బాలయ్య వరల్డ్ రికార్డ్..!

Balakrishna World Record: నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్​ల్లోకెక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన్ను ఈ అవార్డుకు ఎంపికచేశారు. కాగా, ఈ నెల 30న హైదరాబాద్‌లో బాలకృష్ణను సత్కరించనున్నారు. యూకే గోల్డ్ ఎడిషన్​లో స్థానం కల్పించటం సంతోషంగా ఉందంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా ఓ ప్రకటనలో పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ చేతుల మీదుగా ఈ రికార్డును బాలకృష్ణకు అందించనున్నారు. కెరీర్​లో తండ్రి వారసత్వాన్ని కాపాడటంతోపాటు తన అద్భుత నటనతో, కళపట్ల నిబద్ధతతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్రవేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది. సినిమాతోపాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషన్ కూడా ఈ ఏడాదే అందుకున్నారు.

1974లో తాతమ్మ కలతో బాలకృష్ణ సినీ జీవితం ప్రారంభమైంది. అలా 50ఏళ్ల కెరీర్​లో బాలయ్య మంగమ్మగారి మనవడు, సీతారామకల్యాణం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, సింహా, లెజెండ్, శ్రీ రామరాజ్యం, అఖండ, భగవంత్ కేసరి క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌ అన్ని జాన్రాలలో నటుడిగా సత్తా చాటారు. కెరీర్​లో అనేక విజయాలు అందుకున్నారు. ఇందులో బోయపాటి శ్రీనివాస్ తెరెక్కించిన లెజెండ్ సినిమా 1000కి పైగా రోజులు థియేటర్లలో ప్రదర్శితమై అరుదైన ఘతన సాధించింది.

బాలకృష్ణ హీరోగా 2023లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు రీసెంట్​గా నేషనల్ అవార్డ్ వరించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్​తో వచ్చింది. దీంతో ఈ సినిమా టాలీవుడ్‌ నుంచి నేషనల్ అవార్డ్స్​లో బెస్ట్ ఫిల్మ్​గా ఎంపికైంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తైంది. రీసెంట్​గా బాలయ్య తన డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకున్నారు. 2021 బ్లాక్ బస్టర్ సినిమా అఖండకు సీక్వెల్​గా ఈ అఖండ తాండవం తెరకెక్కింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇందులో ప్రగ్య జైస్వాల్, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుంది.

బాలయ్యకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించనుండటంపై ఆయన బావ, సీఎం చంద్రబాబు ట్వీట్ లో స్పందించారు. తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, మక్కువకు ప్రసిద్ధి చెందిన నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల పాటు ప్రధాన హీరోగా చేసిన ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలుస్తుందన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే ద్వారా గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం అన్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిపై మన ప్రియమైన బాలయ్యకు అభినందనలు అంటూ ముగించారు. Balakrishna World Record.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకి ఎంపికైన తొలి నటులు బాలకృష్ణ కావడం యావత్ తెలుగు జాతికి గర్వకారణం అన్నారు. ఇదే కోవలో పలువురు మంత్రులు, పార్టీ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు బాలయ్యకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q