
UK’s water problem: మీ ఈ మెయిల్ ఇన్ బాక్స్ లో పాత ఫోటోలను, మెసేజులను డిలీట్ చేయండి.. నీటి సమస్యను పరిష్కరించండి.. ఇదీ యూకే ప్రజలకే ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సూచన. అదేంటి నీటి సమస్యకు.. ఈ-మెయిల్ లోని ఫోటోలకు సంబంధం ఏంటి..? అసలు యూకేలో నీటి సమస్య ఎందుకు వచ్చింది..? ఈ సమస్యను పరిష్కరించడానికి యూకే ఏం చేస్తోంది..?
యూకేలో ఇప్పుడు ఎండకాలం నడుస్తోంది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ సారి నీటి సమస్య విపరీతంగా పెరిగింది. భారత్ లోనే కాదు బ్రిటిషర్ల దేశంలోను కరువు పరిస్థితులు ఉంటాయని తేలింది. ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్, లాంకషైర్, గ్రేటర్ మాంచెస్టర్, ఈస్ట్ మిడ్‌లాండ్స్, వెస్ట్ మిడ్‌లాండ్స్ వంటి ప్రాంతాల్లో అధికారికంగా నీటి కరువు ప్రకటించారు అంటే పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజర్వాయర్లు, నదులు, భూగర్భ జలాలు సాధారణ స్థాయి కంటే పడిపోయాయి. 1976 తర్వాత ఇంత తక్కువ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది నాలుగో హీట్‌వేవ్ కొనసాగుతోంది, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా ఉండటం, వర్షాలు దాదాపు లేకపోవడం వల్ల నీటి సరఫరా మీద ఒత్తిడి భారీగా పెరిగింది. ఈ సమస్య యూకే ఆర్థిక వ్యవస్థ, రోజువారీ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు యూకో అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఈ -మెయిల్స్ లోని పాత ఫోటోలు, మెయిల్స్ ను డిలీట్ చేయాలని సూచించారు. అయితే ఈమెయిల్స్ కు నీటి సమస్యకు లింక్ ఏంటి అనే డౌట్ రావొచ్చు.
ఈమెయిల్స్ డిలీట్ చేయడం వల్ల నీటి ఆదా ఎలా?
సాధారణంగా నీటి కొరత సమయంలో ఇంట్లో నీటిని పొదుపుగా వాడమని, షవర్ తక్కువ సేపు ఉపయోగించమని, లీకేజీలను సరిచేయమని చెబుతారు. కానీ యూకే ప్రభుత్వం ఇప్పుడు ఈ మెయిల్స్ లో పాత ఫోటోలను డిలీట్ చేయమని చెబుతోంది. మీ ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లోని పాత మెయిల్స్, క్లౌడ్‌లో స్టోర్ చేసిన ఫోటోలు, ఫైళ్లను డిలీట్ చేయండి, ఇది నీటిని ఆదా చేయడానికి సాయపడుతుంది అని చెబుతోంది. అయితే ఈ సలహా వెనుక పెద్ద కారణమే ఉంది. ఈమెయిల్స్, ఫోటోలు, డేటా అంతా డేటా సెంటర్లలో స్టోర్ అవుతుంది. ఈ డేటా సెంటర్లు సర్వర్లను నడపడానికి, వాటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీటిని వాడతాయి. యూకేలో నీటి వనరులు పరిమితంగా ఉన్నాయి కాబట్టి, డేటా సెంటర్ల వాడకం కూడా నీటి సమస్యను తీవ్రతరం చేస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.
డేటా సెంటర్లలో నీటి వినియోగం ఎంత?
డేటా సెంటర్లు సర్వర్లను నడపడానికి విద్యుత్‌తో పాటు, వాటిని చల్లబరచడానికి నీటిని భారీగా వాడతాయి. CPUలు, GPUలు వంటి హార్డ్‌వేర్ భాగాలు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని చల్లబరచడానికి ఎవాపరేటివ్ కూలింగ్ లేదా అడియాబాటిక్ కూలింగ్ వంటి సిస్టమ్స్ ఉపయోగిస్తారు, ఇవి నీటి ఆధారంగా పనిచేస్తాయి. ఒక పెద్ద డేటా సెంటర్ రోజుకు లక్షల లీటర్ల నీటిని వాడొచ్చు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల డేటా సెంటర్లు సంవత్సరానికి కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తాయని అంచనా. అయితే డేటా సెంటర్లలో నీటి వినియోగాన్ని తగ్గించడానికి మెయిల్స్ లోని ఫోటోలు డిలీట్ చేస్తే సరిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఏఐ ఆధారిత ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఎక్కువ నీటిని వినియోగిస్తారు. మెయిల్స్ డేటా చాలా తక్కువగా ఉంటుంది. వాటిని డిలీట్ చేయడం వల్ల అంతగా ఉపయోగం ఉండదని భావిస్తున్నారు.
కేవలం మెయిల్స్ విషయంలోనే కాదు యూకే ప్రభుత్వం అనేక రకాలుగా నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అయితే సమస్యను పరిష్కరించడానికి ముందు ఆ సమస్య మూలాలు తెలుసుకోవడానికి యూకేలో నీటి కొరతకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి క్లైమేట్ చేంజ్.. గత కొన్నేళ్లుగా యూకేలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వర్షపాతం బాగా తగ్గింది. వర్షం పడినా, అది ఒకేసారి భారీగా పడి, నీరు రిజర్వాయర్లలో నిల్వ కాకుండా డ్రైన్ అవుతోంది. అలాగే జనాభా, పట్టణీకరణ పెరగడం. యూకేలో జనాభా పెరుగుదల, పట్టణీకరణ వల్ల నీటి డిమాండ్ బాగా పెరిగింది. ఇళ్లు, పరిశ్రమలు, వ్యవసాయం కోసం నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది, కానీ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అటు పాత పైప్‌లైన్ లీకేజీలు కూడా నీటి సమస్యకు ఒక కారణం. యూకేలో నీటి సరఫరా వ్యవస్థ చాలా పాతది. పైప్‌లైన్‌లలో లీకేజీల వల్ల రోజూ బిలియన్ లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ లీకేజీలను సరిచేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం . ఈ కారణాల వల్ల యూకేలో నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. క్లైమేట్ చేంజ్, మానవ కార్యకలాపాలు కలిసి ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. UK’s water problem.
నీటి కొరతను ఎదుర్కొనేందుకు యూకే ప్రభుత్వం ప్రజలకు పలు సలహా ఇస్తోంది. షవర్ సమయం తగ్గించండం అంటే.. 4 నిమిషాల కంటే తక్కువ సమయం షవర్ చేయాలని.. ఇది రోజుకు లీటర్ల కొద్దీ నీటిని ఆదా చేస్తుందని చెబుతున్నారు. అలాగే వాన నీటిని సేకరించండం ద్వారా కూడా నీటి సమస్యను పరిస్కరించవచ్చు. మంచి నీటిని వృథా చేయకుండా, వర్షపు నీటిని బకెట్లలో సేకరించి మొక్కలకు, ఇతర అవసరాలకు వాడండని సూచిస్తోంది. ఇంట్లో ట్యాప్‌లు, పైప్‌లలో లీకేజీలు ఉంటే వెంటనే రిపేర్ చేయాలని.. సాయంత్రం లేదా ఉదయం వేళల్లో మొక్కలకు నీరు పోస్తే ఆవిరి తక్కువ అవుతుందని.. కొత్త లాన్‌లు, గార్డెన్స్ పెంచడం తగ్గించి, నీటి అవసరం తక్కువ ఉన్న మొక్కలను ఎంచుకోవాలని చెబుతున్నారు. ఈ చర్యలు ప్రజలు, సంస్థలు, పరిశ్రమలు అన్నీ కలిసి అమలు చేస్తే నీటి ఒత్తిడిని తగ్గించొచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.