
Aadudam Andhra Corruption: వైసీపీ నేతల అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. సో ఇలాంటి టైమ్ లో మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు సమాచారం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ విచారణ పూర్తవడంతో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇంతకీ ఆడుదాం ఆంధ్రలో ఏం జరిగింది. విజిలెన్స్ అధికారుల వద్ద ఎలాంటి ఫ్రూఫ్స్ ఉన్నాయి. ఈ కేసులో రోజాకు తిప్పలు తప్పవా…రోజా అరెస్ట్ తప్పదా… అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది.
2023 డిసెంబర్ లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. అయితే 125 కోట్లలో చేపట్టిన ఈ ప్రోగ్రామ్ ని 47 రోజుల పాటు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు అయితే వినిపించాయి. ఇక దీనిపై విచారణ జరిపిన విజలెన్స్ కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. సో ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు రోజా వంతు వచ్చింది. ఆమె చుట్టు ఉచ్చు బిగుసుకునేలా చేస్తుందనే టాక్ అయితే వినిపిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి… విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ షర్టులు పంపిణీ చేసింది. విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం 2.7 కోట్లు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్లు, పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు అయితే చెప్తున్నాయి. ఎన్నికల ముందు యువ ఓటర్లను అట్రాక్ చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టిందనే ఆరోపణలు గతంలో వినిపించాయి.
ఇక ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. క్రీడా పరికరాల కొనుగోలులో కమీషన్లు, నకిలీ విజేలకు నగదు బహుమతులు, నాసిరకం కిట్ల పంపిణీ, వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి జరిగినట్లు కంప్లైంట్లు వచ్చాయి. 2024 ఎన్నికల ముందు దీనిపై జరిగిన రచ్చ అంత ఇంతా కాదండోయ్. మాజీ క్రీడల మంత్రి రోజా, ప్రతిపక్షం పై నోరు పారేసుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇక అధికారంలోకి రాగానే ఈ విషయమై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
విజయవాడలోని శాఫ్ ఆఫీస్ తో పాటు జిల్లా క్రీడా సంస్థలలో సర్చ్ చేసిన విజిలెన్స్ అధికారులకు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోటీల నిర్వహణ, ప్రైజ్ మని, క్రీడా పరికరాల కొనుగోలు కేటాయింపు లాంటి అన్ని అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈ విచారణలో 40 కోట్ల వరకు నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు.
ఇక రెండు రోజుల్లో డీజీపీకి ఈ నివేదికను సమర్పించేందుకు రెడీ అవుతున్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఆరోపణల వెల్లువెత్తాయి. క్రీడల్లో వైసీపీ నేతల చెప్పిన వాళ్లనే విన్నర్స్ గా ప్రకటించారనే టాక్ కూడా ఉంది. ముగింపు ఉత్సవాలు, పరికరాల కొనుగోలు పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తండడంతో ఇప్పుడు విజిలెన్స్ నివేదిక కీలకంగా మారింది అని చెప్పుకోవచ్చు.
అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయ్. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైనా.. అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత.. మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పాటు మరికొందరు అధికారులపై కేసులు నమోదు కావచ్చని.. అరెస్టులు జరిగే ఛాన్స్ ఉందని సమాచారం జోరందుకుంది.
ఇటీవల కాలంలో రోజా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు.సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపధ్యంలో ఆడుదాం ఆంధ్ర అవకతవకల విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి చేరుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే గ్రామీణ స్థాయిలో సైతం క్రీడలను ప్రోత్సహించడానికి చేపట్టిన మంచి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అంటూ అందులో లాంటి అవకతవకలు జరగలేదని రోజాతో సహా వైసీపీ నేతలు వాదిస్తున్నారు. మరీ ఏం జరుగుతోందో వేచి చూద్దాం.