ఆడవుల్లో పుష్పాలపై సుప్రీం కోర్టు సీరియస్.!

Supreme Court Tree Felling: పుష్పా సినిమాలో హీరో కేవలం ఎర్రచందనం చెట్లను మాత్రమే నరుకుతాడు. కాని కొందరు పుష్పాలు అన్ని రకాల చెట్లను నరికేస్తున్నారని.. అందుకే మెరుపు వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో వచ్చిన ఆకస్మిక వరదలకు అక్రమ చెట్ల నరికివేత ప్రధాన కారణమని సుప్రీం కోర్టు మండిపడింది. అసలు సుప్రీం కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసింది? మానవులు తమ స్వార్థం కోసం చేసే పనులు ప్రకృతికి కోపం తెప్పిస్తున్నాయా..? ప్రస్తుతం వస్తున్న విలయాలు మానవుడి తప్పులకు సాక్ష్యాలా..? వీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సుప్రీం కోర్టు వ్యాఖ్యలు పర్యావరణ రక్షణలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది..?

చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని చిన్నప్పటి నుంచి పాఠాల్లో చెబుతూనే ఉన్నారు. అయితే నేరుగా మనకు నష్టం కలగడం లేదుగా.. ఎప్పుడో విపత్తు వస్తుందని.. ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఆపేయాలా అని చాలా మంది స్మగ్లర్లు భావిస్తున్నారు. విచ్చల విడిగా కొండ ప్రాంతాల్లో అడవులను నరికేస్తున్నారు. ఫలితంగా ఎప్పుడో కాదు.. మన కళ్ల ముందే ఘోర విపత్తులను చూస్తున్నాం. ఇటీవల జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మెరుపు వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలు పెరగడానికి చెట్ల అక్రమ నరికివేతే కారణమని స్వయంగా సుప్రీం కోర్టే తెలిపింది. ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ని విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన బెంచ్, హిమాచల్ ప్రదేశ్‌లో వరదల్లో తేలియాడుతున్న భారీ కలప దుంగల వీడియోలను సాక్ష్యంగా చూపింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

పంచకులకు చెందిన అనమిక రానా దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో పర్యావరణ విధ్వంసం, ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు నివారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. అలాగే జియోలాజికల్, ఎకోలాజికల్ అధ్యయనాలు కూడా చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాదనలు విన్న సుప్రీం కోర్టు భారీ వర్షాలు, వరదలు, వచ్చినప్పుడు కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇటీవల టీవీల్లో భారీ సంఖ్యలో పుష్పా సినిమాలో మాదిరి కలప దుంగలు నదిలో తేలియాడుతున్న దృశ్యాలు టెలికాస్ట్ అయ్యాయి. ఇది అక్రమ చెట్ల నరికివేతకు స్పష్టమైన సాక్ష్యం అని సుప్రీం కోర్టు పేర్కొంది. కోర్టు ఈ సమస్యను అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించి, అధికారులు తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మానవ తప్పిదాల వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని సుప్రీం కోర్టు ఇప్పుడు చెప్పినా.. అది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటే. ఈ మధ్యకాలంలో భారత్‌లో ఆకస్మిక వరదలు చాలా పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. హిమాచల్‌లో భారీ వర్షాలు, వరదలు గ్రామాలను ముంచెత్తాయి, ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసం అయ్యాి. పంజాబ్‌లో గత 40 ఏళ్లలో లేనంత తీవ్రమైన వరదలు సంభవించాయి, అమృత్‌సర్, జలంధర్, లూధియానాలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదలకు అక్రమ చెట్ల నరికివేతతో పాటు, అనియంత్రిత నిర్మాణాలు, అటవీ భూముల ఆక్రమణ, జలవనరుల విధ్వంసం కూడా కారణాలుగా చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోని హిమాలయ పర్వత శ్రేణులు సున్నితమైన జీవావరణ వ్యవస్థ కలిగి ఉన్నాయి, ఇవి పర్యావరణ నష్టంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

అటవీ భూములపై అనధికార నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, హైవేల నిర్మాణం కోసం చెట్లను నరికివేయడం కూడా పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది. హిమాచల్‌లో 2014 నుంచి 83,320 చెట్ల నరికివేతకు అనుమతి ఇవ్వగా, 33,000 చెట్లు ఇప్పటికే నరికివేయబడ్డాయని RTI ద్వారా తెలిసింది. అదనంగా, వాతావరణ మార్పుల వల్ల అసాధారణ వర్షాలు, మంచు కరిగిపోవడం కూడా వరదలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యలు హిమాలయ ప్రాంతాల్లోని సున్నితమైన జీవావరణ వ్యవస్థను మరింత దెబ్బతీస్తున్నాయి.

ఆకస్మిక వరదలను అరికట్టడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అభివృద్ధి, పర్యావరణ రక్షణ మధ్య బ్యాలెన్స్ అవసరం అని అంటున్నారు. చెట్ల అక్రమ నరికివేతను నియంత్రించడానికి కఠిన చట్టాల అమలు, అటవీ భూములపై నిర్మాణాలను పరిమితం చేయడం, విస్తృతమైన అటవీకరణ కార్యక్రమాలు చేపట్టడం అవసరమని చెబుతున్నారు. జియోలాజికల్ సర్వేలు, ఎకోలాజికల్ అధ్యయనాలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లను బలోపేతం చేయడం, అటవీ శాఖలు, NDMAలు కలిసి పనిచేయడం అవసరమని నిపుణులు అంటున్నారు. Supreme Court Tree Felling.

సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు పర్యావరణ రక్షణలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నోటీసులతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెట్ల అక్రమ నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఢిల్లీ రిడ్జ్ ఫారెస్ట్‌లో అక్రమ చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసి, 100 చెట్లు నాటమని ఆదేశించింది. ఇప్పుడు హిమాలయ ప్రాంతాల్లోనూ అటవీకరణ, చట్ట అమలుపై దృష్టి పెరుగుతుంది. అయితే, ఈ చర్యలు విజయవంతం కావాలంటే, స్థానిక ప్రభుత్వాలు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అయితే అది ఎంత వరకు సాధ్యమో తెలియాలి.