
Malegaon blast case: భారతదేశంలో విస్తృత చర్చకు కారణమైన మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక NIA కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. సుదీర్ఘ విచారణలు, లోతైన వాదనల నింధితులను నిర్దోషులగా ప్రకటించింది. ఈ కేసులో భోపాల్ బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ముఖ్య నిందితురాలిగా ఉండటం సంచలనం రేపింది. ముఖ్యంగా హిందూ ఉగ్రవాద సంస్థల ప్రస్తావన ఈ కేసులో కీలకంగా మారింది. అసలు ఈ మాలేగావ్ పేలుళ్ల కేసు నేపథ్యం ఏమిటి? ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఈ కేసుతో సంబంధం ఏమిటి? కోర్టు ఈ తీర్పును ఎందుకు ఇచ్చింది?
2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలోని హమీదియా మసీదు సమీపంలో ఒక మోటార్‌సైకిల్‌కు అమర్చిన బాంబు పేలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 101 మంది గాయపడ్డారు. మొదట స్థానిక పోలీసులు ఈ దాడిని ముస్లిం ఉగ్రవాద సంస్థల దాడిగా భావించారు. అయితే మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ విచారణలో హిందూ ఉగ్రవాద గ్రూపునకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. దీంతో కేసు దిశ పూర్తిగా మారిపోయింది. 2011లో ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్వీకరించి, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఇతర సెక్యూరిటీ చట్టాల కింద విచారణ కొనసాగించింది. ఈ కేసు భారత రాజకీయాల్లో సాఫ్రన్ టెర్రర్ అనే పదాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది, మతపరమైన ఉగ్రవాద ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చలు రేగాయి.
ఈ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పాత్ర ఏంటి..?
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మాజీ ఎంపీ, హిందూ సన్యాసిని, హిందూ జాగరణ సమితి సభ్యురాలు, ఈ కేసులో ముఖ్య నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. పేలుడు ఘటనలో ఉపయోగించిన మోటార్‌సైకిల్ ఆమె పేరిట రిజిస్టర్ అయినట్లు ఎటిఎస్ గుర్తించింది. 2008 అక్టోబర్‌లో ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది. ప్రజ్ఞా ఠాకూర్ 2017లో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. 2019లో ఆమె భోపాల్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆమె తనపై రాజకీయ కుట్ర జరిగిందని, తాను అమాయకురాలినని నిరంతరం వాదించారు.
కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది..?
ముంబైలోని ప్రత్యేక NIA కోర్టు ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఏటీఎస్, NIA సమర్పించిన ఆధారాలు, ప్రత్యేకించి డీఎన్ఏ, ఫోరెన్సిక్ రిపోర్టులు సాక్షుల వాంగ్మూలాలు, నేరాన్ని ఖచ్చితంగా నిరూపించడంలో విఫలమయ్యాయి. బాంబు తయారీ, పేలుడు ఘటనకు సంబంధించిన ఆధారాలలో అస్పష్టత ఉండటం కూడా దోషులను తేల్చలేకపోయింది. కీలక సాక్షుల వాంగ్మూలాలు విశ్వసనీయంగా లేకపోవడం, కొందరు సాక్షులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు తీర్పును ప్రభావితం చేశాయి. నేరారోపణలు ఆధారాలతో నిరూపించబడలేదు, కేవలం అనుమానాల ఆధారంగా శిక్షించలేము అని కోర్టు స్పష్టం చేసింది. Malegaon blast case.
NIA ఆడియో రికార్డింగ్‌లు, వీడియో ఆధారాలు, బాంబు తయారీకి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులను సమర్పించినా, ఈ ఆధారాలు న్యాయపరంగా నేరాన్ని నిర్ధారించడానికి సరిపోలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పు న్యాయవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోందని… బాధితులకు న్యాయం జరగలేదని AIMIM నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మరోవైపు, ఈ తీర్పును సత్యం గెలిచింది అని బీజేపీ నేతలు, ప్రజ్ఞా ఫాలోవర్స్ చెబుతున్నారు.
మాలేగావ్ పేలుళ్ల కేసు భారత రాజకీయాల్లో కీలకంగా నిలిచింది. ఎందుకంటే ఇది మొదటిసారి హిందూ ఉగ్రవాద ఆరోపణలను జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది. ఈ కేసు సమయంలో సాఫ్రన్ టెర్రర్ అనే పదం రాజకీయ వర్గాల్లో వివాదాస్పదమై, హిందూ జాతీయవాద సంస్థలు దీనిని తమపై రాజకీయ కుట్రగా ఆరోపించాయి. ఈ కేసు విచారణలో రాజకీయ జోక్యం ఆరోపణలు, ముఖ్యంగా 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తీవ్రంగా వినిపించాయి.