
Telangana’s Dasarathi Krishnamacharyulu: తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు, గొడవలు జరిగాయి. కాగా ఈ క్రమంలో ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. దాశరథి సైతం తనవంతుగా ఎన్నో రచనలు (పద్యాలు, కవితలు) చేసి ప్రజలను చైతన్యపరిచారు. వాటితోపాటు సినిమాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలను రాశారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన రాసిన “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే కవితా నినాదం ఉద్యమపోరులకు ఊపిరి పోసింది. నిజాం పాలనలో ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ అనే పుస్తకంలో రాసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
నేపథ్యం..
1925 జులై 22న వరంగల్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించారు దాశరథి. ఇప్పుడు ఆ గ్రామం మహబూబ్ నగర్ లో ఉంది. తండ్రి వెంకటాచార్యులు, తల్లి వెంకటమ్మ. ఈయన పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య.
ఖమ్మం జిల్లాలోని మధిరలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లో నిజాం పరిపాలన సాగేది. కాబట్టి దాశరథి ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు. భోపాల యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు సాహిత్యంలో బీఏ పట్టా పొందారు. ఉర్దూ, ఇంగ్లీషుతో పాటు సంస్కృతం, తెలుగు భాషపై మంచి పట్టు సాధించారు. తెలుగు కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం.
చదువయ్యాక కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక మానేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టర్ గా, రేడియో ప్రమోటర్ గా పలు రకాల ఉద్యోగాలు చేశారు.
- ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగస్టు 15 నుంచి 1983 వరకు పనిచేశారు.
సినీరంగ ప్రవేశం…
ఈయన ఉర్దూ, తెలుగు రెండింటిని కలిపి కవిత్వం రాశారు. కవిగానే కాక గొప్ప పరిశోధకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. 1961లో ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘వాగ్దానం’ సినిమాతో కవిగా పరిచయమయ్యారు. అదే ఏడాది దుక్కిపాటి మధుసూధనరావు నిర్మించిన ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో మొత్తం పాటలు ఆయన రాయడం విశేషం. ఈయనకంటే ముందే ఎంతోమంది సినీకవులుగా ప్రసిద్ధి చెందారు. కానీ దాశరథి మొదటి సినిమాతోనే సినీ గేయరచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత భక్తి, వీణ పాటలతో అందరిని మైమరపించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. Telangana’s Dasarathi Krishnamacharyulu.
దేశభక్తి..
దాశరథి ఆనాటి నిజాం రాజుకు వ్యతిరేకంగా ఎన్నో కవితలు రాశారు. దాంతో ఈయన్ని ఇందూరు జైలులో ఈయనతో పాటు మరో 150 మందిని అరెస్టు చేసి, నిర్బంధించారు. జైల్లో ఉన్నపుడు పళ్లు తోముకోడానికి ఇచ్చిన బొగ్గుతో గోడలపైన నినాదాలు, కవిత్వాలు రాశారు. అది చూసిన సిబ్బంది ఈయన్ని ఎంతో చిత్రహింసలు పెట్టింది. కొన్నాళ్లకు ఈయన్ని జైలు నుంచి విడుదల చేశారు.
1987 నవంబర్ 5న దాశరథి మరణించారు.
గుర్తింపు…
- ఈయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ‘కళాప్రపూర్ణ’ బిరుదును అందుకున్నారు.
- 1967లో ‘కవితా పుష్పకం’కి రాష్ట్ర, 1974లో ‘తిమిరంతో సమరం’కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను గెలుచుకున్నారు.
- కవిసింహం, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్రా కవితా సారథి, యువ కవి చక్రవర్తి అనే బిరుదులను పొందారు.
- ఆగ్రా, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు కూడా ఈయన్ని గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి.
ఈయన రాసిన కవితా సంపుటాలు:
- అగ్నిధార
- మహాంధ్రోదయం
- రుద్రవీణ
- మార్పు నా తీర్పు
- ఆలోచనాలోచనలు
- ధ్వజమెత్తిన ప్రజ
- అమృతాభిషేకం
- పునర్నవం
- గాలిబ్ గీతాలు
- దాశరథి మొట్టమొదటిసారి 1949లో ‘అగ్నిధార’ అనే పుస్తకాన్ని రచించగా, సాహితీ మేకల అనే సంస్థ తరఫున దేవులపల్లి రామానుజరావు, గురజాడ హనుమంతరావు కలిసి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. దీనిలో నిజాం పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం గురించి రాయడం జరిగింది.
- 1972లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా దాశరథి తామ్రపత్రాన్ని స్వీకరించారు.
- 2008 నవంబర్ 30న ఆయన పుట్టిన గ్రామంలో దాశరథి విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు.
- ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరిగా ఈయన ఉన్నారు.
- 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి, అధ్యక్షుడిగా ఉంటూ సాహితీ చైతన్యాన్ని పెంపొందించారు.
- మీర్జా గాలిబ్ రాసిన ఉర్దూ గజళ్ళను దాశరథి తెలుగులోకి గాలిబ్ గీతాలుగా అనువదించారు.
- ఈయన 1960 నుంచి 1978 వరకు దాదాపు 124 సినిమాలకు పాటలను అందించారు.
- తెలంగాణ కోసం ఈయన కలం నుంచి జాలువారిన ఎన్నో రచనలు ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి.
- ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని; తీగలను తెంపి, అగ్నిలో దింపినావు నా తెలంగాణ, కోటి రతనాలవీణ…. అంటూ నిజాం పాలన గురుంచి ఈయన కవిత్వంలో చెప్పారు.
- ’రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ అని గర్జించాడు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్’ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేశారు.
- 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా… ‘ఆంధ్ర రాష్ట్రము వచ్చె మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ పొలిమేర చేరపిలిచె నా తల్లి ఆనందం పంచుకుంది’ అని రాశారు.
ప్రముఖ గీతాలు…
- నన్ను వదిలి నీవు పోలేవులే…
- ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ…
- గోరంక గూటికే చేరావు చిలకా…
- గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది…
- ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో… ఇలా మరెన్నో ఆయన కలం నుంచి జాలువారి అలరించాయి.