
Jagadish Reddy Nalgonda District: జిల్లాలో అంతా తానే.. పవర్ గివర్ జాంతానహీ.. నా మాటే శాసనం. ఎక్కువ చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ అంటూ ఓ మాజీ మంత్రి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారట. అంతేకాకుండా ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు అనుచరులను ఎగదోస్తూ సెపరేట్ పాలిటిక్స్ నెరుపుతున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో ఆ మాజీ మంత్రి తీరు నచ్చక కొందరు సీనియర్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుక్కునే పనిలో పడ్డారట. ఇంతలా సొంత నేతలనే టార్గెట్ చేసిన ఆ నేత ఎవరు.
అధికారంలో లేకున్నా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అడ్డుకట్ట పడడం లేదు. కాంగ్రెస్ కంచుకోటగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో, పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో సూర్యాపేట నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఈ ఒంటరి విజయాన్ని అస్త్రంగా మార్చుకున్న ఆయన, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేలకే చెక్ పెడుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మాట వినని మాజీ ఎమ్మెల్యేల విషయంలో తనకు దగ్గరగా మెలిగే స్థానిక నేతలను రంగంలోకి దింపి ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా అదే వైఖరిని కొనసాగిస్తున్న జగదీష్ రెడ్డిపై కొంతమంది మాజీలు రగిలిపోతున్నారట. అవకాశం వస్తే మహబూబ్ నగర్ తరహాలో పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం నుంచి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న జగదీష్ రెడ్డి, తెలంగాణ వచ్చాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన ప్రాబల్యం పెంచుకున్నారు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన సహచర నాయకులను ఒక్కొక్కరిగా పక్కన పెడుతూ వచ్చారనే టాక్ ఉంది. తన మాట వినని వారిని పెద్దాయన పేరు చెప్పి నయానో భయానో తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేశారట. కొందరి విషయంలో పొమ్మన లేక పొగబెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉండగా, ప్రసన్న రాజ్ అనే స్థానిక నేతను ప్రోత్సహిస్తున్నారట. అలాగే నాగార్జున సాగర్ లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కు ప్రత్యామ్నాయంగా తన అనుచరుడు ఎమ్మెల్సీ కోటిరెడ్డిని రంగంలోకి దింపారట. ఇక భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి పోటీగా చింతల వెంకటేశ్వర్ రెడ్డిని, ఆలేరులో గొంగిడి సునీతకు బదులుగా బూడిద భిక్షమయ్య గౌడ్ కు మద్దతు ఇస్తున్నారని టాక్. అలాగే కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు ప్రత్యామ్నాయంగా శశిధర్ రెడ్డికి సహాయ సహకారం అందిస్తున్నారట జగదీష్ రెడ్డి. Jagadish Reddy Nalgonda District.
జగదీష్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన మాజీలు, సీనియర్ నాయకులు ఎన్నోసార్లు పార్టీ ముఖ్య నేతల దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నా ఫలితం లేకుండా పోయిందన్న ప్రచారం జరుగుతోంది. జగదీష్ రెడ్డితో సర్దుకుపోవాలని పార్టీ పెద్దలు సూచించడంతో ఇక చేసేదేమీ లేక తమ దారి తాము చూసుకోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారట. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ అంతర్గత రగడలోకి నేరుగా ప్రవేశించారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాశనం కావడానికి కారణం ఆ లిల్లీపుట్ నాయకుడే అంటూ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు, గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచిన ఆయన, ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదని పరోక్షంగా జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.
మొత్తానికి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. జగదీష్ రెడ్డి ఒంటెద్దు పోకడలు తగ్గించుకొని, పార్టీలోని నాయకులను కలుపుకొని పోకపోతే వచ్చే ఎన్నికల్లో ఉన్న ఆ ఒక్క సీటు కూడా కోల్పోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అధికారంలో లేని పార్టీకి అంతర్గత కలహాలు ఎంత మాత్రం మంచివి కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి జగదీష్ రెడ్డి ఈ అల్టిమేటం తర్వాత తన వైఖరిని మార్చుకుంటారా? లేక జిల్లాలో పార్టీ పతనానికి కారణం అవుతారా? కాలమే నిర్ణయించాలి.
Also Read: https://www.mega9tv.com/telangana/congress-releases-schedule-for-second-phase-of-janahita-padayatra/