి అన్ డాకింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01 గంటలకు కాలిఫోర్నియా తీరంలోని శాన్ డియాగో సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ డీ-ఆర్బిట్ బర్న్ ప్రక్రియ ద్వారా భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఈ ప్రక్రియ సుమారు 18 నిమిషాలు కొనసాగింది. రికవరీ టీమ్‌లు స్పేస్‌క్రాఫ్ట్‌ను షిప్‌కు చేర్చాయి. తర్వాత స్పేష్ షిప్ నుంచి శుభాంశు శుక్లా, ఇతర వ్యోమగాములు బయటకు వచ్చారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.., ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా స్పేష్ స్టేషన్ కు తరలించారు.

శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ యాత్ర విజయవంతం కావడంతో భారత్‌లో సంబరాలు మిన్నంటాయి. అంతకు ముందు శుక్లా క్షేమంగా తిరిగి రావాలని చాలా మంది పూజలు చేశారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత భారత వ్యోమగామి స్పేస్ లోకి వెళ్లడం దేశవ్యాప్తంగా గర్వకారణంగా నిలిచింది. శుభాంశు శుక్లా స్వస్థలమైన లక్నోలో, వందలాది విద్యార్థులు, ఆయన తల్లిదండ్రులు ఈ లాంచింగ్.. ల్యాండింగ్ ను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కర్ణాటక డిప్యూటీ సిఎం డి.కె. శివకుమార్, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ నాయకుడు హేమంత్ సోరెన్ వంటి రాజకీయ నాయకులు శుభాంశు యాత్రను భారత అంతరిక్ష కార్యక్రమంలో మైలురాయిగా అభివర్ణించారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త మైల్స్వామీ అన్నాదురై, ఈ మిషన్ భారత యువతకు స్ఫూర్తినిస్తుందని, దేశం మరిన్ని అంతరిక్ష విజయాలను సాధిస్తుందని అన్నారు. Shubhamshu Shukla Axiom-4 mission.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంతో శుభాకాంక్షలు తెలియజేశారు. లాంచ్ సమయంలో.. అలాగే స్పేస్ క్రాఫ్ట్ భూమికి వచ్చిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు. శుభాంశు శుక్ల ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. శుభాంశు శుక్లా తన చారిత్రక యాత్ర తర్వాత భూమికి తిరిగి రావడంతో దేశం ఆనందంలో మునిగిపోయిందని… ఐఎస్ఎస్‌కు వెళ్లిన మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా, ఆయన తన అంకితభావం, ధైర్యం, స్ఫూర్తితో ఎంతో మంది కలలను సాకారం చేశారని మోదీ తెలిపారు.

జూన్ 25న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌పై డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లాతో పాటు, మరో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత, జూన్ 26న స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్‌కు విజయవంతంగా డాక్ చేసింది. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌లో 18 రోజుల పాటు ఉన్నారు. 310 భూప్రదక్షిణలు పూర్తి చేసి.. సుమారు 1.3 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ సమయంలో ఆయన ఇస్రో రూపొందించిన 7 మైక్రోగ్రావిటీ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగాల్లో మైక్రోగ్రావిటీలో మెథి, ముంగ్ బీన్స్ మొలకెత్తడం, మైక్రోఆల్గీ పెంపకం, కండరాల క్షీణతపై అధ్యయనం ఉన్నాయి. జూన్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు, జూలై 4, 8 తేదీల్లో విద్యార్థులతో హామ్ రేడియో సంభాషణలు జరిపారు, జూలై 6న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్‌తో చర్చలు జరిపారు.

శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ అనుభవం భారత్‌కు ఎలా ఉపయోగపడనుంది?
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర అనుభవం భారత స్పేస్ ప్రోగ్రాంకు ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా గగన్‌యాన్ మిషన్‌కు ఎంతో కీలకం. ఈ మిషన్ ద్వారా శుక్లా పొందిన అనుభవం 2027లో నిర్వహించే గగన్‌యాన్ కీలకం కానుంది. శుభాంశు నిర్వహించిన ప్రయోగాలు, ముఖ్యంగా మైక్రోఆల్గీ, టార్డిగ్రేడ్స్, కండరాల క్షీణతపై అధ్యయనాలు, చంద్రుడు, మార్స్ మిషన్‌ల కోసం జీవన సహాయ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ఈ ప్రయోగాల ఫలితాలు భారత్‌లోని 500కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ను అంతరిక్ష టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలకు కారణం కానున్నాయి. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ స్థాపన, 2040 నాటికి చంద్రయాన్ మిషన్‌కు ఈ అనుభవం బలమైన పునాదిని అందిస్తుందని ఇస్రో అధికారి నీలేష్ ఎం. దేశాయ్ అన్నారు.

Also Read: https://www.mega9tv.com/national/kerala-nurse-nimisha-priyas-death-sentence-commuted-attempt-to-give-death-money/