
Telangana Top in Alcohol Use: వద్దు రా సోదరా మందుతో నూరేళ్లు నిండేను రా….ఏది వద్దు అంటే అదే చేస్తున్నారు ప్రజలు. మద్యం తాగొద్దు అని చెబుతుంటే.. అదే తాగుతున్నారు. మరింత ఎక్కువగా తాగుతున్నారు. రాను రాను రాష్ట్రంలో మద్యం వాడకం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రజల సగటు ఆదాయం ఏ స్థాయిలో పెరుగుతున్నదో.. అదే స్థాయిలో మత్తు పదార్థాలపై ఖర్చు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. మత్తు పదార్థాల వినియోగం తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్నది. ఇది ఎవరి తప్పు? ఎందుకీ పరిస్థితి?
ముఖ్యంగా పల్లెల్లో లిక్కర్, సిగరేట్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (విదేశీ మద్యం), బీరు తాగడంలో రూరల్ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. సిగరెట్లు తాగే విషయంలో ఐదో స్థానంలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అనే సంస్థ చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దేశీయ మద్యం, కల్లు కూడా ఎక్కువగా తాగుతున్నారు. పొగాకు వాడకంలో కూడా తెలంగాణ ముందువరుసలో ఉంది.
NIPFP నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం బీరు వినియోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీరు తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ అధ్యయనంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున బీరు, విదేశీ మద్యం కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నారని తేలింది. ఇది దేశ సగటు రూ.486తో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ. ఈ పెరుగుదల రాష్ట్రంలో పెరుగుతున్న మత్తు పదార్థాల అలవాట్లకు స్పష్టమైన సంకేతం. 2014-15లో రాష్ట్రంలో మద్యం ఖర్చు రూ.745గా ఉండగా.. 2022-23 నాటికి అది రూ.1,623కి పెరగడం ఈ ధోరణిని స్పష్టం చేస్తోంది.
మద్యం వినియోగంతో పాటు, ధూమపానం విషయంలోనూ తెలంగాణ తగ్గేదే లే అన్నట్లుగా ఉంది,. ఈ నివేదిక ప్రకారం.. ధూమపానంలో తెలంగాణ దేశంలో ఐదవ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో ధనవంతులు అధికంగా బీరు, సిగరెట్లను వినియోగిస్తుండగా గ్రామాల్లో తక్కువ, మధ్యతరగతి ప్రజలు పొగాకు, బీడీలు, సిగరెట్లను ఎక్కువగా వాడుతున్నారని నివేదిక పేర్కొంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్థిక వ్యత్యాసాలను, మత్తు పదార్థాల వినియోగంపై వాటి ప్రభావాన్ని తెలియజేస్తోంది.
బీడీలు తాగేవారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ, సిగరెట్లు, నమిలే పొగాకు, గుట్కా వాడకం పెరుగుతున్నది. పట్టణాల్లో ఉన్న ధనవంతులు సిగరెట్లు, బీరు ఎక్కువగా తాగుతుండగా, పల్లెటూర్లలో తక్కువ, మధ్య ఆదాయం ఉన్నవారు నమిలే పొగాకు, సిగరెట్లను ఎక్కువగా వాడుతున్నారు. ఇక తెలంగాణలో మద్యం, పొగాకు కోసం చేసే ఖర్చు దేశంలోని చాలా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. ఇది ప్రజల ఆరోగ్యానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మత్తు పదార్థాలపై పన్నులు పెంచడం ద్వారా వాటిని తగ్గించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నాడు. ఇది దేశంలోనే అత్యధికం. జాతీయ సగటు రూ. 486 మాత్రమే. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఖర్చు రూ. 2,926గా ఉంది. ఇది దేశంలో మూడో స్థానం. అంటే పల్లెల్లో, పట్టణాల్లో మందు అలవాటు పెరుగుతున్నదని తెలుస్తున్నది. స్థానిక మద్యం, కల్లు కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరు రూ.518 ఖర్చు చేస్తుండగా, పట్టణాల్లో రూ.87 మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అంటే పల్లెల్లో స్థానిక మద్యం ఎక్కువగా వాడగా, పట్టణాల్లో మంచి బ్రాండ్లను కోరుకుంటున్నారు. పొగాకు విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం రూ.415 ఖర్చు చేస్తున్నారు. పట్టణాల్లో సిగరెట్ల కోసం రూ.624 ఖర్చు చేస్తున్నారు. అయితే బీడీలు, గుట్కా వాడకం మాత్రం దేశంలోని చాలా రాష్ట్రాల కంటే తక్కువగానే ఉంది.
తెలంగాణలో వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో రూ.57,627 (13వ ర్యాంకు), జాతీయ సగటు రూ. 45,277 కంటే ఎక్కువ. పట్టణంలో రూ.97,901 (5వ ర్యాంకు), జాతీయ సగటు రూ.77,504 కంటే ఎక్కువ. సిక్కిం (గ్రామీణ రూ.92,771, పట్టణ రూ.1,45,261), గోవా (గ్రామీణ రూ.88,399)లు అగ్రస్థానంలో ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి, అధిక ఆదాయాలను సూచిస్తుంది, కానీ మత్తు పదార్థాలపై ఖర్చు పెరగడం పేదరికం, ఆరోగ్య సమస్యలను పెంచుతుందని నివేదిక హెచ్చరిస్తుంది.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సిగరెట్లపై ఖర్చు రూ.415 , జాతీయ సగటు రూ. 113 కంటే మూడు రెట్లు ఎక్కువ. మిజోరం , సిక్కిం తర్వాత తెలంగాణే ఉంది. పట్టణ ప్రాంతాల్లో సిగరెట్ల ఖర్చు రూ.624 , జాతీయ సగటు రూ.272 కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇది బీడీల నుంచి సిగరెట్లకు మారుతున్న ధోరణిని సూచిస్తుంది. గుట్కా, నమిలే పొగాకుపై గ్రామీణ ఖర్చు రూ.124 , జాతీయ సగటు రూ.327 కంటే తక్కువ. పట్టణంలో రూ.114 , జాతీయ సగటు రూ.241 కంటే తక్కువ. మధ్యప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్ లతో పోలిస్తే తెలంగాణలో నమిలే పొగాకు వినియోగం తక్కువ. Telangana Top in Alcohol Use.
NIPFP నివేదిక వెల్లడించిన ఈ గణాంకాలు తెలంగాణ ప్రభుత్వం, పౌర సమాజం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. మద్యం, పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, ఆరోగ్య ప్రచారాలను ముమ్మరం చేయడం, మద్యం విక్రయాలపై నియంత్రణ విధించడం వంటి చర్యలు చేపట్టాలి. పాఠశాలలు, కళాశాలల్లో యువతకు మత్తు పదార్థాల దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించాలి.
Also Read: https://www.mega9tv.com/telangana/komatireddy-raj-gopal-reddy-about-ministerial-post/