
AH-64E Apache helicopter: భారత వైమానిక దళం దశాబ్దాలుగా సేవలందించిన మిగ్ -21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతున్న వేళ, భారత ఆర్మీ అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దింపుతూ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. భారత ఆర్మీకి మొదటి మూడు అపాచీ హెలికాప్టర్లు చేరాయి. మిగిలిన మూడు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ అపాచీ హెలికాప్టర్ల ప్రత్యేకతలు? ఇతర IAFహెలికాప్టర్లకు వీటికి తేడాలు ఏమిటి? వీటి వల్ల భారత యుద్ధ సామర్థ్యం ఎలా పెరగనుంది..?
భారత ఆర్మీ 2020లో అమెరికాలోని బోయింగ్ సంస్థతో ఆరు AH-64E అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2024 మే లేదా జూన్‌లో ఈ హెలికాప్టర్ల డెలివరీ జరగాల్సి ఉండగా, రకరకాల సమస్యలు, టెక్నికల్ క్లియరెన్స్‌లు కారణంగా 16 నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు మొదటి మూడు అపాచీ హెలికాప్టర్లు భారత్‌కు చేరాయి, మిగిలిన మూడు 2025 చివరి నాటికి డెలివరీ అవుతాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ డీల్ భారత ఆర్మీ ఎయిర్-గ్రౌండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది, ముఖ్యంగా లడాక్, పశ్చిమ సరిహద్దుల్లో భత్రతను బలోపేతానికి దోహదపడనుంది.
అపాచీ AH-64E హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమై, నమ్మకమైన యుద్ధ హెలికాప్టర్లుగా పేరుగాంచాయి. ఈ హెలికాప్టర్లు 30 ఎంఎం చైన్ గన్‌తో నిమిషానికి 625 రౌండ్లు కాల్చగలవు, మిసైల్స్‌తో ట్యాంకులను ధ్వంసం చేయగలవు, హైడ్రా రాకెట్లు, ఎయిర్-టు-ఎయిర్ స్టింగర్ మిసైల్స్‌తో శత్రు విమానాలను కూడా ఎదుర్కొంటాయి. లాంగ్‌బో రాడార్ సాయంతో టార్గెట్లను గుర్తించి చేధించగలవు. నైట్ విజన్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు రాత్రిపూట, పొగ, దుమ్ము వంటి కఠిన పరిస్థితుల్లోనూ ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ హెలికాప్టర్లు డిజిటల్ నెట్వర్క్ సామర్థ్యంతో UAVలను నేరుగా నియంత్రించగలవు, గ్రౌండ్ ఫోర్సెస్‌తో రియల్-టైమ్ కమ్యూనికేషన్‌ను అందిస్తాయి. హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లో, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగల సామర్థ్యం, బుల్లెట్‌ప్రూఫ్ కాక్‌పిట్, గంటకు 300 కి.మీ వేగం ప్రయాణించగలవు. AH-64E Apache helicopter.

భారత వైమానిక దళం వద్ద MI-35, లైట్ కాంబాట్ హెలికాప్టర్, ధ్రువ్, రుద్ర వంటి హెలికాప్టర్లు ఉన్నాయి. కానీ అపాచీ AH-64E వీటితో పోలిస్తే అన్ని విధాలుగా చాలా అడ్వాన్సడ్ అని చెప్పాలి. అపాచీలు 16 హెల్ఫైర్ మిసైల్స్, స్టింగర్ మిసైల్స్, 30mm చైన్ గన్‌తో అత్యధిక ఫైర్‌పవర్‌ను అందిస్తాయి. ఇవి Mi-35, రుద్రలోని సాధారణ మిసైల్స్, గన్స్‌తో పోలిస్తే ఎక్కువ ఖచ్చితత్వం, శక్తిని కలిగి ఉంటాయి. అపాచీల లాంగ్‌బో రాడార్ రియల్-టైమ్‌లో 250 టార్గెట్లను గుర్తించగలదు. ఇది LCH, ధ్రువ్లలోని సాధారణ రాడార్ల కంటే అధునాతనం. నైట్ విజన్, FLIR సెన్సర్లు అపాచీలో అత్యంత స్పష్టతను అందిస్తాయి. అయితే LCHలో నైట్ విజన్ ఉన్నప్పటికీ అది అపాచీ స్థాయిలో లేదు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో, ఎత్తైన ప్రాంతాల్లో పనిచేయగల సామర్థ్యం అపాచీలో ఉన్నప్పటికీ, LCH, ధ్రువ్‌లు ఈ విషయంలో సమానంగా పనిచేస్తాయి, కానీ Mi-35 ఈ సామర్థ్యంలో వెనుకబడి ఉంటుంది. అపాచీలు UAVలను నియంత్రించగల డిజిటల్ నెట్వర్క్ సామర్థ్యం, గ్రౌండ్ ఫోర్సెస్‌తో రియల్-టైమ్ కమ్యూనికేషన్‌ను అందిస్తాయి, ఇది ఇతర IAF హెలికాప్టర్లలో పరిమితంగా ఉంది. అయితే, అపాచీల మెయింటెనెన్స్ ఖర్చు అమెరికన్ విడిభాగాల కారణంగా ఎక్కువగా ఉంటుంది, దేశీయంగా తయారైన LCH, ధ్రువ్లలో ఈ ఖర్చు తక్కువ.
అపాచీ హెలికాప్టర్ల ఆగమనం భారత ఆర్మీ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది. లడాక్, పశ్చిమ సరిహద్దుల వంటి సున్నితమైన ప్రాంతాల్లో అపాచీలు గ్రౌండ్ స్ట్రైక్ ఆపరేషన్లలో మంచి సహాయాన్ని అందిస్తాయి. ఈ హెలికాప్టర్ల డిజిటల్ కమ్యూనికేషన్ సామర్థ్యం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డ్రోన్ యూనిట్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లో, కఠిన వాతావరణంలో ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యం అపాచీలను కీలక ఆయుధంగా మారుస్తోంది.
అపాచీ AH-64E హెలికాప్టర్ల ఆగమనం భారత రక్షణ రంగంలో ఆధునీకరణకు నాంది పలుకుతోంది. మిగ్-21ల రిటైర్మెంట్తో పాటు అపాచీల చేరిక IAF, ఆర్మీ రెండింటినీ ఆధునిక యుద్ధ సామర్థ్యాలతో బలోపేతం చేస్తోంది. అపాచీ హెలికాప్టర్లు భారత ఆర్మీకి గేమ్ ఛేంజర్ అని అంటున్నారు నిపుణులు. అపాచీలతో భారత రక్షణ బలం మరింత దృఢమవుతుంది అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.