
Former Minister Vidadala Rajini: ఆ మాజీ మంత్రి రూటే సపరేటు. అధికారంలో ఉన్నా, లేకున్నా తన మాటే చెల్లుబాటు కావాలి అనుకునే నైజం. పార్టీకి తానే సర్వస్వమని భావించే మనస్తత్వం ఆమె సొంతం. వివాదాల్లో ఉంటే నే గుర్తింపు అని నమ్మే స్వభావం. అలాంటి మాజీ మంత్రికి ఊహించదని ఎదురు దెబ్బ తగిలింది. ఖాయం అనుకున్న హోదా చేజారడంతో తట్టుకోలేకపోయారు. అలక బూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు ఏం చేస్తారన్నదే జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది.
విడదల రజనీ. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు. అనతి కాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అంతే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. కలిసి నడిచిన నేతపైనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తాను రాజకీయంగా కలిసి ప్రయాణం చేసిన ప్రత్తిపాటి పుల్లారావుపై రజనీ గెలుపొందారు. వైసీపీ అధినాయకత్వం దగ్గర పలుకుబడి సంపాదించి మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో రజనీకి గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు. గెలిచి వస్తానంటూ ప్రతిన బూనిన రజనీ, ఆ ఎన్నికలలో తొలిసారి బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్ధి మాధవి చేతిలో ఓడిపోయారు. Former Minister Vidadala Rajini.
ఆ తర్వాత మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు రజనీకి కేటాయించారు వైసీపీ అధినేత జగన్. అయితే తాను అధికారంలో ఉన్న సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు ప్రతిపక్షంలో కేసుల రూపంలో రజనీని వెంటాడు తున్నాయి. రాజకీయ వివాదాలు, సవాళ్లతో రజనీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారు. ఇక వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న పిన్నెల్లి పలు కేసుల్లో ఉన్నారు. అయితే పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లికి ఏం చేయలేని పరిస్తితి ఏర్పడింది. దీంతో ఒక దశలో జిల్లా పార్టీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని అందరూ భావించారు. అదే సమయంలో పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి రజనీకి వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. ఆమె కూడా చివరి దాకా ప్రయత్నించారు. అయితే వైసీపీ అధిష్ఠానం కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటించింది. ఆ పదవిని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. దీంతో కంగుతిన్న రజనీ, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయినా తనకు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. పార్టీ నిర్ణయం ఆమెకు గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది.
వైసీపీ పార్టీలో నిన్న మొన్నటి వరకు అంతా తాను క్రియాశీలకంగా వ్యవహరించిన తనకు పదవి ఇవ్వకపోటంపై రజనీ అలకబూనారట. పార్టీ కోసం చేసిన పోరాటాలకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గోపిరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటించిన సమయం నుంచి విడదల రజనీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదట. ఆమె అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ ముఖ్య నేతలకు రజనీ గురించి సమాచారం తెలియడం లేదట. దీంతో ఆమె ఉద్దేశపూరకంగానే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాను నమ్మిన జగన్మోహన్ రెడ్డి, తనకు జగన్ ఇచ్చారన్న అభిప్రాయంతో రజనీ ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్తితులతో రజనీ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.