
Bengaluru Delhi Mumbai Bomb Threats: భారత్‌లో ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, ఢిల్లీ స్కూళ్లు, బెంగళూరు స్కూళ్లు… ఎక్కడ చూసినా బాంబు బెదిరింపు ఇమెయిల్స్, కాల్స్. ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారు? ఇవి కేవలం ఆకతాయుల పనులా, లేక పెద్ద కుట్ర కోణమా? ముంబై స్టాక్ ఎక్స్చేంజ్కు వచ్చిన బెదిరింపులు ఏమిటి? ఢిల్లీ, బెంగళూరు స్కూళ్లకు వచ్చిన ఇమెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బెదిరింపుల వెనుక ఎవరై ఉండొచ్చు? ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా?
భారత్‌లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా పెరిగాయి. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్, ఎయిర్‌పోర్టులు, విమానాలు, స్టాక్ ఎక్స్చేంజీలు… ఎక్కడ చూసినా ఇమెయిల్స్ లేదా కాల్స్ రూపంలో బెదిరింపులు. ఈ బెదిరింపులు ఎక్కువగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లో వస్తున్నాయి. ఏడాది కాలంలో దాదాపు 1,000 బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఇవన్నీ ఫేక్ గా తేలాయి. ఈ బెదిరింపులు సాధారణంగా ఇమెయిల్స్ ద్వారా, కొన్నిసార్లు ఫోన్ కాల్స్ రూపంలో వస్తున్నాయి. పేలుడు పదార్థాలను స్కూళ్లలో పెట్టినట్టు, భారీ విధ్వంసం సృష్టిస్తామని ఈ ఇమెయిల్స్‌లో బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారుల్లో భయం, గందరగోళం నెలకొంటోంది.
జులై 15న ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు ఒక బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ ఇమెయిల్‌లో స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని, వాటిని పేల్చేస్తామని బెదిరించారు. ముంబై పోలీసులు వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ , స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేశారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు, ఈ బెదిరింపు ఫేక్ గా తేలింది. ఈ ఇమెయిల్ ఒక అనామక మెయిల్ నుంచి వచ్చింది, VPN ఉపయోగించి దాని దానిని పంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్టాక్ మార్కెట్ల ఇన్వెస్టర్లలో గందరగోళం సృష్టించే ప్రయత్నంగా కనిపిస్తోంది, ఎందుకంటే BSE భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సంస్థ.
ఢిల్లీలో 2024 ఏప్రిల్ నుంచి స్కూళ్లు, కాలేజీలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల మూడు రోజుల్లో 50కి పైగా స్కూళ్లు, కొన్ని కాలేజీలకు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ ఇమెయిల్స్‌లో స్కూళ్లలో TNT పేలుడు పదార్థాలు దాచాం, అందరినీ చంపేస్తాం అని బెదిరించారు. 40 స్కూళ్లలో బాంబులు పెట్టామని.. భారీగా డబ్బు చెల్లించాలని.. లేకపోతే స్కూళ్లను పేల్చేస్తామని మెయిల్ వచ్చింది. విద్యార్థులను చంపేందుకు బాంబులు పెట్టామని మెయిల్ పంపారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్లు, ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే తనిఖీలు చేశాయి, కానీ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురయ్యారు. Bengaluru Delhi Mumbai Bomb Threats.
ఢిల్లీ బాంబు బెదిరింపుల వ్యవహారం గడిచి రెండు రోజులు కాకముందే బెంగళూరులోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. జులై 18న బెంగళూరులో సుమారు 50 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ ఇమెయిల్స్ రోడ్ కిల్ అనే అనే ఈమెయిల్ ఐడీ నుంచి వచ్చాయి. స్కూళ్లలో బాంబులు పెట్టాం.., అందరినీ చంపేస్తామని బెదిరించారు. ఈ ఇమెయిల్‌లో పంపిన వ్యక్తి తాను జీవితంపై విరక్తి, మానసిక సమస్యలు, సమాజంపై కోపంతో ఉన్నట్టు రాశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటాను అని పేర్కొన్నాడు. బెంగళూరు పోలీసులు బాంబ్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేశారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు, ఈ బెదిరింపులు ఫేక్ గా తేలాయి. 2023 డిసెంబర్లో కూడా బెంగళూరులో 48 స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి, అవి కూడా ఫేక్ గా తేలాయి.
అయితే తరుచూ వస్తోన్న బెదిరింపు ఇమెయిల్స్ మూలం గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా ఉంది. ఢిల్లీ, బెంగళూరు స్కూళ్లకు వచ్చిన ఇమెయిల్స్ VPNలు, డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ ఇమెయిల్ సర్వీసెస్ ద్వారా పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జులై 18న బెంగళూరు, ఢిల్లీ స్కూళ్లకు వచ్చిన ఇమెయిల్స్ రోడ్ కిల్ మెయిల్ నుంచి వచ్చాయి, ఇవి జర్మనీ ఆధారిత టూటా మెయిల్ సర్వీస్ ద్వారా పంపినట్లు తెలిసింది. 2024 మేలో ఢిల్లీ స్కూళ్లకు వచ్చిన ఇమెయిల్స్ రష్యా ఆధారిత మెయిల్ నుంచి వచ్చాయి. VPNలు, డార్క్ వెబ్ ఉపయోగించడం వల్ల ఈ ఇమెయిల్స్ మూలాన్ని గుర్తించడం కష్టంగా ఉంది. సైబర్ నిపుణుల ప్రకారం, ఈ ఇమెయిల్స్ ప్రాక్సీ సర్వర్ల ద్వారా వివిధ దేశాల నుంచి రూట్ అవుతున్నాయి.
పోలీసులు ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారో గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో, ఈ బెదిరింపులు విద్యార్థులు లేదా చిన్నపిల్లలు ఆకతాయిగా పంపినవిగా తేలాయి. జులై 15న ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, సెయింట్ థామస్ స్కూల్‌కు బెదిరింపు ఇమెయిల్ పంపిన 12 ఏళ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. అతను స్కూల్ కు సెలవు ఇవ్వాలని ఈ బెదిరింపు మెయిల్ పంపినట్లు తెలిపాడు. అయితే, ఇటీవలి బెంగళూరు, ఢిల్లీ స్కూళ్లకు వచ్చిన బెదిరింపులు మరింత క్లిష్టంగా, బాగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం ఆకతాయిల పనుల కంటే పెద్ద కుట్రలా ఉండొచ్చని సైబర్ నిపుణులు అనుమానిస్తున్నారు. 2024 మేలో ఢిల్లీ స్కూళ్లకు వచ్చిన బెదిరింపుల వెనుక ISIS-సంబంధిత టెర్రర్ గ్రూప్ ఉండొచ్చని, లోక్‌సభ ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించేందుకు ఈ బెదిరింపులు పంపినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానించారు. కొన్ని ఇమెయిల్స్‌లో ఖురాన్ వచనాలు, జిహాదీ సందేశాలు ఉండటం ఈ అనుమానాన్ని బలపరిచింది.
ఈ బెదిరింపుల వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు, సైబర్ నిపుణులు అనుమానిస్తున్నారు. చాలా బెదిరింపులు ఫేక్ అయినప్పటికీ, వీటి వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బెదిరింపులు సమాజంలో భయం, గందరగోళం సృష్టించడం, విద్యా సంస్థలు, ఆర్థిక మార్కెట్లు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అస్థిరతను కలిగించడం లక్ష్యంగా ఉండొచ్చు. సైబర్‌క్రైమ్ యూనిట్స్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ ఇమెయిల్స్ మూలాన్ని గుర్తించేందుకు జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి బెదిరింపులను నిరోధించేందుకు స్కూళ్లలో భద్రతా ప్రోటోకాల్స్‌ను మరింత బలోపేతం చేస్తున్నారు.