
Shije Varghese mushroom cultivator: అనేక రంగాల్లో మహిళలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ తామేమి తీసిపోమని ఇప్పటికే చాలా మంది మహిళలు నిరూపించారు. నిత్యం ఇంటి పనులతో బిజీబిజీగా ఉండే గృహిణులు సైతం ఖాళీ సమయాన్ని కాస్త కాసుల పంటగా మార్చేస్తున్నారు. ఓ వ్యాపకంగా మొదలుపెట్టిన పుట్టగొడుగుల పెంపకంతో కేరళకు చెందిన ఓ గృహిణి ఇప్పుడు లక్షాధికారి అయ్యింది. తనకు నచ్చిన పని చూస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న షిజే వర్గీస్ విజయగాథ మీకోసం .
కేరళలోని అలప్పుర జిల్లా ఎరమల్లూర్కు చెందిన షిజే వర్గీస్ ఓ గృహిణి. నిత్యం ఇంటి పనులతో, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉండేది. పిల్లలు ఎదిగి తమ పనులు తాము చేసుకుంటుండటంతో ఆమెకు కాస్త ఫ్రీ టైమ్ లభించింది. అప్పుడే వ్యవసాయ అధికారులు నిర్వహించిన ఓ అవగాహన కార్యక్రమానికి వెళ్లిన ఆమెకు పుట్టగొడుగుల పెంపకం గురించి తెలిసింది. ఇంట్లోనే పుట్టగొడుగుల పెంచుకునే వెసులుబాటు ఉండటంతో ఆకర్షితురాలైంది. అనుకున్నదే తడవుగా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది.
2007లో పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టింది షిజే. రెండు ప్యాకెట్ల విత్తనాలు, ఆరు బెడ్లతో పెంపకాన్ని ప్రారంభించింది. అయితే మొదట్లో ఆమెకు చేదుఅనుభవం ఎదురైంది. పుట్టగొడుగులు పెద్దగా పెరగలేదు.అయినా నిరుత్సాహపడకుండా షిజే తన భర్త సహాయాన్ని తీసుకుంది. షిజే భర్త ప్రోత్సాహంతో ఈ సారి 300 బెడ్లతో పెంపకాన్నిమొదలుపెట్టింది . ఇదే సమయంలో కేరళలో పుట్టగొడుగులు పెంచుతున్న అనేక ప్రాంతాలను సందర్శించింది . పెంపకంలో మరిన్ని మెళకువలను నేర్చుకుంది. వాటిని తన సొంత క్షేత్ర లో అమలు చేసి విజయం సాధించింది.
పుట్ట గొడుగులు పెంచడం ఒకెత్తు..వాటిని అమ్మడం మరో ఎత్తు. పుట్టగొడుగుల్లో పోషకాలు పుష్కంగా ఉంటాయని తెలిసినా..పెద్దగా ఎవరూ కొనరు. కానీ షిజే తన సొంత బ్రాండ్ తో పుట్టగొడుగులు విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తోంది. మొదట చిన్న చిన్నగా పెంపకం చేపట్టినా…రేండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో వ్యాపారంగా మార్చింది . పోషకాలు పుష్కలంగా లభించే ఆయిస్టర్, మిల్కీ పుట్టగొడుగులను సాగు చేసి వాటిని కూన్ఫ్రెష్ అనే బ్రాండ్ తో విక్రయించడం మొదలుపెట్టింది. మలయాళంలో కూన్ అంటే మష్రూమ్స్ అని అర్థం. షిజే పెంచే మష్రూమ్స్ టేస్టీగా ఉండటంతో ఎక్కువమంది కొనుగోలు చేసేవారు. కొద్దికాలంలోనే కూన్ఫ్రెష్కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉత్పత్తిని మరింత పెంచింది. ప్రారంభంలో కోచ్చిలోని సూపర్ మార్కెట్లలో మాత్రమే షిజే తయారు చేసిన పుట్టగొడుగులు లభించేవి. కానీ తరువాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం షిజే 2 వేల బెడ్లలో ప్రతి రోజు ఎనిమిది నుంచి 10 కేజీల వరకు మష్రూమ్స్ ను ఉత్పత్తి చేస్తోది. వీటికి మంచి రేట్ కూడా వస్తుండటంతో నెలకు ఎంతలేదన్నా లక్ష రూపాయల వరకు సంపాదిస్తోంది. Shije Varghese mushroom cultivator.
మొదట్లో వేరే రైతుల నుంచి విత్తనాలు సేకరించి, క్రిమిసంహారాలు గురించి తెలుసుకుని వాటినే వినియోగించేది షిజే. కానీ రాను రాను పుట్టగొడుగుల సాగుపై పూర్తి అవగాహ రావటంతో సొంతంగా విత్తనాలు తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం వ్యవసాయ అధికారులకు తెలియడంతో షిజే ఇంటికి వెళ్లి ఆమె చేస్తున్న పుట్టగొడుగుల సాగును పరిశీలించారు. మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలనే ఉద్దేశంతో ఆమెతో క్లాసులు ఇప్పించడం మొదలుపెట్టారు. దీంతో షిజే పుట్టగొడుగుల పెంపకం గురించి భోదిస్తూ చాలా మంది మహిళలకు టీచర్‌గా మారింది. గత ఎనిమిదేళ్లుగా కేరళ వ్యాప్తంగా పుట్టగొడుగుల సాగుపై షిజే వీక్లీ క్లాసులను నాన్ స్టాప్ గా నిర్వహిస్తోంది. పెంపకంపై ఆసక్తి, సాధించాలనే పట్టుదల , సహనంతో చేయగలిగితే పుట్టగొడుగుల పెంపకంలో మంచి లాభాలు ఆర్జించవచ్చని షిజే నిరూపించారు. తోటి మహిళలు ఆదర్శంగా నిలిచారు.