
Koneru Konnappa Sirpur constituency: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సంచలనం అంటే ఠక్కుమని గుర్తుకొచ్చేది సిర్పూర్ నియోజకవర్గం. తెలంగాణలో మొదటి అసెంబ్లీ నియోజకవర్గమైన సిర్పూర్ ఎప్పడూ వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటుంది. ఏప్పుడు ఏది జరిగినా రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాజకీయపరంగా ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచనాలకు దారి తీస్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది.ఇంతకీ కోనప్ప ఏమన్నారు. వర్గపోరుకు రీజన్ ఏంటి. చూద్దాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్ కేర్. జనంలో పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడమే ఆయన స్టైల్ అన్నట్టుగా ఉంటారు ఆయన. 2004లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప, 2014లో బీఎస్పీ తరపున గెలిచారు. ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయానని ఫిక్స్ అయిన కోనప్ప, తన ఓటమికి కారణం అయిన ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కారు దిగేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారాయన. లోక్ సభలో ఎన్నికల్లో పార్టీ ఆదిలాబాద్ ఎంపీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు కోనప్ప. Koneru Konnappa Sirpur constituency.
ఓటమి తర్వాత నుంచీ కాంగ్రెస్‌తో కూడా అంటి ముట్టనట్లు ఉంటున్నారట. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సిర్పూర్ నియోజకవర్గం నాయకుడు దండే విఠల్ హస్తం పార్టీలో చేరారు. అప్పటి నుంచీ సిర్పూర్‌లో తన ప్రాధాన్యత తగ్గిపోయినట్టు ఫీలవుతున్నారట కోనప్ప. ఎమ్మెల్సీకి అధికారిక ప్రోటోకాల్, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా రావి శ్రీనివాస్ కు పార్టీ ప్రొటోకాల్ ఉండగా తాను మాత్రం నామ మాత్రంగా మిగిలిపోయానని కోనప్ప ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడి సాధించిన బ్రిడ్జి నిర్మాణ అనుమతులు, రోడ్ల నిర్మాణాలను పార్టీ నేతలు రద్దు చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఈ క్రమంలోనే ఎన్నికలొస్తే స్వతంత్రంగా బరిలో నిలస్తానంటూ చేసిన తాజా కామెంట్స్ అధికారపార్టీలో కలకలం రేపుతున్నాయి. తాడోపేడో తేల్చుకోవడం కోసం అలా మాట్లాడారా,లేక పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యారా అనే చర్చ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది.
మరోవిషయం ఏంటంటే, తాను తెస్తున్న నిధులను అడ్డుకోవడం, పార్టీలో ప్రాధాన్యత తగ్లడంతో ఒంటరి పోరాటం చేస్తానని కోనప్ప చెబుతున్నారట. ప్రత్యక్షంగా బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై కోనప్ప ఆరోపణలు చేయడమే కాదు, ఎవ్వరొస్తే వారిని నిలదీయండని ప్రజలకు పిలుపిస్తున్నారు. దీంత మాజీ ఎమ్మెల్యే దారెటు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పనుల కోసం అధికారుల దగ్గరికి ఆయన తీసుకెళ్లే ఫైల్స్ పక్కకుపోవడం, మంజూరైన పనులు సైతం రద్దు కావడం వంటి పరిణామాలతోనే కోనప్ప ఈ నిర్ణయానికి వచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు గిట్టని వారికి పార్టీలో ప్రాధాన్యం పెరగడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారన్నది సమాచారం. ఒకవేళ మళ్లీ తిరిగి బీఆర్ఎస్‌లో చేరదామంటే, అక్కడ తన ఓటమికి కారణం అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక, అటు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం లేకపోవడం వల్లే ఇండిపెండెంట్ మాట వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల ఓ సభలో కోనప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. తాను ఏ నిర్ణయమైనా ప్రజల ముందే తీసుకుంటానని స్పష్టం చేసిన ఆయన, దేవుడిలా కేసీఆర్ మంజూరు చేసిన వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, తన వెంట ఉన్నే తనను ముంచేశారని ఆరోపించారు. గుడిపేట, వీర్ధండి బ్రిడ్జి నిర్మాణానికి ప్రజలు ఉద్యమం చేయాలన్నారు. పదవిలో ఉన్న నాయకులు మీ ఊరికి వస్తే నిలదీయండంటూ పిలుపునిచ్చారు. ఓవైపు కేసీఆర్ మీద ప్రేమ కురిపిస్తూ, మరోవైపు రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కోనప్ప, స్వతంత్ర అభ్యర్థి అనే పదం వాడటం మిస్టరీగా మారింది.