
Sadhguru దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సద్గురు మాట్లాడుతూ తనదైన సందేశాన్ని అందించారు.
భారతదేశం 79 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ, సార్వభౌమత్వం, స్వేచ్ఛలకి ఉన్న అర్ధం మరింత స్పష్టమవుతోంది. మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మరింత తీవ్రమవుతున్న రాజకీయ ఒంటరితనం, మతం, కులం, ప్రాంతీయ గుర్తింపు లాంటి దేశీయ సమస్యలు, యువతలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు ఇలా ఇప్పుడు మనం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాం.
అయితే, వెన్నెముక ఉన్న ఏ దేశానికైనా, సాహసాలు చేసే గుణం ఉన్న ఏ నాయకత్వానికైనా సవాళ్ళు ఎప్పుడూ ఎదురుదెబ్బలు కావు, అవి ఎదుగుదలకి సోపానాలు. ఈ దేశంలో ఉన్న ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, ఆశావాదం నిజంగా అసాధారణం. ఇక కేవలం సరళీకరణ కాదు. విముక్తి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనకు కావలసింది. సాహసోపేతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన స్వేచ్ఛా వ్యాపార సంస్కృతి. విద్య, పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు వంటి వాటిని ప్రభుత్వ నియంత్రణల నుండి పూర్తిగా విముక్తం చేసి, వ్యక్తిగత ప్రతిభ. సృజనాత్మకతకు పూర్తిగా అవకాశం ఇవ్వాలి. తద్వారా భారతీయులు తమ కలలను సాకారం చేసుకోగలుగుతారు.
ప్రజలు గొప్పగా ఆలోచించినప్పుడు, తమ జీవితాలను, దేశాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు, కొంత అలజడి ఉంటుంది. కొన్ని చిన్నపాటి నిబంధనలు ఉల్లంఘించబడవచ్చు. పాతపడిన కొన్ని చట్టాలు మార్చాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలాగే, నిస్తేజంగా ఉన్న కొన్ని ప్రభుత్వ వ్యవస్థలను, పన్నుల విధానాలను కూడా సంస్కరించాల్సి ఉంటుంది. ఈ గందరగోళం మార్పులో ఒక అంతర్గత భాగం. మనం కొన్ని ప్రాథమిక నియమాలను రూపొందించుకుని, వాటిని పాటించే బాధ్యతను ప్రజలకు అప్పగించాలి. నిస్తేజమైన ప్రభుత్వ విధానాల కారణంగా నూతన ఆలోచనలను మనం అణచివేయకూడదు. ఒక శక్తివంతమైన, స్వేచ్ఛాయుతమైన దేశాన్ని నిర్మించుకోవడానికి ఇది సరైన మార్గం.

విద్య మనిషిలో పరివర్తన తీసుకురానప్పుడు, దానివల్ల ఉపయోగం లేదు. మన యువతలో ఉన్న శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే, వారు స్వాతంత్ర్యంగా ఆలోచించే శక్తిని కోల్పోకముందే చిన్న వయసు నుండే నూతన ఆలోచనలను ప్రోత్సహించాలి. బలమైన ప్రభుత్వ జోక్యం లేకుండా, మానసిక చురుకుదనం, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇచ్చే పునరుత్తేజిత విద్యా విధానం ఇప్పుడు ఎంతో అవసరం. అంతర్జాతీయంగా చూస్తే, అహంకారపూరితమైన దేశాల ఒత్తిడిని ఎదుర్కోవడానికి మనం భౌగోళికంగా మనకు దగ్గరగా ఉన్న దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినప్పుడే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. మనకు మరిన్ని గోడలు కాదు, మరిన్ని కిటికీలు అవసరం.
అన్నింటికంటే ముఖ్యంగా, ఈ దేశ సంస్కృతి చైతన్యం అనే రంగంలో అసాధారణమైన అన్వేషణకు ఒక మూల కేంద్రం. మనం ప్రజలకు స్వర్గానికి టిక్కెట్లు అమ్మి జీవితాలను గడపడం లేదు, మానవ ఉనికి యొక్క లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మన లక్ష్యం మతపరమైన, దురభిమానం ఉన్న పిల్లలను పెంచడం కాదు, స్వేచ్ఛగా, చైతన్యంతో కూడిన పౌరులను తయారు చేయడమే.ఒక బిడ్డను పెంచడానికి రక్షణ వ్యవస్థలు, నిబంధనలు అవసరం. కానీ ఇప్పుడు ఈ దేశం శైశవ దశలో లేదు.
ఇది రిస్కులు తీసుకోవడానికి, కొత్త ఆలోచనలను, సంస్థలను, వ్యవస్థలను నిర్మించడానికి సిద్ధంగా ఉన్న ఉత్సాహభరితమైన యువకుడి లాంటిది. గతంలో కొంత రక్షణవాదం ఉపయోగపడినప్పటికీ, ఇప్పటివరకూ మనం ఆచరణలో లేని బలహీనమైన సోషలిజానికి లోనయ్యాం. ఇక రక్షించే తల్లిదండ్రులు పగ్గాలను వదిలిపెట్టాల్సిన సమయం ఇది. సవాలు అనేది అడ్డంకి కాదు, అది ఒక ప్రేరణ. ఈ దేశం యొక్క ఆత్మ వికసించాలంటే, భారతీయులకు తమ దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే పూర్తి అధికారాన్ని ఇవ్వాలి.ఇక కేవలం సరళీకరణ కాదు విముక్తి కల్పించాల్సిన సమయం వచ్చింది. మనం దీన్ని సాకారం చేద్దాం.