
Shikhar Dhawan ED: ప్రజల్ని ఆర్థికంగా దెబ్బతీసిన ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లను కేంద్రం నిషేధించడంతో .. గతంలో వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రెటీలు ఇప్పుడు చిక్కులు పడుతున్నారు. తాజాగా భారత క్రికెట్ స్టార్ శిఖర్ ధావన్ ఇప్పుడు ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నాడు. ఈడీ శిఖర్ ధావన్‌ను అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు పిలిచింది. ఈ కేసులో ధావన్ ఒక్కడే కాదు, సురేష్ రైనాతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈడీ రాడార్‌లో ఉన్నారు. అసలు సెలబ్రిటీలు చేసిన తప్పు ఏంటి..? కేంద్ర ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై నిషేధం విధించడ వల్ల ఇప్పుడు ప్రముఖులు చిక్కులు ఎదుర్కోవాల్సిందేనా..? గతంలో సంపాదించిన సొమ్ముకు ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిందేనా..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
భారత్ లో రోజురోజుక ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో ఇటీవల వాటిని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బెట్టింగ్ యాప్స్ భారత్ లో కనిపించకూడదని.. వాటిని సెలబ్రెటీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రమోట్ చేయకూడదని ఆదేశించింది. ఇది చట్టం రూపంలో కూడా వచ్చింది. అయితే గతంలో ఈ బెట్టింగ్ యాప్ లకు ప్రమోట్ చేసి.. భారీగా సంపాదించిన వారు ఇప్పుడు లెక్కలు చెప్పాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఈడీ నోటీసులు ఇచ్చి విచారిస్తోంది. ఇలా ఈడీ నోటీసులు అందుకున్న వారిలో సినీ, క్రికెట్ రంగ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా గతంలో వన్ ఎక్స్ బెట్ అనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా న్యూ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ విచారణకు హాజరయ్యాడు. ఎన్ ఎక్స్ బెట్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అతడిని పిలిచింది. ఈ యాప్‌ను శిఖర్ ధావన్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ధావన్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. ఈ కేసులో ధావన్ పాత్ర ఏమిటి, అతడు ఈ యాప్‌తో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు అనే విషయాలను ఈడీ తెలుసుకుంటోంది.
వన్ ఎక్స్ బెట్ ఒక అంతర్జాతీయ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్, ఇది భారత్‌లో చట్టవిరుద్ధంగా నడుస్తోందని, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలకు పాల్పడుతోందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ యాప్ క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడలపై బెట్టింగ్ లు వేస్తోంది. భారత్‌లో దీని కార్యకలాపాలు చట్టవిరుద్ధం. అయినా ధావన్ ఈ యాప్‌కు సంబంధించి ఎండార్స్మెంట్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ ఇప్పుడు ఈ ఎండార్స్మెంట్స్ ద్వారా ధావన్‌కు ఎంత చెల్లించారు, ఆ లావాదేవీలు ఎలా జరిగాయి అనే విషయాలను పరిశీలిస్తోంది.
శిఖర్ ధావన్ ఒక్కడే కాదు, ఈ కేసులో ఇప్పటికే సురేష్ రైనా, హర్భజన్ సింగ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ఊర్వశీ రౌతలా, ప్రకాష్ రాజ్ వంటి సెలబ్రిటీలు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈ సెలబ్రిటీలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రకటనలు చేసినందుకు ఈడీ వారిని విచారించింది. ఈ యాప్‌లు కోట్ల రూపాయలు మోసం చేసినట్లు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ని ఉల్లంఘించి విదేశాలకు డబ్బు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెలబ్రిటీలు ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారని, వీటి చట్టబద్ధతను పరిశీలించకుండా ప్రమోట్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంది..?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్, రియల్-మనీ గేమింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం భారత్ లో ఇకపై ఆన్లైన్ మనీ గేమింగ్ నిషేధం. 2022 నుంచి 2025 జూన్ వరకు, ప్రభుత్వం 1,524 ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. ఈ యాప్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలు ఇవ్వడం గురించి తెలుసుకోవడానికి ఈడీ ఇటీవల గూగుల్, మెటా ప్రతినిధులను కూడా విచారణకు పిలిచింది. ఈ యాప్‌లు భారత్‌లో 22 కోట్ల మంది యూజర్లను కలిగి ఉన్నాయని, వీరిలో 11 కోట్ల మంది రెగ్యులర్ యూజర్లని, మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్ లో ఆన్ లైన్ బెట్టింగ్స్ యాప్‌లు కోట్ల రూపాయలను మోసం చేసినట్లు, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ గువాహటిలో అరెస్ట్ చేసింది, అతడు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా 2,000 కోట్ల రూపాయలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు, ముంబై, గోవా, జోధ్‌పూర్‌లో 31 ప్రదేశాల్లో సోదాలు చేసి, 12 కోట్ల రూపాయల నగదు, కోటి రూపాయలు విదేశీ కరెన్సీ, 6 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఈ యాప్‌లు దుబాయ్ నుంచి నడుస్తూ, ఫిన్‌టెక్ సర్వీస్‌ల ద్వారా అక్రమ లావాదేవీలను నిర్వహిస్తున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది.
ఈ విచారణలు సెలబ్రిటీలకు భారీ ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. శిఖర్ ధావన్ వంటి ప్రముఖుల ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈడీ విచారణలో ఒకవేళ అక్రమ లావాదేవీలలో సెలబ్రిటీల పాత్ర ఉన్నట్లు తేలితే, జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల వారి బ్రాండ్ విలువ, భవిష్యత్ ఎండార్స్మెంట్ అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువత తీవ్రంగా నష్టపోయారు. కొందరు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో భారత్ లో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఈ యాప్స్ కు గతంలో ప్రమోట్ చేసిన సెలబ్రెటీలపై పడే అవకాశం ఉంది. Shikhar Dhawan ED.
అటు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై కఠిన చర్యలతో, ఈ కేసు భారత్‌లో ఆన్లైన్ గేమింగ్ రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుంది. బీసీసీఐ కూడా డ్రీమ్11 వంటి ప్లాట్‌ఫామ్‌లతో సంబంధాలను తెంచుకుంది, భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేయబోమని ప్రకటించింది. ఈ కేసు సెలబ్రిటీలకు ఒక హెచ్చరికగా మారింది. ఎండార్స్మెంట్స్ చేసే ముందు వాటి చట్టబద్ధతను పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.