మరో ప్రపంచం..!

Srikakulam Kurmagram Vedic Village: ఆ గ్రామంలో అడుగు పెడితే చాలు పూర్వీకుల జీవన శైలి కళ్ల ముందు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టెక్నాలజీపై ఆధారపడకుండా అంగుళం అడుగు కూడా వేయని ఈ రోజుల్లో సైతం..పెద్దల మాట చద్దన్నం మూట అన్నట్లుగా ఆ గ్రామంలో తాత ముత్తాతల నాటి ఆచారవ్యవహారాలనే అనుసరిస్తున్నారు. చూడటానికి అదొక కుగ్రామం అయినప్పటికీ వారి జీవన విధానం నేటి తరానికి ఆదర్శం. అక్కడ టీవీలు ఉండవు, సెల్ ఫోన్లు మొగవు..కనీసం కరెంట్ కూడా ఉండదంటే నమ్ముతారా? మానవ మనుగడకు కావాల్సిన కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు కోసం కూడా ఇతరులపై అస్సలు ఆధారపడరు. ఏమి కావాలన్నా వారే స్వయంగా తయారు చేసుకుంటారు. ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరుతున్నారు. నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి నడుమ ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని కూర్మగ్రామంపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం.

ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లాలోని కూర్మగ్రామం. శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని అంతకాపల్లి అడవుల్లో ఉంటుంది. ఈ గ్రామానికి మరో పేరు ఉంది అదే వైదిక వర్ణాశ్రమం. ఈ గ్రామం 200 ఏళ్ల నాటి మన పూర్వీకుల జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. 2018 జులైలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆదేశాల మేరకు భక్తి వికాస్ స్వామి సారథ్యంలో ఈ గ్రామం ఏర్పడింది. ఆధునిక హంగులేవీ ఈ కూర్మ గ్రామంలో కనిపించవు. ప్రకృతే వీరి పరమార్థం…ఇదే వీరి ప్రపంచం.

కూర్మ గ్రామంలో 75 మంది నివాసముంటున్నారు. వారిలో గృహస్తు జీవన కుటుంబాలు.. వారికి కేటాయించిన కుటీరాలలో నివాసం ఉంటారు. ఇక వారి పిల్లలు, బయట ప్రాంతాల నుండి వచ్చిన బాలలు గ్రామంలోని గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇక్కడ నివాసముండేవారంతా బాహ్యప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడుపుతారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో వీరికి సంబంధం ఉండదు. ఇవే జీవితం కాదని ఇక్కడివారంతా నమ్ముతారు . సరళ జీవనం వీరి అలవాటు. అత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నేటి లోకానికి నిరూపిస్తున్నారు. ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఆశ్రమంలో నివశించేవారికి సరిపడా కూరగాయలను సేంద్రీయ విధానాల ద్వారా పండిస్తున్నారు. మన పూర్వీకులు మాదిరిగా దంపుడు బియ్యాన్ని వండుకుని తింటారు. బట్టలను కూడా వారే నేరుగా మగ్గాలపై నేస్తారు. విద్యార్ధులకు వీటి తయారీపై ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. Srikakulam Kurmagram Vedic Village.

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ కూర్మగ్రామాన్ని ఎవరైనా సందర్శిస్తే..ఇక్కడి నుంచి మళ్లీ బయటి ప్రపంచానికి వెళ్లాలనిపించదు. అడవుల మధ్య కాలుష్యానికి దూరంగా నిరాడంబరంగా అనాది కాలంనాటి పద్ధతుల్లో నిర్మించిన ఈ ఇల్లను చూస్తే ఔరా అని అనక మానరు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయ, మెంతులు మిశ్రమంగా చేసి గానుగలో ఆడించిన గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇక్కడున్న ప్రతి ఇంటిని ప్రేమగా కట్టుకున్నారు. డిటర్జెంట్ లకు దూరంగా కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారంటే నమ్ముతారా. కరెంటు ఉండదు…ఫోన్లు వాడరు.

సనాతన ధర్మం, వైదిక సంస్కృతి తమ లక్ష్యమని చెబుతున్నారు కూర్మగ్రామం ప్రజలు. ఇక్కడి పిల్లలు గురుకులాల్లో చదువుకుంటున్నారు. సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, తెలుగులో అనర్గంగా మాట్లాడగలరు. ఉదయం దైవారాధనతో వీరి దినచర్య మొదలవుతుంది. అనంతరం రోజువారీ పనుల్లో నిమగ్నమౌతారు. రాత్రిపూట దీపం వెలుగుల్లోనే జీవనం సాగిస్తారు. విద్యుత్తు ఉంటే దానిచుట్టూ సౌకర్యాలు పెరుగుతాయి. అందుకు డబ్బు అవసరం. యాంత్రిక జీవనంతో మనుషులు యాంత్రికంగా మారతారన్నది వీరి అభిప్రాయం.అందుకే ఆ యాంత్రిక జీవనానికి దూరంగా ప్రకృతి నడుమ ప్రశాతమైన జీవితాన్ని గుడుపుతున్నారు.

ప్రస్తుతం ఈ గ్రామంలో 75 మంది ఉంటున్నారు. వచ్చే ఐదేళ్లలో 50 కుటుంబాలు ఏర్పడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. పూర్వ కాలంలో ఉద్యోగాలు ఉండేవి కావు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబ పోషణ సాగేది. ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కష్టపడటం ద్వారా సాంకేతికత అవసరం లేకుండానే జీవనం కొనసాగించవచ్చన్నది ఇక్కడి వారి అభిప్రాయం. దైవ చింతనతో పాటు ఆచార సాంప్రదాయాలు కొనసాగించటం ద్వారానే మానవ జీవిత అంతిమ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు. స్వార్థంతో, మానవ సంబంధాలు దూరం చేసుకుంటూ..కేవలం డబ్బు సంపాదనకోసమే జీవితనం అని బ్రతుకుతున్న నేటి సమాజానికి అసలైన జీవనం అంటే ఇదే అని నిరూపిస్తోంది ఈ కూర్మగ్రామం.’

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/group-politics-is-reaching-a-fever-pitch-among-ysrcp-leaders-in-ichapuram-constituency-of-srikakulam-district/