నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికల సందడి.!

Congress organizational elections in Nizamabad: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంసాగత సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో జిల్లా పార్టీ పెద్దలు నగర కమిటీల నియామకాలపై కసరత్తు చేస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే గ్రామ, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షులతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటి, నగర కాంగ్రెస్ కమిటీల నియామకం కోసం పార్టీ అధిష్టానం చేస్తోంది. ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జిగా నియమితులైన అజ్మతుల్లా హుస్సేని జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావటంతో ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పార్టీని స్థానికంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్లాన్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే గ్రామస్థాయి నుండి పార్టీ నాయకులకు పదవులను కేటాయించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్ధమైతోందట. Congress organizational elections in Nizamabad.

అధికార కాంగ్రెస్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ నెలకొంది. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కావటంతో ఆ పార్టీ సైతం సీనియర్ నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందర్నీ కలుపుకొని పోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనే నాయకుడి కోసం పార్టీ నాయకత్వం పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో స్థానం దక్కని వారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే విషయంలో పార్టీ అధిష్టానం జిల్లా సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి లేదా బీసీ సామాజిక వర్గానికి ఈసారి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తుండగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండటంతో ఈసారి జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధిత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి రేసులో ఉన్నారట. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్ వేణుగోపాల్ యాదవ్ల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవితో సరి సమానంగా ప్రాధాన్యత ఉన్న నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సైతం పలువురు పోటీ పడుతున్నారట. జిల్లా అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి మున్నూరు సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, బొబ్బిలి రామకృష్ణ, రామ్మూర్తి గోపి తదితరులు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట. సమీకరణల వారీగా పార్టీ నాయకత్వం పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతంగా నడిపించే నాయకుల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: https://www.mega9tv.com/slideshow/the-internal-infighting-within-the-party-has-once-again-been-exposed-in-the-recent-cm-meeting/