సుప్రీం తీర్పును స్వాగతించిన జంతు ప్రేమికులు..!

Supreme Court Orders: జంతు ప్రేమికుల ఆందోళనలు.. దేశ వ్యాప్తంగా జరిగిన చర్చ నేపథ్యంలో సుప్రీం కోర్టు వీధి కుక్కల విషయంలో తన తీర్పును సవరించింది. ఢిల్లీలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉండటంతో, కోర్టు ఈ విషయంలో సమతుల్య విధానాన్ని అవలంబించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ, ఆరోగ్యకరమైన కుక్కలను స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వాటి అసలు ప్రాంతాల్లోనే తిరిగి విడుదల చేయాలని నిర్ణయించింది. మరి సుప్రీం కోర్టు కొత్త తీర్పుపై రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సుప్రీంకోర్టు ఎలాంటి జాగ్రత్తలు సూచించింది? జంతు ప్రేమికులు ఎలా స్పందించారు? ఢిల్లీలో ఈ సమస్య ఎందుకు తీవ్రమైంది? ఇప్పుడు కుక్కల దాడులు ఆగిపోతాయా..?

దేశ వ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ఈ మధ్య కాలంలో వీధి కక్కుల రోడ్డుపై వెళ్లే వారిని.. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు రేబీస్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఢిల్లీలో వీధి కుక్కల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని మొత్త వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించాలని ఆదేశించింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. చాలా మంది జంతు ప్రేమికులు రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేపట్టారు. పలువురు సీని, రాజకీయ సెలబ్రెటీలు వీధి కుక్కలపై సుప్రీం కోర్టు తీర్పు దారుణమైనది ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పును మార్చుకుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని మూడు న్యాయమూర్తుల బెంచ్ వీధి కుక్కలపై సవరించిన తీర్పునె తలియజేసింది. గతంలో జస్టిస్ జె.బి. పర్దివాలా, ఆర్. మహదేవన్ బెంచ్ ఇచ్చిన ఆదేశం ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి, వాటిని తిరిగి విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, ఈ ఆదేశం ఆచరణీయం కాదని, షెల్టర్ సౌకర్యాలు సరిపోవని జంతు సంరక్షణ సంస్థలు వాదించాయి. దీంతో, కొత్త తీర్పులో కోర్టు ఈ ఆదేశాన్ని సవరించింది. ఆరోగ్యకరమైన కుక్కలను స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేసిన తర్వాత వాటిని ఎక్కడి కక్కడే వదలివేయాలని తెలిపింది. అయితే రాబీస్ వ్యాధితో బాధపడే, దూకుడుగా ఉన్న కుక్కలను మాత్రం షెల్టర్లలో ఉంచాలని ఆదేశించింది. అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఎటువంటి జాగ్రత్తలు సూచించింది..?
సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రజల భద్రత, వీధి కుక్కలపై దయ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు సూచించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీతో సహా సివిక్ బాడీలు ప్రతి వార్డులో వీధి కుక్కల కోసం నిర్దేశిత ఫీడింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధించింది. ఇది గొడవలకు, దాడులకు కారణమవుతుందని కోర్టు గుర్తించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అంతేకాకుండా, కుక్కలను దత్తత తీసుకోవాలనుకునే జంతు ప్రేమికులు MCD ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, కానీ దత్తత తీసుకున్న కుక్కలను మళ్లీ వీధుల్లో విడిచిపెట్టకూడదని ఆదేశించింది. ఈ జాగ్రత్తలు కుక్కల సంఖ్యను నియంత్రించడం, రాబిస్ వ్యాప్తిని అరికట్టడం, ప్రజల భద్రతను కాపాడడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

సుప్రీం తీర్పుపై జంతు ప్రేమికుల స్పందన ఎలా ఉంది..?
సుప్రీంకోర్టు సవరించిన తీర్పును జంతు ప్రేమికులు, సంరక్షణ సంస్థలు స్వాగతించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గుమిగూడిన కార్యకర్తలు, జంతు సంరక్షకులు ఈ తీర్పుపై ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. కొందరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. గత తీర్పు ప్రకారం అన్ని కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పడం ఆచరణీయం కాదని, ఇది కుక్కలపై క్రూరత్వానికి దారితీస్తుందని వారు వాదించారు. కొత్త తీర్పు ABC రూల్స్ 2023కు అనుగుణంగా ఉండటం, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టడం వారికి ఊరట కలిగించింది. పెటా ఇండియా ఈ తీర్పును స్వాగతిస్తూ, కుక్కలను సమాజంలో భాగంగా గుర్తించినందుకు కోర్టును ప్రశంసించింది. జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఈ తీర్పును శాస్త్రీయమైనదిగా ప్రశంసిస్తూ, గత ఆదేశం కుక్కలపై కోపంతో, సరైన సమాచారం లేకుండా ఇచ్చినట్లు విమర్శించారు.

అసలు ఢిల్లీలో వీధి కుక్కల సమస్య ఎందుకు తీవ్రమైంది?
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రమవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 2024లో ఢిల్లీలో 25,201 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2025 జనవరిలోనే 3,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ ఘటనల్లో రాబిస్ వ్యాధి వ్యాప్తి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై దాడులు ఆందోళన కలిగించాయి. జూలై 2025లో ఢిల్లీలోని పూత్ కలాన్‌లో ఆరేళ్ల బాలిక రాబిస్‌తో మరణించిన ఘటన ఈ సమస్యను మరింత ఉద్ధృతం చేసింది. సివిక్ బాడీలు ABC రూల్స్ 2023ను సరిగా అమలు చేయకపోవడం, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలలో వైఫల్యం, షెల్టర్ సౌకర్యాల కొరత కూడా ఈ సమస్యను తీవ్రతరం చేశాయి. ఢిల్లీలో సుమారు 8 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా, కానీ స్టెరిలైజేషన్ చేయబడినవి సగం మాత్రమే.

గతంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది..?
సుప్రీంకోర్టు ఢిల్లీలో వీధి కుక్కల సమస్యను సుమోటోగా గుర్తించి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను 6-8 వారాల్లో షెల్టర్లకు తరలించాలని, వాటిని తిరిగి విడుదల చేయకూడదని ఆదేశించింది. కనీసం 5,000 కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని, దీనిని అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. Supreme Court Orders.

గత ఆదేశాలపై జంతు ప్రేమికులు ఎలా స్పందించారు..?
గత ఆదేశాలపై జంతు ప్రేమికులు, సంరక్షణ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, నాగ్‌పూర్‌లలో నిరసనలు జరిగాయి. జంతు సంరక్షకులు ఈ ఆదేశాన్ని అమానవీయం, అశాస్త్రీయం, చట్టవిరుద్ధం అని విమర్శించారు. పెటా ఇండియా ఈ ఆదేశం కుక్కలకు, ప్రజలకు రెండింటికీ హానికరమని, షెల్టర్లలో సరైన సౌకర్యాలు లేనందున కుక్కలు బాధపడతాయని హెచ్చరించింది. అన్ని కుక్కలను తొలగించడం క్రూరమైన నిర్ణయమని రాహుల్ గాంధీ అన్నారు. నటి సదా ఈ ఆదేశంపై భావోద్వేగంగా స్పందిస్తూ, 8 వారాల్లో షెల్టర్లు ఏర్పాటు చేయడం అసాధ్యమని, ఇది కుక్కలను చంపడానికి తీసుకున్న నిర్ణయం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలు, అర్జీల తర్వాత కోర్టు మళ్లీ విచారణ జరిపి, కొత్త తీర్పు ఇచ్చింది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q