నితీష్ వల్లే ధన్ ఖడ్ రాజీనామా..?

Jagdeep Dhankar Resign: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు ధన్ ఖడ్ పేర్కొన్నప్పటికీ, ఈ రాజీనామా వెనక బిహార్ రాజకీయాలు, ముఖ్యంగా నితీష్ కుమార్ పాత్ర ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. అసలు ధన్ ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు..? దీనిక వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా..? దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఎందుకు జరుగుతోంది..?

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. హోం మినిస్ట్రీ ఈ రాజీనామాకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ధన్ ఖడ్ తన రాజీనామా లేఖలో ఆరోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జగదీప్ ధన్ ఖడ్ దేశానికి వివిధ హోదాల్లో సేవలందించారు, ఆయన ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాన అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జగదీప్ ధన్ ఖడ్ తన రాజీనామా లేఖలో వైద్య సలహా మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మార్చిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆంజియోప్లాస్టీ చేయించుకున్నారు, జూన్ 25న నైనిటాల్‌లో ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయారు. అయితే, పార్లమెంటు మాన్సూన్ సెషన్ తొలి రోజున రాజీనామా చేయడం, రాజ్యసభలో న్యాయవ్యవస్థపై చర్చ జరగనున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

జగదీప్ ధన్ ఖడ్ రాజకీయ, న్యాయ రంగాల్లో రాణించారు. 1951 మే 18, రాజస్థాన్‌లోని కితానా గ్రామంలో జాట్ రైతు కుటుంబంలో జన్మించారు. చిత్తోర్ సైనిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య, రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో B.Sc., LLB చేశారు. 1989లో జనతా దళ్ తరఫున ఝుంఝును నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 1990లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో బీజేపీలో చేరి, 2019-2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 ఆగస్టు నుంచి ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా సేవలుందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన రాజీనామా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ధన్ ఖడ్ రాజీనామా వెనుక అనారోగ్య సమస్య కారణం అని చెప్పినా, ఇందులో రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. Jagdeep Dhankar Resign.

అటు బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నీతీశ్‌ కుమార్‌ను తదుపరి ఉపరాష్ట్రపతిగా చేయాలన్న ఉద్దేశంతోనే ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. నీతీశ్‌ ఉపరాష్ట్రపతి కావడంలో తప్పేంటని బిహార్‌ మంత్రి నీరజ్‌ కుమార్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. నీతీశ్‌ ఆ పదవిలో ఉంటే రాష్ట్రానికి ఎంతో మంచిదని, అందరూ అదే కోరుకుంటున్నారని మరో బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం అదే రాష్ట్రానికి చెందిన జేడీయూ నేత హరివంశ్‌ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. మరోవైపు నీతీశ్‌కు ఉపరాష్ట్రపతి కావాలని ఉందనే విషయంపై గతంలోనూ ఊహాగానాలు వచ్చాయి. ఇదే విషయంపై అనేక మంది ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని బీజేపీ మాజీ ఎంపీ, దివంగత నేత సుశీల్‌ కుమార్‌ 2022లో పేర్కొన్నారు.

అయితే వర్షాకాల సమావేశాల తొలిరోజు జరిగిన పరిణామాలు కూడా ధన్‌ఖడ్‌ రాజీనామా వెనక కారణాలనే వాదన ఉంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అభిశంసన కోరుతూ 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసు తనకు అందిందని, దాన్ని అంగీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించడం.. అధికార పార్టీకి మింగుడుపడని విషయంగా మారినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి లోక్‌సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలోనే రాజ్యసభ ఛైర్మన్‌ దీన్ని అంగీకరించడం తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించిందనే వాదన ఉంది. సోమవారం సాయంత్రం నిర్వహించిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు హాజరుకాకపోవడం ధన్‌ఖడ్‌కు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ సభను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఇలా సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాలపైనా తాజాగా చర్చ నడుస్తోంది. ఈ అంశాలను కాంగ్రెస్‌ సహా విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.

ధన్ ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. ఈ రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయి అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పోస్ట్ చేశారు. ధన్ ఖడ్ ఆరోగ్యం క్షీణించడం బాధాకరం, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని శశి థరూర్ తెలిపారు. ధన్ ఖండ్ ఆరోగ్య కారణం నమ్మశక్యంగా లేదు, ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. ధన్ ఖడ్ చెప్పిన ఆరోగ్య కారణాలను నమ్మాలి, ప్రతిపక్షం అనవసర విమర్శలు చేయొద్దు అని బీజేపీ నేత అశోక్ చవాన్ మండిపడ్డారు.

ధన్ ఖడ్ రాజీనామా రాజ్యసభ చర్చలు, బిహార్ రాజకీయ సమీకరణలపై గణనీయ ప్రభావం చూపనుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తాత్కాలికంగా రాజ్యసభ బాధ్యతలు నిర్వహిస్తారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆరు నెలల్లో జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు ఈ రాజీనామా దేశ రాజకీయాల్లో కీలక మలుపు అని అంటున్నారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం కల్పించడానికి నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా నియమించే అవకాశం ఉంది అనే చర్చలు జోరందుకున్నాయి. ఈ ఘటన రాజ్యసభ స్వతంత్రత, బిహార్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

Also Read: https://www.mega9tv.com/national/ah-64e-apache-helicopters-strengthen-indian-air-force-agreement-with-boeing-america/