
Anirudh Reddy vs Laxma Reddy: ఆ ఎమ్మెల్యే తన వ్యవహార శైలికి భిన్నంగా ముందుకు సాగుతున్నారా. ప్రతిసారి వార్నింగ్ ఇస్తూ మాజీ మంత్రిని రెచ్చగొడుతున్నారా. ఇప్పటికే ఇద్దరి మధ్య రాజకీయరగడ తీవ్రస్థాయికి వెళ్లిందా. ఇద్దరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు కేరాఫ్ అవుతున్నారా. ఇంతకీ ఎవరా నేతలు. ఏదా నియోజకవర్గం. వాచ్ దిస్ స్టోరీ.
ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాలు రంజుగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల వేడి చల్లారకముందే ఇద్దరు నేతలు సై అంటే సై అంటూ బహిరంగంగా సవాళ్లు విసురుకోవడం, ఆరోపణలు చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు పదేపదే విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలకు ఆధారాలు చూపుతామని ప్రకటించడంతో నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వీరి మధ్య వైరం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చిందట.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిరుద్ రెడ్డి విజయం సాధించారు. ఒకానొక సమయంలో టికెట్ వస్తుందా లేదా అనే డోలా యానంలో ఉన్న ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో టికెట్ రావడమే కాకుండా మాజీ మంత్రిని సైతం ఓడించారు. దీంతో యువ ఎమ్మెల్యే పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ముక్కుసూటిగా మాట్లాడే అనిరుధ్ రెడ్డి స్వపక్షానికి సైతం మింగుడు పడని విధంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ రాజకీయ సమావేశాలు జరిగిన ఆయన ఘాటైన మాటలు రాజకీయరక్తి కట్టిస్తున్నారట. సొంత పార్టీల నేతలను సైతం ఆయన విడిచిపెట్టడం లేదట. దీంతో అధికార పార్టీ నేతలలో ఆయన పేరు వింటేనే ప్రజాప్రతినిధులు సైతం బెంబేలెత్తుతున్నారట. దీనికి తోడు ప్రతిపక్షాన్ని సైతం ఆయన ఒక ఆట ఆడుకుంటున్నారట. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు భూములను ఆక్రమించారనీ, దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతల్లో గుబులు పుట్టిస్తున్నారట.
ఇలా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చర్యలతో నియోజకవర్గ కార్యకర్తలు కూడా అయోమయంలో పడుతున్నట్లు ప్రచాకరం జరుగుతోంది. గతంలో లక్ష్మారెడ్డి భూములు కబ్జా చేశారని బహిరంగంగా ఆరోపించారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ నానాయాగీ చేసిన అనిరుధ్ రెడ్డి, తర్వాత వాటిని రుజువు చేయడంలో విఫలం అయ్యారు.దీంతో జనంలో ఆయన చులకన అయ్యారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోసారి మాజీమంత్రి బామ్మర్ది భూమి కబ్జా చేశారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు గోల్ మాల్ చేశారంటూ మరోసారి ఆరోపణ చేశారు. Anirudh Reddy vs Laxma Reddy.
అయతే వేటికీ రుజువులు లేకపోవడంతో ఆయన వరుసగా అభాసుపాలయ్యారట. ఇక అనిరుధ్ రెడ్డిపై కౌంటర్ మొదలు పెట్టారు లక్ష్మారెడ్డి. మతిస్థిమితం లేని ఎంఎల్ఏ అంటూ కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య అగ్ని రాజుకుంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్తితి ఎటు దారితీస్తుందో అర్థం కావడం లేదని కార్యకర్తలు వాపోతున్నారట.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q