
Pooja Pal And Yogi: మంచి ఎవరు చేసినా మంచే అనాలి.. అలా అనడం కూడా తప్పు అంటే ఎలా.. ఇలానే ఉత్తర్ ప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన మంచిని పొగిడినందుకు సమాజ్ వాదీ పార్టీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఆ మహిళ నేత తన మాటకు కట్టుబడి ఉంటానని.. యోగా ఆదిత్య నాథ్ వల్లే తనకు న్యాయం జరిగిందని ఎమోషనల్ గా చెప్పారు. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరు..? అమె ప్రతిపక్షంలో ఉండి.. యోగి ఆదిత్యనాథ్ ను ఎందుకు పొగిడారు..? అమెకు జరిగిన అన్యాయం ఏంటి..? దీనిపై బీజేపీ,సమాజ్ వాదీ పార్టీ మధ్య ఎలాంటి మాటల యుద్ధం నడుస్తోంది..? తెలుసుకోవాలంటే ఈస్టోరీ చూడాల్సిందే..
ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత శాంతి భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రౌడీలు, గ్యాంగ్ స్టర్ల భరతం పట్టారు. చాలా మంది ఎన్ కౌంటర్లలో పోయారు. కొందరిని ఎవరు చంపారో కూడా తెలియదు. ఎలా జరిగినా ప్రజలను పీడించుకు తిన్న గ్యాంగ్ స్టర్లు చావడంతో చాలా మంది మంచి జరిగిందని అనుకుంటున్నారు. ఇదే విధంగా తనకు న్యాయం జరిగిందని సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ .. సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ప్రతిపక్షంలో ఉండి.. అధికార పక్షాన్ని ప్రశంసిస్తావా అంటూ అమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పూజా పాల్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని.. గతంలో హెచ్చరికలు జారీ చేసినా, ఆమె తన వైఖరిని మార్చుకోలేదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన విజన్ డాక్యుమెంట్ చర్చ సందర్భంగా, యోగి ఆదిత్యనాథ్ జీరో టాలరెన్స్ విధానం రాష్ట్రంలో నేరాలను అరికట్టడంలో సహాయపడిందని, తనకు న్యాయం జరిగేలా చేసిందని పూజా పాల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఎస్పీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారడంతో, ఆమెను వెంటనే పార్టీ నుంచి తొలగించారు.
పూజా పాల్ .. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల వెనక ఒక వ్యక్తిగత, రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త, బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్, 2005లో ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త అతీఖ్ అహ్మద్, అతని గ్యాంగ్ చేతిలో హత్య చేయబడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల ముందే పూజా పాల్‌తో రాజు పాల్ వివాహం జరిగింది. 2023లో, రాజు పాల్ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ కూడా ప్రయాగ్‌రాజ్‌లో హత్యకు గురయ్యాడు. కరుడుగట్టిన నేరస్తులు అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అశ్రఫ్ అహ్మద్ ఈ కేసులో ప్రధాన నిందితులుగా అరెస్టయ్యారు. అయితే, 2023 ఏప్రిల్ 15న, వీరిద్దరినీ పోలీసు కస్టడీలో మీడియా రిపోర్టులుగా వచ్చిన వారు కాల్చి హత్య చేశారు. ఈ విషయంపై పూజా పాల్ మాట్లాడుతూ.. తన భర్తను చంపిన హంతకుడైన అతీఖ్ అహ్మద్‌ను ముఖ్యమంత్రి మట్టిలో కలిపేశారని… తన మాట ఎవరూ విననప్పుడు ఆయన న్యాయం చేశారని… ప్రయాగ్‌రాజ్‌లో తన లాంటి అనేక మహిళలకు ఈ విధానం న్యాయం చేసింది అని అసెంబ్లీలో పేర్కొన్నారు.
పూజా పాల్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ రియాక్షన్ ఏంటి..?
సమాజ్ వాదీ పార్టీలో పూజా పాల్ వ్యాఖ్యలు దుమారం రేగింది. సొంత పార్టీ నేత సీఎంను పొగడటం ఆ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది విషయంలో గతంలో కూడా పూజా పాల్ ను హెచ్చరించారు. కాని ఆమె తన మాటపై బలంగా నిలబడ్డారు. తనకు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టు చెబితే ఉలుకెందుకని పూజా పాల్ ప్రశ్నిస్తున్నారు. గతంలో కేవలం హెచ్చరికలతో సరిపెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ సారి ఏఖంగా ఆమెను పార్టీ నుంచి తొలగించారు. పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలు, గతంలో హెచ్చరికలు జారీ చేసినా, వైఖరిని మార్చుకోని కారణంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని లేఖలో అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూజా పాల్ యోగిని ప్రశంసించిన కొన్ని గంటల్లోనే తీసుకున్నారు.
పూజా పాల్ రాజకీయ జీవితం విషాదంతో మొదలైంది. 2005లో, ఆమె భర్త రాజు పాల్, బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉండగా, ప్రయాగ్‌రాజ్‌లో అతీఖ్ అహ్మద్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యారు. రాజు పాల్ 2004లో అతీఖ్ సోదరుడు అశ్రఫ్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ హత్య జరిగింది, ఇది ప్రయాగ్‌రాజ్‌లో రాజకీయ శత్రుత్వానికి కారణమైంది. 2016లో సీబీఐ ఈ కేసును తీసుకుంది, 2024లో ఏడుగురు నిందితులను కుట్ర ఆరోపణలపై దోషులుగా తేలారు. 2023లో ఉమేష్ పాల్ హత్య హత్య తర్వాత పూజా పాల్ పోరాటాన్ని మరింత పెంచింది. చివరికి అతీఖ్ అశ్రఫ్ హత్యలతో పూజా పాల్ కు శాంతించారు. ఈ ఘటనలు అన్నీ చూసిన పూజా పాల్ కు పార్టీ నుంచి బహిష్కరించడం పెద్ద శిక్ష కాదని అంటున్నారు అమె బంధువులు.
బీజేపీ ఏం అంటోంది.?
పూజా పాల్ బహిష్కరణ రాజకీయంగా తీవ్ర చర్చను రేకెత్తించింది. బీజేపీ నాయకులు, ముఖ్యంగా పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా, సమాజ్ వాదీని దళిత వ్యతిరేక పార్టీ అనే ఆరోపణలు చేశారు. పూజా పాల్ రాష్ట్రంలో నేరాలపై యోగి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు, అందుకు ఆమెను శిక్షించారు. ఎస్పీకి అతీఖ్ అహ్మద్ లాంటి వారు వోట్ బ్యాంక్‌గా కనిపిస్తారు. అందుకే వారిని ప్రశ్నించడానికి భయమని.. దీని కారణంగా దళితులకు అన్యాయం జరిగినా పట్టించుకోరని విమర్శించారు. ఈ ఆరోపణలు ఎస్పీ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది, ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలు దూరం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అటు పార్టీ నుంచి బహిష్కరణపై పూజా పాల్ స్పందిస్తూ, తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానని, ప్రయాగ్‌రాజ్‌లో తనవంటి అనేక మహిళలకు న్యాయం కోసం తాను మాట్లాడానని అన్నారు. తన భర్త హత్యకు న్యాయం కోసం పోరాడానని… ఎవరూ తన మాట విననప్పుడు, యోగి ఆదిత్యనాథ్ న్యాయం చేశారని… తను తన వాక్కును వెనక్కి తీసుకోను అని ఆమె స్పష్టం చేశారు. ఈ బహిష్కరణ తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు ఆమె బీజేపీలో చేరవచ్చని, మరికొందరు ఆమె స్వతంత్రంగా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆమె నిర్ణయం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది. Pooja Pal And Yogi.
పూజా పాల్ బహిష్కరణ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సమాజ్వాదీ పార్టీ యొక్క అంతర్గత క్రమశిక్షణ, రాజకీయ విధానాలను ప్రశ్నార్థకం చేసింది. బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఎస్పీపై దళిత వ్యతిరేక ఆరోపణలతో రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. ప్రయాగ్‌రాజ్, కౌశాంబి ప్రాంతాల్లో ఈ ఘటన స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయవచ్చు. అతీఖ్ అహ్మద్ హత్యల నేపథ్యంలో, యోగి ఆదిత్యనాథ్ జీరో టాలరెన్స్ విధానం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన దళిత సమాజంలో, మహిళా ఓటర్లలో ఎస్పీ ఇమేజ్‌పై ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.