
Dharmasthala Case Conspiracy: కర్ణాటకలోని పవిత్ర యాత్రా స్థలం ధర్మస్థల. శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఉన్న ఈ ప్రదేశం, కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రహస్యంగా మహిళలు, చిన్నారుల శవాలను పూడ్చిపెట్టినట్లు ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన ఆరోపణలు చేశాడు. కానీ, ఇప్పుడు ఆ వ్యక్తే తన ఆరోపణలు అబద్ధమని చెబుతున్నాడు. అసలు ఈ ధర్మస్థల విషయంలో ఏం జరుగుతోంది? ఈ ఆరోపణల వెనుక ఎవరున్నారు? ముసుగు మనిషిగా మారిన పారిశుధ్య కార్మికుడు చిన్నయ్య చెప్పినవన్నీ అబద్ధాలేనా? మరి దీని వెనుక నుంచి నడిపించింది ఎవరు..? అంటే క్రైమ్ థ్రిల్లర్ తలపించే సస్పెన్స్ వెనుక ఒక కట్టుకథ ఉందా..? దీనిని హిందూ దేవాలయాలపై కుట్రగా చూడొచ్చా..?
ధర్మస్థల, కర్ణాటకలోని ఒక పవిత్ర ఆలయ పట్టణం, శ్రీ మంజునాథ స్వామి ఆలయంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అయితే ఇటీవల ఈ ప్రాంతం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నయ్య అనే 48 ఏళ్ల మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, 1995 నుంచి 2014 వరకు తాను ఆలయం వద్ద 100కు పైగా మహిళలు, బాలికల శవాలను రహస్యంగా పూడ్చినట్లు సంచలన ఆరోపణలు చేశాడు. ఈ డెడ్ బాడీలపై లైంగిక వేధింపులకు గురైనట్లు గుర్తులు ఉన్నాయని, కొన్ని శవాలపై యాసిడ్ దాడి గుర్తులు కూడా ఉన్నాయని అతను ఆరోపించాడు. తన కుటుంబాన్ని బెదిరించడంతో 2014లో ధర్మస్థల నుంచి పారిపోయినట్లు చెప్పాడు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటైంది. చిన్నయ్య చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహించారు. అయితే సినిమా ట్విస్ట్ మించిపోయేలా ఇప్పుడు ఈ కథ ఓ మలుపు తిరిగింది. చిన్నయ్య తన ఆరోపణలు అబద్ధమని ఒప్పుకున్నాడు.
చిన్నయ్య ఆరోపణలు నిజమా, అబద్ధమా?
చిన్నయ్య ఆరోపణలు మొదట్లో షాకింగ్‌గా అనిపించాయి. అతను కోర్టులో ఒక అస్తిపంజరాన్ని చూపించి, ఇది తాను పూడ్చిన శవాల్లో ఒకటని చెప్పాడు. 13 సమాధి స్థలాల గురించి చెప్పి.. అక్కడ తవ్వకాలు జరపాలని కోరాడు. SIT ఆధ్వర్యంలో జూలై 29 నుంచి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. కూడా చిన్నయ్యకు ఓ ముసుగు వేసి మరీ తీసుకువెళ్లారు. 17 స్థలాల్లో తవ్వకాలు జరిగాయి, కానీ ఆశ్చర్యకరంగా, 15 స్థలాల్లో ఎలాంటి మానవ అవశేషాలు లభించలేదు. ఒక స్థలంలో పాక్షిక స్కెలిటన్, మరొక స్థలంలో ఒక మానవ పుర్రె, కొన్ని ఎముకలు లభించాయి. కానీ అవి మహిళలవి కాదని, ఒక పురుషుడివని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. చిన్నయ్య సమర్పించిన పుర్రె కూడా ఒక పురుషుడిదని తేలింది. ఈ పరిణామాలతో, చిన్నయ్య ఆరోపణలపై అనుమానాలు మొదలయ్యాయి. అతని సహోద్యోగులు కూడా అతని వాదనలను ధృవీకరించలేదు. చివరకు చిన్నయ్యను SIT అధికారులు అరెస్ట్ చేసి విచారించగా.. అతను అబద్ధాలు చెప్పినట్లు అంగీకరించాడు.
చిన్నయ్య అబద్ధాలు ఎందుకు చెప్పాడు?
తనతో కొందరు బలవంతగా ఇలాంటి అబద్ధాలు చెప్పించినట్టు సిట్ విచారణలో చిన్నయ్య తెలిపాడు. అయితే ఈ అబద్ధాలు ఎవరు చెప్పించారు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇంకా రాలేదు. కొందరు ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని, ధర్మస్థల ఆలయ యాజమాన్యాన్ని టార్గెట్ చేయడానికి ఈ కథ కట్టబడిందని అనుమానిస్తున్నారు. ధర్మస్థల ఆలయం చాలా కాలంగా స్థానిక రాజకీయ వివాదాల్లో కేంద్ర బిందువుగా ఉంది. 2012లో 17 ఏళ్ల బాలిక హత్య కేసు, 1986లో మహిళ హత్య కేసు వంటి గత సంఘటనలు ఈ ఆరోపణలకు మరింత ఊతమిచ్చాయి. కానీ, చిన్నయ్య ఆరోపణలు ఈ పాత కేసులతో సంబంధం లేనివిగా కనిపిస్తున్నాయి. అతని వాదనలను ధృవీకరించే ఆధారాలు లేకపోవడంతో, అతని కథపై నమ్మకం సన్నగిల్లింది. SIT ఇప్పుడు చిన్నయ్యను తీవ్రంగా ప్రశ్నిస్తోంది, అతని వాదనల వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ సాగిస్తోంది.
సుజాత భట్ ఆరోపణల వెనుక అసలు నిజం ఏంటి..?
మొదట్లో చిన్నయ్య ఆరోపణల తర్వాత, సుజాత భట్ అనే వృద్ధురాలు తన కూతురు అనన్య భట్ 2003లో ధర్మస్థలలో అదృశ్యమైందని, ఆమె కూడా ఈ హత్యల బాధితురాలై ఉండొచ్చని ఆరోపించింది. ఈ ఆరోపణలు కేసుపై మరింత ఆసక్తిని పెంచాయి. కానీ తాజాగా సుజాత ఒక యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ, అనన్య తన కూతురు అన్న మాట అబద్ధమని.. అది కేవలం కట్టుకథ అని ఒప్పుకుంది. గిరీష్ మట్టన్నవర్, జయంతి అనే ఇద్దరు యాక్టివిస్టులు తన గ్రాండ్‌ఫాదర్ ఆస్తి సమస్య కారణంగా ఈ కథ చెప్పమని ఒత్తిడి చేశారని ఆమె చెప్పింది. ఈ ఆస్తి సమస్య ధర్మస్థల ఆలయ యాజమాన్యంతో సంబంధం కలిగి ఉందని, కానీ డబ్బు కోసం తాను ఈ కథ చెప్పలేదని సుజాత స్పష్టం చేసింది. సుజాతను కూడా ప్రశ్నించడానికి సిట్ నోటీసు జారీ చేసింది.
ఇప్పుడు సిట్ అధికారులు ఏం చేయనున్నారు..?
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, డీజీపీ నేతృత్వంలో, ఈ కేసును లోతుగా విచారిస్తోంది. చిన్నయ్యను అరెస్ట్ చేసిన తర్వాత, అతను అబద్ధం చెప్పినట్లు, ఫోరెన్సిక్ ఆధారాలు అతని వాదనలను తోసిపుచ్చినట్లు సిట్ పేర్కొంది. చిన్నయ్య సమర్పించిన పుర్రె, ఎముకలు ఒక పురుషుడివని, అతను చెప్పిన మహిళల శవాల కథను ధృవీకరించే ఆధారాలు లేవని తేలింది. సిట్ ఇప్పుడు చిన్నయ్యను తీవ్రంగా ప్రశ్నిస్తోంది. అతని వెనుక ఎవరైనా ఉన్నారా? ఈ ఆరోపణలు ఎందుకు చేశాడు? అనే కోణంలో విచారణ సాగుతోంది. సుజాత భట్‌ను కూడా సిట్ ప్రశ్నించడానికి సిద్ధమవుతోంది, ఆమె కథ వెనుక యాక్టివిస్టుల పాత్ర గురించి లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ విచారణలో రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక వివాదాలు కూడా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ధర్మస్థలపై కుట్ర జరుగుతోందా?
అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. ధర్మస్థలపై , ముఖ్యంగా హిందూ దేవాలయాలపై కుట్ర జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ధర్మస్థల ఆలయం విషయంలో చాలా కాలంగా రాజకీయపోరు నడుస్తోంది. ఇటీవల చిన్నయ్య చేసిన ఆరోపణల వెనుక ఆలయ యాజమాన్యాన్ని టార్గెట్ చేసే రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. శ్రీ క్షేత్ర ధర్మస్థల యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండిస్తూ, సిట్ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. కొందరు భక్తులు ఈ ఆరోపణలు హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసే కుట్రగా అభివర్ణించారు. Dharmasthala Case Conspiracy.
ధర్మస్థల మిస్టరీ ఇంకా సస్పెన్స్‌తో నిండి ఉంది. చిన్నయ్య అరెస్ట్, సుజాత భట్ ఆరోపణలను ఉపసంహరించుకోవడం ఈ రెండూ ఈ కేసును మరింత గందరగోళంగా చేశాయి. సిట్ ఇప్పుడు చిన్నయ్య, సుజాతలను తీవ్రంగా ప్రశ్నిస్తోంది, వారి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తోంది. ఫోరెన్సిక్ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి, లభించిన ఎముకలు, పుర్రెలు ఎవరివి, ఎలా చనిపోయారనే వివరాలు తేలాల్సి ఉంది. ఈ కేసు ఒక కుట్రగా ముగుస్తుందా, లేక ధర్మస్థలలో నిజంగా ఏదైనా చీకటి రహస్యం బయటపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం సిట్ విచారణ మీద ఆధారపడి ఉంది.