
National Payments Corporation of India: ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎటు వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్ ఇట్టే జరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాదిమందికి రోజువారీ ట్రాన్సాక్షన్స్ ను మరింత వేగవంతం, సులభతరం చేశాయి. కానీ అదే సమయంలో సైబర్ మోసాలూ అంతే స్థాయిలో పెరిగాయి. దీంతో డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల యూజర్స్ కు అవగాహన పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని టిప్స్ ను సూచిస్తోంది. అవేమిటంటే..
ట్రాన్సాక్షన్ చేసేముందు..
ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కనిపించే పేరును, నంబర్ ను తప్పనిసరిగా వెరిఫై చేయాలి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో, ఆ పేరే స్క్రీన్ మీద ఉందో లేదో అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధరించుకోవడం అవసరం. తొందరపడి పొరపాటున తప్పు నంబర్ కి పేమెంట్ జరగకుండా ముందే జాగ్రత్త పడండి.
ట్రస్టెడ్ యాప్స్/ వెబ్‌సైట్స్ లోనే..
ఎప్పుడూ అఫిషియల్, పాపులర్ యూసేజ్ లో ఉన్న లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. మీకు తెలియనివారి నుంచి వచ్చిన లింక్స్, మెసేజ్ ల ద్వారా యాప్ లను అసలు డౌన్లోడ్ చేయవద్దు. అటువంటి లింకులపై క్లిక్ చేయొద్దు.
ఏటీఎం పిన్ లేదా ఓటీపీ చెప్పొద్దూ..
మీ యూపీఐ పిన్, ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) లేదా బ్యాంక్ వివరాలు పూర్తిగా పర్సనల్ అండ్ సీక్రెట్ గా ఉంచాల్సిన కీలకమైన విషయాలు. వాటిని ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని, పోలీసులమని లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారమని మీకు కాల్ చేసి చెప్పినా సరే, మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. తొందర్లో హడావుడిగా పేమెంట్ చేయవద్దు.
పేమెంట్ అలర్ట్ లను పెట్టుకోండి..
వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అర్జంట్ గా చెప్పాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే, కంగారుపడకండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పి, కాల్ అంతటితో కట్ చేయండి. అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి. పేమెంట్ అలర్ట్‌లను ఆన్ చేసుకోవడం వల్ల మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్సెమ్మెస్, యాప్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు పొందుతారు. దీనివల్ల ప్రతి అలర్ట్ ను జాగ్రత్తగా చదివేందుకు వీలుంటుంది. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ ను సంప్రదించండి. National Payments Corporation of India.
ఈ పైన తెలిపిన చిట్కాలను లేదా జాగ్రత్తలను పాటించడం వల్ల సైబర్ నేరాలను కొంత వరకైనా అరికట్టవచ్చు. వీటివల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగం పెరిగే కొద్దీ రోజువారీ డిజిటల్ చెల్లింపులు సేఫ్ అండ్ సేక్యూర్డ్ గా మారుతాయి. అన్ నౌన్ నంబర్లు కనిపించినప్పుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయండి లేదా టెలిక మ్యూనికేషన్స్ విభాగానికి (https://sancharsathi. gov. in/sfc/) ఫిర్యాదు చేయొచ్చు. మీరు కంప్లయింట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీకి ఉపయోగపడేందుకు వచ్చిన మెసేజ్, చాట్ లను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి!