యాదగిరిగుట్టకు అరుదైన గౌరవం, కెనడా ప్రధాని ప్రశంస.!

Canadian PM Mark Carney: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్యాత్మికతతో పాటు విశ్వవ్యాప్త స్థాయిలో తన ప్రాచుర్యాన్ని పెంచుకుంటోంది. తాజాగా ఈ దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ఆలయ నిర్వాహకులను అభినందిస్తూ ఒక ప్రత్యేక లేఖను పంపడం విశేషంగా మారింది. ఈవై సెంటర్, ఒట్టావాలో ఇటీవలే వైభవంగా నిర్వహించిన యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ తన అభినందనలు తెలిపారు. ఈ లేఖలో ఆయన హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతా భావం, సామాజిక విలువలపై విశేషంగా ప్రశంసలు గుప్పించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనుషుల మధ్య బంధాలను బలపరుస్తాయి, భిన్న సంస్కృతులను ఒకేచోట కలిపే వేదికగా మారతాయి అని పేర్కొన్నారు.

ప్రస్తుతం కెనడాలోని నాలుగు రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ సేవలను నిర్వహిస్తున్న నిర్వాహకులు, సమన్వయకర్తల తపన, శ్రద్ధపై కూడా ప్రధాని ప్రశంసలు తెలిపారు. కెనడాలోని హిందూ సమాజం ద్వారా అక్కడి సాంస్కృతిక సమాజానికి దోహదం కలిగిందని, వారి విలువల పరిరక్షణలో ఈవిధమైన కార్యక్రమాలు ప్రాముఖ్యత పొందుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లేఖకు స్పందించిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని నుంచి లభించిన అభినందన లేఖ యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్రలో గర్వించదగిన ఘట్టంగా నిలిచింది. ఇది మన రాష్ట్రానికి, మన ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రపంచ గుర్తింపు తెచ్చే సంఘటన అని వారు వ్యాఖ్యానించారు.

యాద‌గిరిగుట్ట ఆలయం పునరాభివృద్ధి తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పునరాభివృద్ధిలో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని విస్తరించారు, కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆలయానికి స్వర్ణగోపురం సైతం ఏర్పాటు చేశారు. దీనికోసం ఆలయ నిర్వాహకులు భక్తుల నుంచి విరాళాలు సేకరించారు. దాదాపు 65 కేజీల బంగారంతో స్వర్ణ గోపురం రూపుదిద్దుకోగా.. ఇది పూర్తయిన తర్వాత యాదగిరిగుట్ట ఆలయం మరింత అద్భుతంగా, సుందరంగా మారింది. ఇక గతంలో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు మెరుగైన సౌకర్యాలతో వారు సులభంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం తర్వాత మహిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం వల్ల సాధారణ రోజుల్లోనూ ఆలయానికి భారీగా భక్తులు వస్తున్నారు.

పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ నిర్వాహకులు భద్రతను కూడా పెంచారు. క్యూలైన్ల నిర్వహణ, అన్నదానం, తాగునీటి సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తాజా అంతర్జాతీయ గుర్తింపుతో యాద‌గిరిగుట్ట ఆలయం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ఆలయం ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రయాణ సౌకర్యాలు, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. Canadian PM Mark Carney.

యాదగిరిగుట్ట స్వామివారి వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఇది ఒక కీలక అడుగని నిర్వాహకులు అన్నారు. ఆలయానికి లభిస్తున్న ఈ అంతర్జాతీయ గుర్తింపు భక్తుల నమ్మకానికి నిదర్శనంగా మారిందన్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q