మార్వాడీలు అంటే ఎవరు? ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చారు?

Go Back Marwadi: గో బ్యాక్ మార్వాడీ…ఇప్పుడు తెలంగాణలో రాజుకుంటున్న మరో ఉద్యమం ఇది. రాష్ట్రంలో మార్వాడీల మీద వ్యతిరేకత ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో గానీ..ఇప్పుడైతే ఇది అంత ఈజీగా చల్లారేలా కనిపించడం లేదు. మెల్లి మెల్లిగా ఈ ఉద్యమం అన్ని జిల్లాలకు పాకుతోంది. మీరు మా కడుపు కొడుతున్నారు..మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ బంద్ కు పిలుపునిస్తూ తెలంగాణ వర్తక సంఘం ఓ వైపు ఉద్యమిస్తూంటే…మీరు లోకలైతే..మేము కూడా లోకలే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం మాకూ వాటా ఇస్తారా అంటూ మార్వాడీ సమాజం రివర్స్ అవుతోంది. వీరికి తెలంగాణలో కొంత మంది నుంచి సపోర్ట్ కూడా అందుతోంది. తెలంగాణలో స్టార్ట్ అయిన ఈ గో బ్యాక్ మార్వాడీ నినాదం ఇప్పుడు ఏపీకి కూడా పాకుతోంది. దీంతో అసలు మార్వాడీలు అంటే ఎవరు? వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ల చరిత్ర ఏంటో తెలుసుకుందం..

మార్వాడీ అంటే అందరూ అదేదో కులం అని అనుకుంటారు. కానీ అది కులం కాదు. అది ఒక ప్రాంతం పేరు. రాజస్థాన్ లోని థార్ ఎడారికి దగ్గరగా ఉండే ప్రాంతమే మార్వార్. ఆ ప్రాంతంలో ఉండే వారినే మార్వారీ అని.. మార్వాడీ అని పిలుస్తుంటారు. వారు మాట్లాడేది భాషను కూడా మార్వాడీ భాషనే అంటారు. మార్వారీ అనే పదానికి అర్థం కూడా ఎడారి ప్రాంతాలకు దగ్గరగా ఉండే వారని తెలుపుతుంది. మార్వాడీల్లో రెండు ప్రధాన మతాలు ఉంటాయి. వీరిలో హిందువులు , జైనులు ఉంటారు. మతాలతో పాటు చాలా కులాలు ఉన్నాయి. వీరిలో సంప్రదాయ బద్ధంగా వ్యాపారం చేసే కులాలు ఉన్నాయి. మార్వాడీల్లో వ్యాపారం చేసే బనియా కులస్తులతో పాటు ఇతర వృత్తుల్లో ఉన్న కులాలు కూడా ఉన్నాయి.

మార్వాడీల్లో చాలా మంది వ్యాపారమే చేస్తారు. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో వీరు ఉండటం వల్ల వారి ప్రాంతాల్లో వ్యవసాయం తక్కువ.దానిపైన వారికి పెద్దగా అవగాహన కూడా ఉండదు. అందుకే పూర్వం నుంచి వారు సంప్రదాయంగా వ్యాపార రంగంలోనే ఉన్నారు. హిందూ రాజపుత్ర రాజులు పాలించిన కాలంలో , ఆ తర్వాత వచ్చిన మొఘల్ ముస్లీం రాజుల పాలనలో అనంతరం వచ్చిన బ్రిటిష కాలంలో కూడా వారు వ్యాపారం చేస్తున్నారు. ఆయా కాలాల్లో ఉన్న రాజులతో సఖ్యతగా ఉంటూ కొత్త కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ భారత్ తో పాటు పాకిస్థాన్ , నేపాల్ వంటి ప్రాంతాలతో సహా భారత ఉపఖండం మొత్తం వీరు విస్తరించారు. వ్యాపారం చేసేందుకు తమకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడికి వలస వెళ్లి అక్కడ బిజినెస్ మొదలు పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో రాజులకు అప్పులు ఇవ్వడంతో పాటు , మార్వాడీలు ఆర్థిక సలహాదారులుగా కూడా ఉన్నారని చరిత్ర చెబుతోంది.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మార్వాడీల్లో ఎక్కువగా కనిపించేది బనియాలు. వ్యాపారమే వీరిది కుల వృత్తి. వీరితో పాటు ఇతర కులాల వారు కూడా ఉన్నారు. వీళ్లల్లో వ్యాపారమే కాకుండా అన్ని వృత్తులు చేసే వారు కూడా ఉన్నారు. బ్రిటిష్ కాలంలో కలకత్తా , ముంబై, మద్రాస్ ప్రాంతాలు అభివృద్ధి అవుతున్న సమయంలో అక్కడ కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం ఆయా ప్రాంతాలకు వలస వెళ్లి మార్వాడీలు వ్యాపారాలు చేశారు. ఇక రాజస్థాన్‌లో కరువు వచ్చినప్పుడు నిజాంల కాలంలో మార్వాడీలు హైదరాబాద్‌కు వలస వచ్చారని తెలుస్తోంది. బ్రిటిష్ వారికంటే ముందే అంటే కుతుబ్ షాహీల కాలంలోనే మార్వాడీలు, గుజరాతీలు అనేకమంది హైదరాబాద్ కి వలస వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ అనేది వజ్రాల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అలా హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారం కోసం అని ఇప్పుడున్న కార్వాన్ ప్రాంతానికి వచ్చి మార్వాడీలు , గుజరాతీలు సెటిల్ అయ్యారు. భారతదేశంలో మార్వాడీలు ఎక్కువగా రాజస్థాన్ లో కనిపిస్తారు..ఆ తర్వాత వారు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకాలో ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఉమ్మడి ఏపీలో ఉన్నారు. భారత దేశం మొత్తంగా చూసుకుంటే వారి జనాభా 78 లక్షలకు పైగా ఉంది. ఇక భాషా పరంగా వారి భాష 20 వ స్థానంలో ఉంది.

ఇక 2011 జనాభా లెక్కల ప్రఖారం అంటే 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 76వేల 480 మంది తమ మాతృ భాష మార్వాడీ అని చెప్పారు. అంటే అంత మంది మార్వాడీలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగొచ్చు. తెలంగాణ లో మార్వాడీలు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వీరి సంఖ్య అధికంగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని బేగం బజార్, సుల్తాన్ బజార్, మోండా మార్కెట్, గోషా మహల్ వంటి చోట్ల వీరు ఎక్కువగా కనిపిస్తారు. బంగారం, బట్టల వ్యాపారాల్లో వారు ఎక్కువగా కనిపించినా, ఫుడ్, రెస్టారెంట్స్, ఎలక్ట్రికల్, పెయింట్, సిమెంట్, శానిటరీ వంటి షాపుల్లోనూ మార్వాడీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇక మార్వాడీల్లో కొన్ని కుటుంబాలు ఆమన్‌‌గల్‌, కడ్తాల్‌, కల్వకుర్తి తదితర చోట్ల వ్యాపారాలను నిర్వర్తిస్తున్నాయి. మొదట్లో చిన్న కిరాణం, స్వీట్‌ షాపులతో ప్రారంభించి ప్రస్తుతం బంగారం, ఎలక్ట్రానిక్, నిర్మాణ రంగం, హోటళ్లు, చెప్పుల వ్యాపారం వంటి రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అయితే మార్వాడీల వ్యాపార విస్తరణతో తమ వ్యాపారం తగ్గిందని స్థానిక వ్యాపారుల ఆందోళన . మార్వాడీలు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండడంతో స్థానికులకు సైతం ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయన్నది మరో వాదన . ఈ నేపథ్యంలోనే లోకల్‌ వ్యాపారులు మార్వాడీ వ్యాపారస్తులపై తిరుగుబాటుకు దిగుతున్నారు.

అన్నిచోట్ల మాదిరిగానే లోకల్‌, నాన్‌ లోకల్‌ ఫైట్‌ ఆమన్‌‌గల్‌‌లో ఎంతో కాలంగా నడుస్తోంది. స్థానిక కుల సంఘాల తీర్మానాలతో కొత్తగా దుకాణాలను ఏర్పా టు చేసుకోవడం అన్నది అన్ని సామాజిక వర్గాల్లోనూ కొనసాగుతూ వస్తోంది. అయితే మార్వాడీలు మాత్రం ఏకపక్షంగా దుకాణాలను విస్తరించుకుంటూ పోతుండడమే స్థానిక వ్యాపారుల కోపానికి ఒకింత కారణమైంది. మూడేళ్ల క్రితం స్థానిక వ్యాపారులకు, మార్వాడీలకు ఒక ఒప్పందం కుదిరింది. అప్పటివరకు ఉన్న మార్వాడీలు మాత్రమే వ్యాపారం చేసుకోవాలని, కొత్తగా వ్యాపారాన్ని విస్తరించవద్దన్నది ఆ ఒప్పందం సారాంశం. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి రీసెంగ్ కొత్తగా షాప్‌ను ఓపెన్‌ చేసేందుకు మార్వాడీలు ప్లాన్ చేశారు. దీంతో స్థానిక వ్యాపారుల ఆగ్రహానికి గురైయ్యారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చారు. Go Back Marwadi.

మరోవైపు హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటనతో మార్వాడీ గో బ్యాక్‌ అనే నినాదం ఊపందుకుంది. సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ కావడం.. దీనిపై సామాజిక ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు స్పందించడంతో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మారిపోయింది. అటు ఏపీలో కూడా గోబ్యాక్ మార్వాడీ స్లోగన్ రచ్చరచ్చవుతోంది. మార్వాడీలను తరిమికొట్టాలని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. దీంతో స్థానిక మార్వాడీలు జైనులు ఎమ్మెల్యేను ఆశ్రయించి, అండగా నిలవాలని కోరారు. మార్వాడీలపై ఈగ వాలనివ్వబోమని ఎమ్మెల్యే మాటిచ్చారు. ఇటు హైదరాబాద్‌లో మార్వాడీ హఠావో.. తెలంగాణ బచావో అంటూ గళమెత్తారు వైశ్య వికాస వేదిక నాయకులు. తెలుగు రాష్ట్రాల్లో మెల్లగా రాజుకున్న గోబ్యాక్ మార్వాడీ నినాదం ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q