
Congress rule in Telangana: ఆ పార్టీలో గెలిచి అధికారం దక్కినా పూర్తి స్వేచ్ఛ లేదా. సొంత ఇంటిలోనే సమన్వయ లోపం ఉందా. తప్పడం లేదా. తన వెంట ఉన్న నేతలే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? బయటకు అంతా సజావుగా కనిపిస్తున్నా… ఢిల్లీ నుండి గల్లీ వరకు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక అదృశ్య హస్తం అన్నింటినీ నడిపిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఇరవై నెలలుగా హైకమాండ్ ఆపరేషన్ తీన్‌మార్ ఆడుతోందన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ ఫార్ములాకు ప్రతీకగా నిలుస్తోందన్నది తాజా టాక్. ఇప్పటికే సీఎం రేవంత్ 46 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒంటరిగా అధిష్టానం అపాయింట్‌మెంట్ అడిగితే భట్టి, ఉత్తమ్ గారు ఫ్రీగా ఉన్నారా కనుక్కోండని ఢిల్లీ నుండి సమాధానం వస్తోందట. కులగణన లాంటి చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం పొందాలన్నా, ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్ష చేయాలన్నా ఈ ముగ్గురి జాయింట్ సిగ్నేచర్ తప్పనిసరన్న ప్రచారం జరుగుతోంది. Congress rule in Telangana.
ఈ వ్యూహం వెనుక ఉన్న బలమైన కారణంఉందట. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న రాజకీయ అనుభవమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని అంచనా వేయడంలో, ఆయన దూకుడును అదుపు చేయడంలో హైకమాండ్ విఫలమైంది. ఫలితంగా జగన్ పార్టీకి దూరమై, సొంత సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్నే సవాల్ చేసే స్థాయికి బలహీనపరిచారు. ఆ అనుభవం హైకమాండ్‌ను ఇప్పటికీ వెంటాడుతోందట. రేవంత్ రెడ్డి కూడా దూకుడు స్వభావం, బలమైన వ్యక్తిగత ఇమేజ్‌తో ఎదిగిన నాయకుడు. ఆయన నేపథ్యం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి పూర్తిస్థాయిలో విశ్వాసం కలిగించలేకపోతోందట. భవిష్యత్తులో రేవంత్ మరో జగన్ తరహాలో మారకూడదన్న ముందుజాగ్రత్తతోనే మొదటి రోజు నుంచే ఆయన్ను టీమ్ అనే చట్రంలో కట్టడి చేస్తోందట అధిష్టానం. బ్రాండ్ రేవంత్ కాకుండా కాంగ్రెస్ బ్రాండ్ గొప్పదని చెప్పడమే ఈ వ్యూహానికి కారణంగా తెలుస్తోంది.
ఇది కేవలం రేవంత్‌ను కట్టడి చేయడం మాత్రమే కాదు. ఇదొక పక్కా సామాజిక, రాజకీయ సమతుల్యత వ్యూహంగా పొలిటికల్ టాక్ నడుస్తుంది. భట్టి విక్రమార్క కేవలం ఉప ముఖ్యమంత్రే కాదు. ఆయన తెలంగాణ ప్రభుత్వంలో హైకమాండ్ యొక్క కళ్ళు, చెవులు. పార్టీకి విధేయుడు, దళిత వర్గానికి ప్రతినిధి. ప్రభుత్వంలో సామాజిక న్యాయం అమలవుతోందని చెప్పడానికి భట్టి ఉనికి అధిష్టానానికి అత్యవసరం. రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తే, ఆ సమాచారాన్ని ఢిల్లీకి చేరవేసే నమ్మకమైన నేత. ఆయన సంతృప్తిగా ఉన్నారంటే, దళిత వర్గం సంతృప్తిగా ఉందని హైకమాండ్ భావిస్తుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లోని సంప్రదాయవాదులకు, ముఖ్యంగా పార్టీని దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉన్న రెడ్డి వర్గానికి ప్రతినిధి. రేవంత్ రెడ్డి వేగంతో పాత తరం నేతల్లో అభద్రతాభావం రాకుండా ఉత్తమ్ ఉనికి భరోసా ఇస్తుంది. ఆయనకు కీలక శాఖలతో పాటు, ఢిల్లీ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, సీనియర్లకు మేం మిమ్మల్ని మర్చిపోలేదనే స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నారు.
ఈ ట్రయాంగిల్ పాలిటిక్స్ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది. ఏ కీలక ఫైల్ ముందుకు కదలాలన్నా, ఈ ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం తప్పనిసరి కావడంతో కొన్నిసార్లు నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని సెక్రటేరియట్ వర్గాల మాట. ఎవరి ఆదేశాలు పాటించాలన్న అయోమయంలో అధికారులు ఉన్నారట. ఇక కీలకమైన నామినేటెడ్ పదవుల నుంచి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల వరకు ఇలా ప్రతి నియామకంలో ఈ ముగ్గురి మధ్య సమన్వయ లోపం వల్ల ఆ ప్రక్రియలు ఆలస్యం అవుతున్నాయని సమాచారం. జల వివాదాల విషయంలోను సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ వాదనలను రేవంత్ రెడ్డి గట్టిగా ఖండించకపోవడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్య పరుస్తోంది. ఒకవైపు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ వాదనను బలంగా తిప్పికొడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మౌనం పాటిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ జరిగినా హోం, విద్యా, మున్సిపల్ వంటి అత్యంత కీలక శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే అట్టిపెట్టుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పరిపాలన కేంద్రీకరణకు దారితీస్తుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు కొత్త మంత్రులైన శ్రీహరి, లక్ష్మణ్, వివేక్‌లకు కేటాయించిన శాఖలపై వారి సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది.ఇది కేటాయింపుల విషయంలో రేవంత్ రెడ్డికి ఉన్న స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాబోయే స్థానిక ఎన్నికలు రేవంత్ రెడ్డికి అసలైన అగ్నిపరీక్ష. కేవలం బీఆర్ఎస్, బీజేపీల నుంచే కాకుండా, సొంత పార్టీలోని అసమ్మతి వర్గాల నుంచి కూడా ఆయనకు సవాల్ ఎదురుకాబోతోంది.మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపు, జల వివాదాలపై సీఎం వైఖరి వంటి అంశాలపై పలువురు సీనియర్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. ఈ అంతర్గత అసమ్మతి స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ఎంతవరకు ప్రభావం చూపుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.