
Indian Airforce Retirement of MiG-21: పాతకాలం నాటి మిగ్-21 యుద్ధ విమానాలు ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కనుమరుగుకానున్నాయి. దశాబ్దాలుగా తన సేవలతో చరిత్ర సృష్టించిన మిగ్-21 యుద్ధ విమానాలకు IAF అధికారికంగా వీడ్కోలు పలకనుంది. భారత వైమానిక దళంలో మిగ్-21లకు ఎంత ఘనకీర్తి ఉందో అంతేస్థాయిలో అపకీర్తి కూడా ఉంది. ఈ ఫైటర్ జెట్ ను ఎక్కాలంటేనే పైలెట్లు వణికిపోతారు. అసలు మిగ్-21లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు రిటైర్ చేస్తోంది..? అసలు మిగ్ 21లపై ఉన్న విమర్శలు ఏంటి..? వీటి స్థానంలో ఎలాంటి కొత్త యుద్ధ విమానాలు రానున్నాయి..?
భారత వైమానిక దళం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మిగ్-21 యుద్ధ విమానాలను పూర్తిగా తప్పించనుంది. ప్రస్తుతం IAF వద్ద 36 మిగ్-21విమానాలు మాత్రమే ఉన్నాయి. వీటిని కూడా చివరి విడతగా తొలగించనున్నారు. ఈ విమానాల స్థానంలో దేశీయంగా తయారైన లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ Mk-1A విమానాలను IAF తన స్క్వాడ్రన్‌లలో చేర్చనుంది. 2026 మార్చి నాటికి మరిన్ని తేజస్ విమానాలు అందుబాటులోకి రానున్నాయి.
మిగ్-21 విమానాలు ఫ్లయింగ్ కాఫిన్, విడో మేకర్ అనే అపకీర్తిని సంపాదించాయి. అంటే ఈ యుద్ధ విమానాలు ఎక్కితే ఫైలెట్ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడా లేదా అని చెప్పలేం. ఎంతో మంది పైలెట్ల ప్రాణాలను మిగ్-21లు బలితీసుకున్నాయి. 1963 నుంచి ఇప్పటివరకు 400కి పైగా మిగ్-21విమానాలు కూలిపోయి, 200 మందికి పైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. పాత టెక్నాలజీ, ఇంజిన్ వైఫల్యాలు, ఎలక్ట్రానిక్స్ సమస్యలు, విడిభాగాల కొరత, పక్షులు ఢీకొట్టడం వంటి అంశాలు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు. ఇప్పుడంటే తగ్గాయి కానీ.. గతంలో ప్రతీ నెల ఒక మిగ్ విమానం కూలిపోయిందనే వార్తలు పేపర్లలో వచ్చేవి. దీంతో మిగ్ లపై ఒక పెద్ద అపనమ్మకం ఏర్పడింది. Indian Airforce Retirement of MiG-21.
మిగ్-21 విమానాలు 1963లో సోవియట్ యూనియన్ నుంచి భారత్‌కు వచ్చాయి. ఇవి భారత్‌లో ప్రవేశపెట్టిన తొలి సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలు. 1965, 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధాలు, 1999 కార్గిల్ యుద్ధం, 2019 బలాకోట్ ఎయిర్‌స్ట్రైక్‌లలో మిగ్-21లు కీలక పాత్ర పోషించాయి. భారత వైమానిక దళానికి అనేక విజయాలను అందించాయి. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో మిగ్-21 లు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను కూల్చి, గణనీయ విజయాలను సాధించాయి. 1980ల నుంచి ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ప్రాథమిక రక్షణ విమానాలుగా సేవలందించాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ స్క్వాడ్రన్‌లను నిర్మించడం, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వందలాది పైలట్లు, టెక్నీషియన్లకు శిక్షణ అవకాశాలను కల్పించడంతో సంఖ్యా పరంగా మిగ్-21లు కీలక పాత్ర పోషించాయి. అప్పట్లో గరిష్ఠంగా 900కి పైగా మిగ్-21విమానాలు IAFలో ఉండగా, వీటిలో 600కి పైగా హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా దేశీయంగా తయారు చేశారు. దశాబ్దాలుగా IAF రక్షణ వ్యవస్థకు మిగ్ లు మూలస్తంభంగా నిలిచాయి. తర్వాత చాలా వరకు పాతపడటం, కొన్ని ప్రమాదాలకు గురికావడంతో వీటి వాడకాన్ని క్రమంగా తగ్గించేశారు.
మిగ్-21విమానాలు అనేక సమస్యలను ఎదుర్కొన్నాయి. సౌత్ ఏషియన్ వాయిసెస్, IPCS నివేదికల ప్రకారం, ఈ విమానాల సింగిల్ ఇంజిన్ డిజైన్ ఇంజిన్ వైఫల్యాలకు, బర్డ్ హిట్స్‌కు హాని కలిగించేలా ఉంది. హాల్ తయారు చేసిన ఇంజిన్లలో సర్వీస్ సమస్యలు, విడిభాగాల కొరత, పాత టెక్నాలజీ వంటి అంశాలు ప్రమాదాలను పెంచాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిభాగాల సరఫరా ఆగిపోవడం, ఆధునిక యుద్ధ అవసరాలకు మిగ్ 21ల సామర్థ్యం తగ్గడం కూడా రిటైర్మెంట్‌కు కారణాలుగా నిలిచాయి.
మిగ్ 21ల స్థానంలో దేశీయంగా తయారైన LCA తేజస్ Mk-1A విమానాలను IAF ప్రవేశపెడుతోంది. 36 తేజస్ Mk-1A విమానాలు ఇప్పటికే IAFలో చేరాయి. 2026 మార్చి నాటికి మరిన్ని చేరనున్నాయి. ఇవి తక్కువ బరువు, ఆధునిక టెక్నాలజీ, మల్టీ-రోల్ సామర్థ్యంతో మిగ్ 21లకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. అదనంగా, సుఖోయ్-30 MKI, రాఫెల్ వంటి హెవీ, మల్టీ-రోల్ యుద్ధ విమానాలు ఇప్పటికే IAF స్క్వాడ్రన్‌లలో ఉన్నాయి. తేజస్ Mk-1Aతో పాటు, భవిష్యత్తులో అమ్కా కూడా IAF సామర్థ్యాన్ని పెంచనుంది.
LCA తేజస్ Mk-1A, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన ఒక సింగిల్-ఇంజన్, మల్టీ-రోల్ సూపర్‌సోనిక్ యుద్ధ విమానం. ఇది ఒకేసారి 9 హార్డ్‌పాయింట్లలో బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్, ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-గ్రౌండ్ మిసైల్స్, అడ్వాన్స్‌డ్ షార్ట్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్ లను మోసుకెళ్లగలదు. దీని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లో రాడార్ వార్నింగ్ రిసీవర్, సెల్ఫ్-ప్రొటెక్షన్ జామర్, చాఫ్, ఫ్లేర్ డిస్పెన్సర్‌లు ఉన్నాయి, ఇవి శత్రు రాడార్లు, మిసైల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి. దీని తేలికైన డిజైన్, కార్బన్-ఫైబర్ కాంపోజిట్‌ల వాడకం విమాన బరును తగ్గించి, అధిక వేగాన్ని అందిస్తాయి. మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యం దీని ఆపరేషనల్ రేంజ్‌ను మరింత పెంచుతుంది. 2025-26 నాటికి 80కి పైగా ఈ విమానాలను IAF చేర్చనున్నారు. నాసిక్, బెంగళూరులో హాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, సంవత్సరానికి 16 నుంచి 24 విమానాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అటు మిగ్ 21ల రిటైర్మెంట్ నిర్ణయంపై రకరకాల స్పందిస్తున్నారు. మిగ్ 21లు 60 ఏళ్ల సేవలతో చరిత్ర సృష్టించాయి, కానీ ఆధునిక యుద్ధ అవసరాలకు తేజస్ అవసరం అని పలువురు చెబుతున్నారు. తేజస్ Mk-1A దేశీయ రక్షణ రంగంలో గేమ్ ఛేంజర్ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. మిగ్-21లు IAFకు గొప్ప సేవలందించాయి, కానీ రిటైర్మెంట్ ఆలస్యమైన నిర్ణయం అని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. మిగ్-21విమానాలు భారత వైమానిక దళానికి 60 ఏళ్లకు పైగా అమూల్యమైన సేవలందించాయి. అయితే, అధిక ప్రమాదాలు, పాత టెక్నాలజీ, విడిభాగాల కొరత వంటి సమస్యలతో పూర్తిగా రిటైర్ కానున్నాయి. ఇవి చరిత్ర గర్వకారణంగా నిలిచినప్పటికీ, ఆధునిక రక్షణ అవసరాల కోసం ఈ రిటైర్మెంట్ అనివార్యం.