
TTD against private hotels: తిరుమల్లోని ప్రైవేట్ హోటళ్లపై టీటీడీ చర్యలకు నిర్ణయం తీసుకుంది. నాణ్యత, ధరలను పర్యవేక్షించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే దీనిపై టీటీడీ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. అయితే టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది. ఈ నిర్ణయంతో భక్తులకు లాభమా, నష్టమా. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
తిరుమలకు వచ్చే వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనం తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో అల్పాహారం, భోజనం చేస్తూ ఉంటారు. దీంతో పాటు తిరుమల్లోని టీటీడీ టెండర్ హోటళ్లు, ప్రైవేటు హోటళ్ల ద్వారా కూడా భక్తులు అల్పాహారం, భోజనం చేస్తుంటారు. అయితే టీటీడీ టెండర్ హోటళ్లతో పాటు ప్రైవేటు హోటళ్లలో నాణ్యతాలోపం, అధిక ధరలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో హోటళ్ల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో తీసుకున్న స్మాల్ క్యాంటీన్, బిగ్ క్యాంటీన్ల టెండర్లు గడువు ముగిసింది. గతంలో అధిక మొత్తం డబ్బులు వెచ్చించి టెండర్లు దక్కించుకున్న హాటళ్ల యాజమాన్యం, అడ్డగోలు ధరలు నిర్ణయించారు. దీంతో భక్తులపై అధిక భారం పడింది. ఇదే విషయాన్ని టిటిడి పాలక మండలి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు. దీంతో సరసమైన ధరలతో పాటు నాణ్యమైన ఆహారాన్ని భక్తులకు అందించేందుకు పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. TTD against private hotels.
సాధారణ రోజుల్లో 70 నుంచి 80 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. విశేష పర్వదినాలలొ లక్ష మందికి పైగా భక్తులు రోజూ తిరుమలకు వస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు స్వచ్ఛమైన కల్తీ లేని ఆహారాన్ని ఇచ్చేవిధంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. తిరుమలలో ఉన్న పెద్ద క్యాంటిన్లు, జనతా క్యాంటిన్లు లైసెన్స్ ఫీజులను రీవైస్ చేస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. క్రొత్త టెండర్లు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎవరు ఎక్కువ కోడ్ చేస్తే వారికే లైసెన్స్ దక్కేది. దీంతో వారిష్టం వచ్చినట్లుగా ధరలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. టెండర్ ధర దాఖలు చేసే సంస్థకానీ, సదరు వ్యక్తి కానీ టీటీడీ నిర్దేశించిన ధరలతోనే ఆహార పదార్దాల అమ్మకాలు జరగాలి. అంతేకాదు, కనీసం ఐదు సంవత్సరాలు హోటల్లో నిర్వహణలో అనుభవం ఉండాలి. అలాంటి వారికే టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటిని గతంలో టెండర్ల విధానంలో టీటీడీ కేటాయించేది. భారీగా అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చేవారికి లైసెన్సు జారీ చేసేది. అయితే ఆహార పదార్థాల ధరల్లో నిబంధనలు పాటించక పోవడంతో భక్తుల నుంచి నిత్యం ఆరోపణలతో పాటు, ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు పాలకమండలి సభ్యులు, అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పెద్ద క్యాంటీన్లకు కూడా ఇదే తరహాలో లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. రెస్టారెంట్లలో ఆహారపదార్థాల నాణ్యత, ధరల విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టనున్నారు. హోటళ్ల నిర్వహణ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో టీటీడీ ఇప్పటికే పలు దాపాలుగా సమావేశాలు నిర్వహించింది. లైసెన్సుల కేటాయింపులో కొత్త పాలసీని తీసుకువచ్చింది.
అంతేకాదు, తిరుమలలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కాలపరిమితిని ఐదేళ్లకు పెంచింది. కొత్తగా ఐదు చిన్న హోటళ్లు, ఐదు పెద్ద హోటళ్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. టెండరుదారు తప్పనిసరిగా హిందువై ఉండాలని, పది హోటళ్లను నడుపుతూ ఉండాలి. ఈ రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండి తీరాలి. వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్, ఆ హోటల్ నిర్వహించే ప్రాంతంలో స్థానికంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. జూన్ 23న ప్రారంభమైన ఈ టెండరు ప్రక్రియ ఈనెల 19వ తేదీన ముగుస్తుంది.
ఇక జాతీయస్థాయిలో పేరు ఉన్న బ్రాండెడ్ సంస్థలకు హోటళ్ల లైసెన్సులు జారీచేయాలని భావించిన టీటీడీ, హోటళ్ల అద్దెలపై కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా 12 లక్షల 99 వేల రూపాయలుగా ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను 9 లక్షల 75 వేలకు తగ్గించింది. అలాగే కౌస్తుభం హోటల్ అద్దెను 16 లక్షల 20 వేల నుంచి 12 లక్షల 15 వేలకు తగ్గించింది. ఎంఎంటీ క్యాంటీన్ అద్దె 5 లక్షల 5 వేల రూపాయల నుంచి 3 లక్షల 80 వేల రూపాయలకు తగ్గించింది. ఇక పీఏసీ నార్త్ హోటల్ అద్దె 4 లక్షల పది వేల నుంచి మూడు లక్షల పదివేలకు, హెచ్వీసీ రెంట్ 3 లక్షల 33 వేల నుంచి 2 లక్షల 50 వేలకు తగ్గించింది. అలాగే లక్షలకు పీఏసీ వెస్ట్ హోటల్ అద్దె కూడా 4 లక్షల 44 వేల నుంచి 3 లక్షల 35 వేలకు, ఎస్ఎంసీ క్యాంటీన్ అద్దె 3 లక్షల 88 వేల నుంచి 2 లక్షల 95 వేలకు తగ్గించింది. తాజా నిర్ణయాలతో ప్రైవేట్ హోటళ్ల ఆగడాలకు చెక్ పడుతుందని టీటీడీ భావిస్తోంది. అలాగే భక్తులకు నాణ్యమైన, సరసమైన ధరలకు ఆహారం అందించే అవకాశం ఉంటుందని పాలక మండలి ఆశిస్తోంది.