ఒకే వేదికపై ముగ్గురు పవర్ ఫుల్ లీడర్స్..!

Modi Putin Xi meeting: చైనాలో జరిగిన SCO సమావేశం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక ఘట్టంగా నిలిచింది. ఇక్కడ ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు పవర్ ఫుల్ వ్యక్తులు కనిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒకే వేదికపై కలిసి కీలక విషయాలను చర్చించుకోవడం అమెరికాకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ ముగ్గురు పవర్ ఫుల్ నేతలు కలిసిన దృశ్యం, ముఖ్యంగా పుతిన్‌తో మోదీ ఒకే కారులో ప్రయాణించిన సన్నివేశం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్పష్టమైన సందేశం పంపింది అంటున్నారు. అసలు ఈ ముగ్గురిని చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది..? చైనాలో జరిగిన సమావేశంలో నేతలు దేని గురించి ప్రధానంగా చర్చించుకున్నారు..? ట్రంప్ తప్పు చేశానని ఎందుకు భావిస్తున్నారు..? తెలుసుకోవాలంటే చూడాల్సిందే.

ఒక్క చిన్న తప్పు మొత్తం వ్యవస్థను మార్చేస్తోంది. కాని ట్రంప్ చేసి చిన్న తప్పు కాదు.. చాలా పెద్ద తప్పు.. అది ప్రపంచ రాజకీయాలనే ఓ మలుపు తిప్పింది. తాను ఏదో తలిస్తే.. భగవంతుడు మరొకటి తలచాడని అంటారు. అదే విధంగా ట్రంప్ ఏదో ప్లాన్ చేస్తే మరేదో జరిగింది. భారత్ ను తన సుంకాలతో భయపెట్టాలని చూస్తే.. ఇది అమెరికాకు బూమర్యాంగ్ అయ్యి.. ఇప్పుడు ఆ దేశమే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ చర్యలతో భారత్ ఇప్పుడు చైనాకు దగ్గరైంది. అంతేకాదు ఇప్పటి వరకు రష్యాతో భారత్, చైనా మంచి మిత్రులుగా కొనసాగినా.. భారత్, చైనా మధ్య విభేదాలు కొనసాగాయి. అయితే ట్రంప్ తన బలాన్ని చూపించే ప్రయత్నంలో చేయరాని తప్పు చేశారు. తద్వారా భారత్, చైనా తమ విభేదాలను పక్కన పెట్టి కలిసేలా చేశారు. ఏకంగా రష్యా, భారత్, చైనా వంటి మూడు శక్తివంతమైన దేశాలను అన్నింటి పక్కన పెట్టి కలిసేలా చేసిన ఘనత మాత్రం ట్రంప్ కే దక్కుతుంది. చైనాలో జరిగిన SCO సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించడం అమెరికాకు ఒక స్పష్టమైన సందేశం. దీనికి తోడు పుతిన్ తన కారులో మోదీని తీసుకెళ్లడం కోసం 10 నిమిషాలు వేచి ఉండటం, ఆ తర్వాత 45 నిమిషాల పాటు కారులోనే చర్చలు జరపడం ఒక అసాధారణ ఘట్టం. ఈ దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వరుసగా ప్రసారం అవుతున్నాయి. దీంతో వైట్ హౌస్ తాము చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించడం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25% అదనపు సుంకం విధించడం భారత్‌ను ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే వైపు నడిపించింది. ఈ సుంకాలు భారత ఉత్పత్తులను గణనీయంగా ప్రభావితం చేశాయి, దీనివల్ల భారత్ తన రాజకీయ వ్యూహాన్ని పునఃసమీక్షించవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ చైనాతో సంబంధాలను పెంచుకునే దిశగా అడుగులు వేయడం, రష్యాతో సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడం కనిపిస్తోంది. నిపుణులు ఈ సమావేశాన్ని పశ్చిమ ఆధిపత్యానికి సవాల్ గా చూస్తున్నారు. ట్రంప్ విధానాలు భారత్‌ను చైనా, రష్యాతో దగ్గర చేసాయని, ఇది ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భావానికి సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంలో జిన్‌పింగ్ భారత్-చైనా ఇక భాగస్వాములని.. పోటీదారులు కాదని పేర్కొనడం కూడా ఈ దిశలో ఒక సానుకూల అడుగు.

పుతిన్ కారులో మోదీ ప్రయాణంపై చర్చ ఎందుకు..?
పుతిన్ తన ఆరస్ సెనట్ లిమోజిన్‌లో మోదీని తీసుకెళ్లిన వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ కారు రష్యా రాజకీయ గౌరవ చిహ్నం. ఇందులో మోదీ ప్రయాణించడం.. భారత్-రష్యా స్నేహానికి చిహ్నం. రష్యా కు చెందిన ఆరస్ మోటార్స్ అత్యంత విలాసవంతంగా ఈ కారును తయారు చేసింది. ఇది పూర్తిగా బుల్లెట్‌ప్రూఫ్. అమెరికా అధ్యక్షుడు కారులా ఇందులో కూడా అధునాతన భద్రతా లక్షణాలు ఉంటాయి. ఈ కారు రష్యా అధ్యక్షుడి అధికారిక వాహనంగా ఉపయోగిస్తారు. దీనిని పుతిన్ కోసం ప్రత్యేకంగా మాస్కో నుంచి తీసుకువచ్చారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశాధినేత మరొక నాయకుడితో కలిసి ఒకే కారులో వెళ్లడం చాలా అరుదు. పైగా పుతిన్ మోదీ కోసం 10 నిమిషాలు వేచి ఉండటం, 45 నిమిషాల పాటు కారులో చర్చలు జరపడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

చైనా వైపు నుంచి కూడా మోదీకి అసాధారణ ఆతిథ్యం లభించింది. జిన్‌పింగ్ తన హాంగ్‌కీ లిమోజిన్‌లో కారును మోదీ కోసం పంపారు. ఇది కూడా చైనా అధ్యక్షుడి అధికారిక వాహనంగా ఉంది. ఈ కారు సాధారణంగా చైనా అధ్యక్షుడు, ప్రత్యేక విదేశీ అతిథుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. మోదీకి ఈ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చైనా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచాలనే సంకేతాన్ని ఇచ్చింది, ఇది 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత సంబంధాల సాధారణీకరణ దిశగా ఒక ముఖ్యమైన అడుగు.

SCO సమావేశంలో మోదీ దౌత్య వ్యూహం ఒక రాజకీయ మాస్టర్‌స్ట్రోక్‌గా కనిపిస్తుంది. ఒకవైపు ట్రంప్‌కు స్వతంత్ర విదేశాంగ విధాన సందేశం పంపడం, మరోవైపు పాకిస్థాన్‌కు ఉగ్రవాదంపై హెచ్చరిక జారీ చేయడం, చైనాకు సార్వభౌమత్వం గుర్తుచేయడం ఈ మూడింటినీ ఒకే వేదికపై సాధించారు. పహల్గామ్ ఉగ్రదాడిని SCO డిక్లరేషన్‌లో ఖండించడం భారత్‌కు ఒక దౌత్య విజయం. ఉగ్రవాదంలో రెండు రకాల ధోరణులు అనుమతించరాదు అని పాకిస్థాన్ సమక్షంలోనే చెప్పించడం ఒక సాహసమైన చర్య. Modi Putin Xi meeting.

మరోవైపు మోదీ చైనా టూర్ నేపథ్యంలో అమెరికా తన మాట మార్చింది. నిన్నటి వరకు భారత్ పై సుంకాల పేరుతో భారం మోపేందుకు ప్రయత్నించిన అమెరికా.. ఇప్పుడు తియ్యని మాటలు మాట్లాడుతోంది. ముఖ్యంగా మోదీ, పుతిన్, జిన్ పింగ్ ను ఒకే వేదికపై చూసిన అమెరికా తన మాటను మార్చింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా భారత్‌-అమెరికా సంబంధాలను కొనియాడారు. వీటిని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొంటున్నట్లు ప్రకటించారు. భారత్‌-అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరాలను అందుకొంటున్నాయి. ఇరుదేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహమే తమ సహకారానికి పునాదులుగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు.