
BCCI Dream11 Sponsorship: భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11, టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్ ఒప్పందం నుంచి అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. రూ. 358 కోట్ల భారీ ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకున్నప్పటికీ, బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టమే ఈ అనూహ్య పరిణామాలకు దారితీసింది.
ఈ విషయంపై డ్రీమ్ 11 ప్రతినిధులు నేరుగా బీసీసీఐ కార్యాలయానికి వెళ్లి, తమ నిర్ణయాన్ని సీఈఓ హేమాంగ్ అమిన్‌కు తెలియజేశారు. “కొత్త చట్టం కారణంగా తాము స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించలేమని డ్రీమ్ 11 ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో రాబోయే ఆసియా కప్‌కు వారు స్పాన్సర్‌గా ఉండరు. త్వరలోనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలుస్తాం” అని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఒప్పందం ప్రకారం, ఒకవేళ ఏదైనా కొత్త చట్టం వల్ల కంపెనీ ప్రధాన వ్యాపారానికి ఆటంకం కలిగితే, ఎలాంటి జరిమానా లేకుండా స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలగేందుకు డ్రీమ్ 11కు వెసులుబాటు ఉంది. ఈ క్లాజ్ కారణంగానే, ఒప్పందాన్ని ముందుగా రద్దు చేసినందుకు బీసీసీఐకి వారు ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.
2023లో బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈ తాజా పరిణామం కేవలం బీసీసీఐపైనే కాకుండా, క్రికెట్ ప్రపంచంపై కూడా ప్రభావం చూపనుంది. డ్రీమ్ 11 ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలతో పాటు, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి అనేక మంది స్టార్ క్రికెటర్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో ఇండియా-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వివో తప్పుకున్నప్పుడు, 2020లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్, న్యూజిలాండ్ డొమెస్టిక్ టీ20 టోర్నీ ‘సూపర్ స్మాష్’ వంటి లీగ్‌లకు కూడా డ్రీమ్ 11 స్పాన్సర్‌గా ఉంది. ఐపీఎల్ స్థాయిలో ఆర్థిక బలం లేని ఈ లీగ్‌లు రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. BCCI Dream11 Sponsorship.
దాదాపు 18 సంవత్సరాల క్రితం డ్రీమ్11 ప్రారంభమైంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది. ప్రస్తుతం డ్రీట్ 11 బ్రాండ్ విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 69 వేల కోట్ల రూపాయలు అని అంచనా. BCCI జూలై 2023లో డ్రీమ్11తో రూ. 358 కోట్లకు స్పాన్సర్‌షిప్ డీల్‌పై సంతకం చేసింది. వచ్చే ఈ డీల్ గడువు ముగియనుంది. కానీ కేంద్ర తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో తమకు ఇబ్బందులు తప్పవని భావించిన డ్రీమ్ 11 భారత క్రికెట్ బోర్డుతో చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగించలేమని భావించింది. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలతో చర్చించగా అధికారికంగా డీల్ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు.