
Kannada Hero Darshan: సినిమా హీరో అయితే ప్రత్యేకంగా కొమ్ములు ఉంటాయా..? వారికి వీఐపీ ట్రీట్ మెంట్ ఇవ్వాలా ? తప్పులు చేసి జైలుకు వెళ్తే అక్కడ కూడా రాజభోగం అవసరమా..? కన్నడ నటుడు దర్శన్‌కు సంబంధించిన రేణుకస్వామి హత్య కేసులో సుప్రీం కోర్టు కాస్త ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. అభిమానినే హత్య చేసి జైలుకు వెళ్లిన కన్నడ హీరో దర్శన్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేసింది. అసలు దర్శన్ విషయంలో సుప్రీం కోర్టు ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..? అసలు హీరో దర్శన్ చేసిన తప్పు ఏంటి..? వీఐపీలకు జైళ్లల్లో ఫైవ్ స్టార్ ట్రీట్ మెంట్ ఇచ్చే అధికారులపై సుప్రీం కోర్టుల ఎలా స్పందించింది..?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ పై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్, దర్శన్‌కు 2024 డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. కర్ణాటక ఎటువంటి ఆలోచనా లేకుండా, యాంత్రికంగా ఈ నిర్ణయం తీసుకున్నదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తన అధికారాన్ని సరిగా వినియోగించలేదని సుప్రీం కోర్టు విమర్శించింది. ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలు, నేరం తీవ్రత, సాక్ష్యాలను నిందితులు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు సరికాదని తేల్చింది. దర్శన్‌తో పాటు సహ-నిందితురాలు పవిత్రా గౌడపై కూడా ఆధారాలు బలంగా ఉన్నాయని, కర్ణాటక ప్రభుత్వం అందించిన ఫోరెన్సిక్ నివేదికల్లో వారే నిందితులులు అనడానికి ఆధారాలు ఉన్నాయని సుప్రీం కోర్టు గుర్తించింది.
సుప్రీం కోర్టు ఈ కేసులో ఆదేశాలు ఇస్తూ.. జైలు వ్యవస్థపై, అక్కడి అధికారుల తీరుపై తీవ్రంగా స్పందించింది. జైలులో నిందితులకు వీఐపీ ట్రీట్మెంట్, ఫైవ్-స్టార్ సౌకర్యాలు, ప్రత్యేక హోదా ఇవ్వడం గురించి తమకు తెలిస్తే, మొదటి చర్యగా జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తాం అని జస్టిస్ పర్దివాలా హెచ్చరించారు. గతంలో దర్శన్ బెంగళూరు జైలులో కాఫీ, సిగరెట్‌తో ప్రత్యేక వెయిటింగ్ జోన్లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, జైలు వ్యవస్థలో వీఐపీ ట్రీట్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యనించింది. జైలులో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండవని.., విలాసవంతమైన జీవనశైలి అనుమతించబడదని కోర్టు తెలిపింది.
అసలు హీరో దర్శన్ ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్నారు..?
33 ఏళ్ల ఫార్మసీ ఉద్యోగి రేణుకస్వామి, దర్శన్ సహచరి పవిత్రా గౌడకు అభ్యంతరకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో, దర్శన్, అతని స్నేహితులు రేణుకస్వామిని చిత్రదుర్గం నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూరులోని ఓ షెడ్లో మూడు రోజుల పాటు హింసించి, హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు దర్శన్, అలాగే పవిత్రా గౌడకు ప్రత్యక్ష సంబంధం ఉందని తేల్చారు. అయితే హైకోర్టు ఈ ఆధారాలను సరిగా పరిగణించకుండా మినీ-ట్రయల్ లాంటి విధానంతో బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును తప్పుపట్టింది.
తీర్పు సమయంలో.. ఎవరైనా, ఎంత పెద్ద నటుడైనా లేదా సాధారణ వ్యక్తైనా, చట్టం ముందు సమానమే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న కేసుల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా వ్యవహరించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో హైకోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం కాదని, ఆధారాలను తేలిగ్గా తీసుకోవడం వల్ల బాధిత కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని సర్వోన్నత ధర్మాసనం పేర్కొంది.
రేణుకస్వామి తండ్రి సుప్రీం కోర్టును తీర్పును స్వాగతించారు. ఈ నిర్ణయం తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చిందని .. ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ తీర్పు చాటిందని అన్నారు. తీర్పు జైలు వ్యవస్థలో వీఐపీ ట్రీట్మెంట్కు, తప్పుడు బెయిల్ నిర్ణయాలకు చెక్ పెడుతుంది అని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. అటు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్శన్ ను, పవిత్ర గౌడను వెంటనే అరెస్ట్ చేశారు. Kannada Hero Darshan.
ఈ కేసులో దర్శన్ అరెస్ట్ వ్యవహారం ఒక వ్యవహారం అయితే.. జైలులో అతడికి అందిని వీఐపీ ట్రీట్ మెంట్ మరో అంశం. డబ్బులు, పలుకుబడి ఉంటే తప్పులు చేసి జైలుకు వెళ్లినా రాజభోగం అనుభవించొచ్చు అనే అర్థాన్ని ఇస్తోందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి చూసినప్పుడు డబ్బున్న వారు నేరాలు చేసి.. ఒక వేళ ఆ నేరం రుజువైతే డబ్బుతో జైలులో వీఐపీ ట్రీట్ మెంట్ అనుభవించవచ్చు అనే భావనలోకి వెళ్తారని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు మన జైళ్లల్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి.. దర్శన్ వీడియో బయటకు రావడం వల్ల అది తెలిసిందని అంటున్నారు. అందుకే దేశవ్యాప్తంగా జైలు వ్యవస్థ పనితీరు, వీఐపీ ట్రీట్మెంట్పై కఠిన నిఘా పెట్టాలని అంటున్నారు. సుప్రీం కోర్టు హెచ్చరిక ద్వారా, జైలు అధికారులు, సిబ్బంది నిందితులకు సమానంగా వ్యవహరించాలని, ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రముఖుల కేసుల్లో జైలు నిర్వహణ, బెయిల్ నిర్ణయాలపై గట్టి ప్రభావం చూపనుంది. సమాన న్యాయం అనే సూత్రాన్ని ఈ తీర్పు మరోసారి బలపరిచింది.