
వేసవికాలం వచ్చిందంటే చాలు, మనతో పాటు మన వాహనాలు హీట్ ఎక్కుతాయి. టు ఆర్ ఫోర్ వీల్ వెహికిల్స్ కి మరింత పరీక్ష కాలమే. ఎండ వేడిమి పెరిగేకొద్దీ టైర్లలోని గాలి ఒత్తిడి కూడా మారుతూ ఉంటుంది. భగభగ మండే సూర్యుడి వేడి, పెరిగిపోతున్న ఉష్ణోగ్రత మీ కారు టైర్లకు ఊహించని ముప్పును తెచ్చిపెడతాయి. టైర్లలో ఒత్తిడి పెరడం లేదా తగ్గడాన్ని మీరు తేలిగ్గా తీసుకుంటే, టైర్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. మరి ఈ భగభగలాడే ఎండలో మీ టైర్లు పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
వేసవిలో ఒత్తిడి..
పగటిపూట ఉష్ణోగ్రత పెరిగినప్పుడు టైర్ల లోపల ఉన్న గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. దీనివల్ల టైర్లలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత టైర్లు పాడయ్యే అవకాశం లేదా ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వేసవిలో ప్రతి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే, టైర్లలో ఒత్తిడి దాదాపు 1- 2 PSI వరకు పెరుగుతుంది. మీ టైర్లలో సాధారణంగా 25 PSI ఒత్తిడి ఉంటే బలమైన ఎండలో అది 30 PSI లేదా అంతకంటే ఎక్కువ చేరే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మీ కారు టైర్ల ఒత్తిడిని తరచూ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నట్లయితే, మధ్యమధ్యలో టైర్ల ప్రెషర్ ను పరిశీలించాలి. ప్రయాణం మొదలు పెట్టే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే మరీ మంచిది.
టైర్ల కేర్ ముఖ్యం..
వేసవిలో మీ కారుపై ఎక్కువ బరువు వేయకండి. అలా చేస్తే టైర్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. టైర్ల అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ ను ఎప్పటికప్పుడు చేయించాలి. ఒకవేళ మీ టైర్లు ఐదు సంవత్సరాల కంటే పాతవైతే వాటిని వాడటం ప్రమాదకరం. అందుకే వాటిని వెంటనే మార్చేయండి.
నైట్రోజన్ గ్యాస్ వాడండి..
వేసవిలో మీ టైర్లలో గాలి నింపేటప్పుడు నైట్రోజన్ గ్యాస్ నింపడానికే ప్రయత్నించండి. నైట్రోజన్ అనేది ఒక చల్లని వాయువు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా టైర్ల వేడిని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాక గాలి త్వరగా బయటకు పోకుండా నివారిస్తుంది. దీనివల్ల టైర్లు పేలే ప్రమాదం తగ్గుతుంది.
స్పీడ్ కి కాస్త బ్రేక్ వేయండి..
వేసవి సెలవుల్లో చాలామంది ట్రిప్ లు, లాంగ్ డ్రైవ్ లు వెళ్లేందుకు ఇష్టపడతారు. అలాంటప్పుడు హైవేలు, ఎక్సెప్రెస్ వేలపై వేగంగా డ్రైవ్ చేస్తే సమయం ఆదా అవుతుందనుకుంటారు. కానీ అతి వేగం టైర్లను త్వరగా వేడెక్కేలా చేస్తుంది. దీనివల్ల అవి పేలే అవకాశాలు పెరుగుతాయి. ఇది పెద్ద ప్రమాదానికి కూడా దారి తీయవచ్చు. అందుకే మీ కారును ఒక మోస్తరు వేగంతో నడపడమే మంచిది.
కాస్త రెస్ట్ ఇవ్వండి..
మీరు లాంగ్ డ్రైవ్ లో వెళ్తున్నప్పుడు ప్రతి 100 -150 కిలోమీటర్లకు ఒకసారి మీ కారును ఆపండి. మీ కారుకు కూడా కాస్త రెస్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల టైర్లు, ఇంజన్ చల్లబడటానికి సమయం దొరుకుతుంది. రెండింటి ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. కాబట్టి వేసవిలో మీ టైర్లపట్ల కాస్త జాగ్రత్త చూపించి, హ్యాపీ జర్నీ చేసేయండి!