
Nita Ambani’s Reliance Foundation: రిలయన్స్ అంటే ఎప్పుడు వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే కంపెనీ అని అందరూ అనుకుంటారు. కాని తమ డబ్బు సంపాదనకంటే సేవే తమను జీవితాంతం గుర్తు పెట్టుకుంటుందని రిలయన్స్ యజమానులు భావిస్తున్నారు. అందుకే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను రోజురోజకు పెంచుతున్నారు. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ ముంబైలో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించనుంది. వంద కాదు.. 500 కాదు.. ఏకంగా 2 వేల పడకలతో ఈ ఆసుపత్రిని రిలయన్స్ ఫౌండేషన్ నిర్మించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ నీతా అంబానీ మెడికల్ సిటీ నిర్మాణం గురించి ప్రకటించారు. అయితే ఈ సారి రిలయన్స్ గతానికి భిన్నంగా.. వ్యాపారాల కంటే సేవల విషయంలోనే ఎక్కువ ప్రాధాన్యత తీసుకున్నట్టు కనిపించింది. ఇది కేవలం హాస్పిటల్ కాదు, రాబోయే రోజుల్లో వైద్య రంగంలో భారత్‌ను గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్‌గా మార్చే ఒక గొప్ప ఆలోచనగా అభివర్ణించారు. అసలు ఆసుపత్రికి ఈ మెడికల్ సిటీకి తేడా ఏంటి..? రిలయన్స్ వార్షిక సమావేశంలో ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు..? పిల్లల క్యాన్సర్ చికిత్సకు రిలయన్స్ ఎలా కృషి చేయనుంది? రిలయన్స్ 2035 నాటికి ఎలాంటి భారీ లక్ష్యాలు పెట్టుకుంది?
ఒక హాస్పిటల్, వైద్యం అందించడంతో పాటు, రాబోయే రోజుల్లో వైద్య రంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటే? ముంబైలో రిలయన్స్ ఫౌండేషన్ ఇలాంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. 2,000 పడకలతో కూడిన ఈ మెడికల్ సిటీ ప్రస్తుత సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కంటే ఆరు రెట్లు పెద్దది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో డయాగ్నోస్టిక్స్, అత్యాధునిక వైద్య పరికరాలు ఇందులో ఉండనున్నాయి. భారత్ తో పాటు ప్రపంచం నుంచి అత్యుత్తమ డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందించనున్నారు. ఈ మెడికల్ సిటీ ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించనుంది. ఇందులో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉండనుంది.
అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులతో పోరాడుతున్న చిన్నారులకు కేవలం చికిత్స మాత్రమే సరిపోదు, వారికి ఆప్యాయత, ఆదరణ కూడా అవసరం. ఈ భావనతో రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో జీవన్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభిస్తోంది. ఈ విభాగం పీడియాట్రిక్ క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేకంగా పనిచేయనుంది. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి అత్యాధునిక చికిత్సలను అందిస్తుంది. మన చిన్నారులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడంతో పాటు తల్లి ఆప్యాయత అందించేలా ఈ విభాగం డిజైన్ చేస్తామని నీతా అంబానీ అన్నారు.
రిలయన్స్ వ్యాపారంతో పాటు ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తోంది..?
రిలయన్స్ ఫౌండేషన్ గత ఒక దశాబ్దంలో హెల్త్‌కేర్ రంగంలో అసాధారణ విజయాలు సాధించింది. సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 33 లక్షల మంది రోగులకు చికిత్స అందించి, భారత్‌లో అగ్రగామి మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా నిలిచింది. రెస్పెక్ట్ ఫర్ లైఫ్ అనే ఫిలాసఫీతో 27.5 లక్షల మంది జీవితాలను తాకింది. ఈ ఏడాది మాత్రమే 55,000 గ్రామాల్లో 15 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ నుంచి వాటర్ సెక్యూరిటీ, స్థిరమైన వ్యవసాయం, మత్స్యకార సంఘాల సాధికారత, మహిళలు, పిల్లల మద్దతు వరకు రిలయన్స్ ఫౌండేషన్ సమగ్ర విధానంతో సామాజిక మార్పును తీసుకొస్తోంది.
విద్యా రంగంలో రిలయన్స్ విజన్ ఏంటి..?
హెల్త్‌కేర్‌తో పాటు, విద్యా రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ భారీ లక్ష్యాలు పెట్టుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 1,100 అంగన్వాడీలను డిజిటల్ సెంటర్లుగా మార్చారు. ప్రపంచ స్థాయి ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌ను భారత్‌లోని ప్రతి మూలకు చేర్చి, కోటి మంది పిల్లలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నీతా అంబానీ తెలిపారు. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ ద్వారా 2.3 కోట్ల మంది పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. రాబిన్ మింజ్ వంటి ట్రైబల్ క్రికెటర్‌ను ఉదాహరణగా చూపిస్తూ, భారత్‌లోని యువకుల సామర్థ్యాన్ని నీతా అంబానీ హైలైట్ చేశారు. యువత కోసం కొత్త అవకాశాలను సృష్టించడమే కాకుండా, వారి కలలను నిజం చేసే దిశగా పనిచేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ చెబుతోంది.
క్రీడల్లో భారత్‌ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏంటి..?
క్రీడలు జీవితాలను మార్చగలవని నమ్మే రిలయన్స్ ఫౌండేషన్, ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలను కల్పిస్తోంది. ముంబై ఇండియన్స్ మహిళల జట్టు మూడేళ్లలో రెండు WPL టైటిల్స్ సాధించిన విజయాన్ని నీతా అంబానీ గుర్తు చేశారు. 2036 ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్‌ను భారత్‌లో నిర్వహించే బిడ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద యువ జనాభాతో భారత్ ఒలింపిక్స్ హోస్ట్‌గా సిద్ధంగా ఉంది అని నీతా అంబానీ ధీమాగా చెప్పారు. క్రీడల ద్వారా యువతను సాధికారపరచడం, వారి జీవితాలను మార్చడం రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు.
పర్యావరణ సంరక్షణ రిలయన్స్ ఫౌండేషన్ ఎజెండాలో మరో ముఖ్యమైన భాగం. అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఇనిషియేటివ్ ఇప్పటికే 1.5 లక్షల జంతువులకు ఆశ్రయం కల్పించింది, ఇటీవల భారత్‌లో జంతు సంక్షేమంలో అత్యున్నత గౌరవం అయిన ప్రాణి మిత్ర అవార్డును అందుకుంది. అలాగే తాజాగా ముంబైలో 130 ఏకరాల విస్తీర్ణంలో కోస్టల్ రోడ్ గార్డెన్స్‌ను అభివృద్ధి చేయనున్నారు, ఇందులో వాక్‌వేస్, సైక్లింగ్ ట్రాక్స్, ఆకుపచ్చ చెట్లతో కూడిన ప్లాజాలు ఉంటాయి. ముంబై తీరంలో ఆకుపచ్చ రిబ్బన్‌లా మెరిసే ఈ గార్డెన్స్ రాబోయే తరాలకు తాజా గాలిని అందిస్తాయి అని నీతా అంబానీ వివరించారు. Nita Ambani’s Reliance Foundation.
రిలయన్స్ ఫౌండేషన్ 2035 నాటికి భారీ సామాజిక లక్ష్యాలను పెట్టకుంది. 40 కోట్ల మంది భారతీయుల జీవితాలను మార్చడం, 30 కోట్ల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, 10 కోట్ల మంది మహిళలను సాధికారపరచడం, 5 కోట్ల గ్రామీణ గృహాలకు మద్దతు ఇవ్వడం ఈ లక్ష్యాల్లో భాగం. ఇది కేవలం నోటి లెక్క కాదని.. ప్రతి గ్రామం, నగరం, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మార్పు అవసరమని నీతా అంబానీ తెలిపారు. ఆర్థిక శక్తితో పాటు దయ, విలువలు, సంస్కృతి ద్వారా భారత్ ప్రపంచ వేదికపై పేరు తెచ్చుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q