
Changes in Pakistan’s judiciary: ప్రపంచవ్యాప్తంగా చట్టాలు మారుతున్న వేళ, పాకిస్తాన్‌లో తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశంలో, అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. హైజాకర్లకు ఆశ్రయం ఇచ్చేవారికి, మహిళలను బహిరంగంగా అవమానించేవారికి మరణ శిక్షను రద్దు చేస్తూ పాకిస్తాన్ సెనేట్ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త చట్టాలు పాకిస్థాన్ లో సామాన్యులకు న్యాయం అందిస్తాయా, లేక కొత్త సమస్యలకు దారితీస్తాయా? న్యాయం నేరస్థులను శిక్షించడానికా, లేక బాధితుల గౌరవాన్ని కాపాడడానికా? ఇప్పటికే పాకిస్థాన్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులను అనేక విధాలుగా హింసలకు గురి చేస్తున్న అక్కడి పాలకులు .. ఈ కొత్త చట్టాలతో ఏం చేయనున్నారు..?
పాకిస్తాన్ సెనేట్ 2025లో ఆమోదించిన ద క్రిమినల్ లాస్ బిల్ 2025 ఆ దేశంలోని నేర చట్టాల్లో పెద్ద మార్పులకు దారితీసింది. గతంలో, హైజాకర్లకు ఆశ్రయమించేవారికి, మహిళలను బహిరంగంగా అవమానించేవారికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించే నిబంధన ఉండేది. కొత్త సవరణల ప్రకారం, అత్యంత తీవ్రమైన నేరాలు తప్ప, మరణ శిక్షను రద్దు చేసి, జీవిత ఖైదును ప్రధాన శిక్షగా నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల ఒత్తిడి ఈ సవరణలకు కారణమని అంటున్నారు. ఈ మార్పుపై పాకిస్తాన్ పార్లమెంట్‌లో, మానవ హక్కుల సంస్థలు, మహిళా సంఘాల మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. ఈ సవరణలు దేశంలో భద్రత, న్యాయ వ్యవస్థ బలోపేతంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి.
ఈ చట్ట సవరణలు అమల్లోకి వస్తే సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పాకిస్తాన్‌లో మహిళలు, మైనారిటీలు, సామాన్యులు ఇప్పటికే బ్లాస్ఫెమీ కేసులు, లైంగిక నేరాలు, ఉగ్రవాద ఆరోపణల వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సవరణలు నేరస్థులపై శిక్షలను తగ్గిస్తే, బాధితులకు న్యాయం అందుతుందా అనే సందేహం పెరుగుతోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికల ప్రకారం, మహిళలపై అత్యాచారం, పరువు హత్యలు, బహిరంగ శిక్షలు వంటి కేసుల్లో న్యాయం ఆలస్యం కావడం, బాధితులు ఫిర్యాదు చేయడానికి భయపడటం పాకిస్థాన్ లో సర్వసాధారణంగా మారింది. ఈ మార్పులు న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తాయా లేక సమాజంలో అశాంతిని పెంచుతాయా అనే అయోమయం నెలకొంది.
పాకిస్తాన్‌లో బ్లాస్ఫెమీ చట్టాలు, లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలు సామాన్యులు, మైనారిటీలలో భయాందోళనలను పెంచుతున్నాయి. బ్లాస్ఫెమీ ఆరోపణల కింద సాక్ష్యాలు లేకుండానే అరెస్టులు, జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు సర్వసాధారణం. లైంగిక దాడులు, పరువు హత్యలు, మహిళలపై వేధింపుల కేసుల్లో విచారణలు తరచూ ఆలస్యం అవుతున్నాయి. పోలీసులు, మతాధికారుల పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం, బాధితులకు న్యాయం అందకపోవడం, నిందితులు తప్పించుకునే మార్గాలు ఎక్కువగా ఉండటం పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో పెద్ద సమస్యగా మారింది. ఈ కొత్త సవరణలు ఈ సమస్యలను పరిష్కరిస్తాయా అనేది సందేహంగా ఉంది. Changes in Pakistan’s judiciary.
పాకిస్తాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు పోలీసులకు అత్యధిక అధికారాలను ఇస్తున్నాయి, కానీ ఇవి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా అరెస్టులు చేయడం, విచారణ లేని తీర్పులు, నిర్దోషులపై కేసులు నమోదు కావడం వంటివి సర్వసాధారణంగా మారాయి. పాకిస్తాన్‌లోని ప్రత్యేక కోర్టులు, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిర్దోషులను కూడా శిక్షిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ చట్టాల వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం తగ్గుతోంది. కొత్త సవరణలు ఈ సమస్యలను పరిష్కరించకపోతే, సామాన్యులపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
పాకిస్థాన్ లో కొత్త చట్ట సవరణలు మహిళలకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు ఎంతవరకు రక్షణ కల్పిస్తాయనేది పెద్ద ప్రశ్న. పాకిస్తాన్‌లో లైంగిక దాడులు, పరువు హత్యలు, మతపరమైన వివక్షలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్నాయి. కేసుల విచారణలు ఆలస్యం కావడం, సాక్ష్యాల సేకరణలో లోపాలు, నిందితులు తప్పించుకునే అవకాశాలు బాధితులను నిరాశపరుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ లో మహిళలు, చిన్నపిల్లలు, మైనారిటీలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ సవరణలు నేరస్థులపై శిక్షలను తగ్గిస్తే, బాధితులకు న్యాయం దూరమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉగ్రవాద సంస్థల భయం కూడా ఈ సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తోంది.
పాకిస్తాన్‌లో చట్టాలు మారినప్పటికీ, సామాజిక స్పృహలో మార్పు కనిపించడం లేదు. అధికారులు, మత నాయకులు, రాజకీయ నేతల నుంచి వచ్చే సందేశాలు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించడం కంటే, అనిశ్చితిని పెంచుతున్నాయి. న్యాయ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, విచారణలలో జాప్యం వల్ల ప్రజల్లో నిరాశ, భయం పెరుగుతోంది. మహిళలు, బలహీన వర్గాలు తమ సమస్యలను బయటపెట్టడానికి సమర్థవంతమైన వేదికలు లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. చట్ట సవరణలు సామాజిక స్పృహను మార్చకపోతే, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత తగ్గే ప్రమాదం ఉంది.
కొత్త చట్ట సవరణలు అంతర్జాతీయ ఒత్తిడుల కారణంగా వచ్చినప్పటికీ, బాధితులకు నిజమైన భద్రత, న్యాయం అందించడంలో విజయవంతం అవుతాయా అనేది సందేహంగా ఉంది. న్యాయం సామాన్యుల ఇంటి వరకు చేరాలంటే చట్ట సవరణలు మాత్రమే సరిపోవు. పోలీసు విచారణలో సమర్థత, న్యాయ ప్రక్రియలో పారదర్శకత, సామాజిక స్పృహలో మార్పు అవసరం. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి స్థానిక సంస్థలు, అంతర్జాతీయ సంఘాలతో సహకారం అవసరం. చట్టాలు మారినా, అవి సామాన్యుల భద్రతను, గౌరవాన్ని కాపాడేలా అమలు కాకపోతే, న్యాయం అందడం కష్టం.