భారత్, శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపం కోసం వివాదం..?!

Kachchtheevu Island: అది భారత్, శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపం. ఎటువంటి నివాసాలు లేని ఆ ద్వీపం పేరు కచ్చతీవు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం భారత్ … ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ ద్వీపం భారత్ స్వాధీనం చేసుకోవాలని తమిళనాడులో ఉద్యమం మొదలైంది. దీనికి స్థానిక సెంటిమెంట్ కూడా యాడ్ అయ్యింది. అసలు తమిళనాడులో ఈ ద్వీపం కోసం ఎందుకు పోరాటం మొదలైంది..? కచ్చతీవు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తోంది.? ఈ ద్వీపంపై భారత్, శ్రీలంకల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి..?

తమిళనాడులో రాజకీయాల్లో కచ్చతీవు ద్వీపం అంశంపై హాట్ టాపిక్ గా మారింది. ఈ ద్వీపం కోసం తమిళనాడు ప్రభుత్వం కేంద్రంతో పోరాడుతోంది. భారత్-శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని 1974లో శ్రీలంకకు ఇచ్చేశారు. తమిళనాడులోని రామేశ్వరం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంక తీరం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంటుంది. అలాగే 285 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ద్వీపం సమీపంలో చేపలు ఎక్కువగా దొరకుతాయి. గతంలో ఈ ద్వీపం రామనాథపురం జమీందారీలో భాగంగా ఉండేది, తమిళనాడు మత్స్యకారులు అక్కడకు వెళ్లి చేపలు పట్టుకునేవాళ్లు. కానీ 1974లో భారత్-శ్రీలంక ఒప్పందంతో ఈ ద్వీపం శ్రీలంకకు వెళ్లిపోయింది. దీంతో తమిళనాడు మత్స్యకారులు అక్కడ చేపలు పట్టే హక్కు కోల్పోయారు. అయితే ఇప్పటికే చాలా మంది అనధికారికంగా అక్కడకు వెళ్లడం చేపలు పట్టుకుంటుండంతో.. శ్రీలంక కోస్ట్ గార్డు మత్స్యకారులను అరెస్ట్ చేస్తున్నారు.

గతంలో ఇది తమిళనాడుకు చెందిన ప్రాంతం అని.. ఎంతో మంది మత్స్యకారులకు జీవనోపాధి అందించిందని.. శ్రీలంకకు ఇచ్చేయడం వల్ల ఉపాధి కోల్పోయారని స్టాలిన్ సర్కార్ అంటోంది. ఈ ద్వీపం తిరిగి సాధించాలని పోరాటం చేస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ ద్వీపం విషయంలో స్పందించడం లేదని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా శ్రీలంక నావికాదళం తమిళనాడు మత్స్యకారులను అరెస్టు చేయడం, వాళ్ల బోట్లను స్వాధీనం చేసుకోవడంతో ఈ గొడవ మరింత ఎక్కువైంది. దీంతో ఇది తమిళనాడు మత్స్యకారుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని డీఎంకే చెబుతోంది.

తరుచూ తమిళనాడు మత్స్యకారులు కచ్చతీవుకు వెళ్తుండటంతో శ్రీలంక గస్తీని పెంచింది. ఈ ద్వీపం సమీపంలోకి భారతీయ బోట్లను రానివ్వడం లేదు. ఒక వేళ వెళ్తే వారిని అరెస్టు చేయడం, వాళ్ల బోట్లను స్వాధీనం చేసుకోవడం చేస్తున్నారు. అయితే 1974 ఒప్పందం తర్వాత కచ్చతీవు శ్రీలంకకు వెళ్లిపోయినా, తమిళనాడు మత్స్యకారులు మాత్రం అక్కడ సాంప్రదాయంగా చేపలు పట్టే హక్కు తమకే ఉందని చెబుతున్నారు. కానీ శ్రీలంక నావికాదళం తమని సరిహద్దు దాటారని అన్యాయంగా అరెస్టు చేస్తోందని అంటున్నారు. 2024లో 530 మందిని, 2025 మొదటి మూడు నెలల్లో 147 మంది మత్స్యాకారులు అరెస్ట్ అయ్యారు. Kachchtheevu Island.

తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఒక సభలో కచ్చతీవును తిరిగి తీసుకురావడమే మత్స్యకారుల సమస్యలకు పరిష్కారమని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు. గత 10 ఏళ్లుగా బీజేపీ ఏం చేసింది? కచ్చతీవును తిరిగి తీసుకొచ్చేందుకు ఏ చర్యలు తీసుకుంది? మత్స్యకారులను అరెస్టుల నుంచి ఎందుకు కాపాడలేదని స్టాలిన్ ప్రశ్నించారు. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరత్ కచ్చతీవు ఇవ్వబోమని చెప్పినప్పుడు, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎందుకు స్పందించలేదని స్టాలిన్ నిలదీశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ కచ్చతీవును తిరిగి తీసుకోవాలని తీర్మానం పాస్ చేసిందని, తాను ప్రధాని మోడీతో చాలాసార్లు ఈ విషయం మాట్లాడానని స్టాలిన్ చెప్పారు. తమిళనాడు మత్స్యాకరుల హక్కుల కోసం డీఎంకే పోరాడుతోందని, కేంద్రం వెంటనే శ్రీలంకతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

కచ్చతీవు వ్యవహారంపై ఇప్పుడు తమిళనాడులో బీజేపీ, డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య మాటల యుద్ధ నడుస్తోంది. అయితే కచ్చతీవు శ్రీలంకకు వెళ్లిపోవడానిక డీఎంకే తప్పే కారణమని బీజేపీ విమర్శిస్తోంది. 1974లో కాంగ్రెస్, డీఎంకే హయాంలో కచ్చతీవు శ్రీలంకకు ఇచ్చారని, ఆ సమయంలో డీఎంకే కేంద్రంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏం చేయలేదని విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు. దీనికి స్టాలిన్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. అప్పుడు ఇచ్చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. గత 10 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో ఉన్నా కచ్చతీవును తీసుకురాలేదని, ఈ విషయాన్ని ఓట్ల కోసం వాడుకుంటోందని అన్నారు. దమ్ముంటే కచ్చతీవును శ్రీలంక నుంచి భారత్ కు వచ్చేలా చర్చలు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది డీఎంకే ప్రభుత్వం.

స్టాలిన్ ఒత్తిడి వల్ల కేంద్రం శ్రీలంకతో చర్చలు జరిపి ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. కానీ శ్రీలంక ఈ ద్వీపం విషయంలో వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లోను వెనక్కు ఇవ్వబోమని చెబుతోంది. అయితే శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సమస్యల్లో ఉంది. 2022లో శ్రీలంకకు భారత్ $4 బిలియన్ల సాయం చేసింది. ఈ సాయం వల్ల భారత్‌కు ఈ చర్చలు అనుకూలించే అవకాశం ఉంది. అలాగని కచ్చతీవును తిరిగి తీసుకోవడం అంత సులభం కాదు, దీనికి పలు అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాలు అడ్డువస్తాయి. దీంతో భారత విదేశాంగ శాఖ ఈ విషయంలో సైలెంట్ గా ఉంది. శ్రీలంకతో సంబంధాలు దెబ్బతినకుండా సామరశ్యంగా సమస్య పరిష్కరించుకోవాలని చూస్తోంది. అయితే తమిళనాడులో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ అంశాన్ని రాజకీయంగా డీఎంకే ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. మత్స్యకారుల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది. దీని కోసం కచ్చతీవు కోసం డీఎంకే పోరాడుతోంది.

Also Read: https://www.mega9tv.com/national/preliminary-report-on-air-india-plane-crash-key-points-in-suspicions-of-pilot-error/