
Siddipet Chinnakodur Rythu Bazaar: నాణ్యమైన కూరగాయల్ని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్ మందు బాబులకు అడ్డాగా మారింది. అందులో క్రయవిక్రయాలు జరగట్లేదు. సాయంత్రం వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికవుతోందన్న ఆరోపణలున్నాయి. రైతులు, కొనుగోలుదారులకు అనువుగా ఉండేందుకు మండల కేంద్రంలో నడిబొడ్డున 2018 లో రూ.30 లక్షలతో నిర్మించిన రైతు బజార్ అలంకార ప్రాయంగా మారింది. నేడు గొర్రెల దొడ్డికి నిలయమైంది… ఎలక్ట్రికల్ పరికరాలు దొంగలపాలైనాయి.. నిరుపయోగ స్థితిలో…మందుబాబులకు అడ్డగా మారిన రైతు బజర్ పై స్పెషల్ స్టోరీ..
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామంలో రైతులు పండించిన పంటల ద్వారా వచ్చిన ఆదాయం వ్యవసాయ మార్కెట్ కమిటీకి సమకూరిన నిధులతో మార్కెట్‌ను నిర్మించారు. కూరగాయలతో పాటు మాంసాన్ని విక్రయించేందుకు మొదట చర్యలు బాగానే తీసుకున్నారు. కానీ మార్కెట్లో సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారస్తులు ఒక్కొక్కరు గతంలోలాగే రోడ్డుపైనే విక్రయాలు జరుపుతున్నారు.
ప్రతీవారం రెండు రోజులలో మాంసం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఏదైనా పండుగ లొస్తే మాంసాన్ని కొనేందుకు మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చిన్నకోడూరుకే వస్తుంటారు. దీంతో వాహనాల పార్కింగ్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. అందరికీ అనువుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్‌ను ఎవరూ పట్టించుకోకపోవడంతో అదికాస్తా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
నేటికీ అందులో క్రయవిక్రయాలు జరగట్లేదు. సాయంత్రం వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికవుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కూరగాయల అమ్మకాలు ఎప్పటిలాగానే రోడ్లపై కొనసాగుతున్నాయి. మోడల్ రైతు బజార్ వినియోగంలో లేకపోవడంతో అపరిశుభ్రంగా మారిపోయింది. ఇదే అదనుగా భావించిన మందు బాబులు దీనిని సిట్టింగ్‌కు అడ్డాగా చేసుకున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి.
ముఖ్యంగా మందు బాబు లకు పర్మిట్ రూమ్లోలా మారిందనే చెప్పవచ్చు. మూడు షెడ్లను కూరగాయలు, మాంసం అమ్ముకునేందుకు నిర్మించగా అవి కాస్తా నేడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 2018లో రైతు బజార్ నిర్మాణానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి రూ.30 లక్ష లు మంజూరై మాజీమంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ప్రారం భమైన కొద్ది రోజులు బాగానే నడిచినా మళ్లీ కథ కంచికే చేరింది.
మార్కెట్‌ను ఏఎంసి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కూరగాయల బండ్లు, నాన్‌వెజ్ సెంటర్లు రోడ్డుపైకి చేరాయి. దీంతో అంబేద్కర్ చౌరస్తా, యూనియన్ బ్యాంక్, మండలానికి సంబంధించిన ఆయా కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలలకు వెళ్లే రోడ్డు పక్కన మాంసం దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఆ రోడ్లపై ప్రయాణించే ప్రయాణీకులకు దుర్వాసనను తట్టుకోవ డం కష్టంగా మారింది. మాంసం వ్యర్ధాలను రోడ్డుపైన పడేయడంతో కుక్కల బెడద ఎక్కువైంది. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో మహిళలు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై నుండి దుకాణాలను మార్కెట్‌కు తరలించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరి స్తుండడంతో లక్షల రూపాయల ప్రజా సంపద పిచ్చిమొక్కల పాలైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Siddipet Chinnakodur Rythu Bazaar.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో జరిగే సంతను రైతు బజార్లో జరిగేటట్లుగా ప్రత్యేక చొరవ తీసుకొని..ప్రజల కోసం నిర్మించిన మార్కెట్ ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుకుందాం.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q