
Errabelli Dayakar Rao: ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ అరంగేట్రం చేసి తెలంగాణ ఏర్పాటు అయ్యాక మారిన రాజకీయ పరిస్థితిలతో బీఆరెస్ గూటిలో చేరి ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న మంత్రి పదవిని కూడా చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు అయ్యాక అప్పటి టీఆర్ఎస్ ను ఎదుర్కొని తెలుగుదేశం జెండా ఎగరవేసిన నాయకుడు. సీన్ కట్ చేస్తే రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఓ మహిళ చేతిలో ఘోర పరాజయం చవిచూసి, ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆ నేత ఇప్పుడు మళ్ళీ పాత నియోజకవర్గం వైపు చూస్తున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా సీనియర్ నేత… లెట్స్ వాచ్.
ఈయన పేరు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగా పరిచయం అవసరం లేని లీడర్. తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ అరంగేట్రం చేసి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పాలకుర్తి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి టీఆర్ఎస్ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని నిలబడ్డారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన యశస్వినీ రెడ్డి చేతిలో పరాభవం మూటగట్టుకున్నాడు.
సాధారణంగా ఎర్రబెల్లి దయాకర రావు చాలా దూకుడుగా వ్యవహరించే వ్యక్తి. కానీ ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నుంచీ పాలకుర్తి వైపు కన్నెత్తి కూడా చూడలేదట. తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న అత్తాకోడళ్లైన ఝాన్సీరెడ్డి, యశస్వినీరెడ్డిల ఆరోపణలను కనీసం తిప్పికొట్టే ప్రయత్నం కూడా ఎర్నబెల్లి చేయడం లేదట. Errabelli Dayakar Rao.
ఇక యశస్వినిరెడ్డి అయితే మైక్ దొరికితే చాలు ఎర్రబెల్లిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ ఎర్రబెల్లిని పాలకుర్తిలో గెలవనివ్వనంటూ ఆమె ప్రతిజ్ఞ చేస్తున్నా కూడా ఎర్రబెల్లి మాత్రం మౌనంగానే ఉంటున్నారు. రాబోయే స్తానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అన్ని మండలాల్లో గెలిపిస్తానన్న ఎర్రబెల్లి, ఆ తర్వాత నుంచీ నోరు మెదపడం లేదట. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, మరోవైపు అత్తాకోడళ్ల ఎత్తుగడలతో సైలెంట్ అయ్యారంటూ నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఓవైపు ఎన్నికల సమయంలో యశశ్వినీరెడ్డీ చేసిన హామీలపై బీఆర్ఎస్ స్తానిక నేతలు విమర్శలు చేస్తుంటే, ఎర్రబెల్లి మాత్రం నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవిషయం ఏంటంటే, గతంలో వర్ధన్నపేట సీటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆరూరి రమేష్, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇది కూడా ఎర్రబెల్లికి కల్సొచ్చే అంశంగా మారుతుంది. అందుకే ఆయన ఇప్పుడు వర్ధన్నపేట నియోజవర్గ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కలన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల్లో వర్ధన్నపేట నుండి ఎర్రబెల్లి పోటీ చేస్తారన్న టాక్ పార్టీలో నడుస్తోంది. అంతేకాదు, బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినప్పుడు వర్ధన్నపేట వ్యాప్తంగా ఎర్రబెల్లి ఫ్లెక్సీలు,బ్యానర్లు కట్టడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మౌనం అర్థ అంగీకారం అన్న చందంగా ఎర్రబెల్లి ఏ ఆరోపణ, కార్యకర్తల అనుమానాలపై కనీసం స్పందించక పోవడంతో వర్థన్నపేటకు ఆయన ఫిక్స్ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
Also Read: https://www.mega9tv.com/telangana/who-are-the-leaders-fighting-for-nalgonda-district-dcc-president/