
AI Technology To Protect Elephants: రైల్వే ట్రాక్‌లపై ఏనుగులు దాటుతుంటే రైళ్లు ఢీకొనడం… ఈ సమస్య భారత్‌లో చాలా ఏళ్లుగా ఉంది. ముఖ్యంగా తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా, మడుక్కరై ప్రాంతంలో ఏనుగుల ప్రాణనష్టం పెద్ద సవాల్‌గా మారింది. కానీ, ఇప్పుడు ఈ సమస్యకు ఒక అద్భుత పరిష్కారం దొరికింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రైల్వే అధికారులు కలిసి ఒక అత్యాధునిక AI సిస్టమ్‌ను అమలు చేశారు. దీని ఫలితంగా ఎన్నో ఏనుగులను, రైలు ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతున్నారు. అసలు ఈ ఏఐ టెక్నాలజీ ఏనుగులను ఎలా కాపాడుతోంది? దీని కోసం ఎలాంటి టీమ్ పనిచేస్తోంది..? అటవీ ప్రాంతాల్లో ఈ లాంటి టెక్నాలజీల వల్ల ఉపయోగం ఏంటి..?
తమిళనాడులోని మడుక్కరై, కేరళ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఒక అటవీ ప్రాంతం. ఇక్కడ ఏనుగులు తమ సహజ మార్గంలో సంచరిస్తుంటాయి. కానీ, ఈ అడవి గుండా రెండు రైల్వే ట్రాక్‌లు పోతున్నాయి. ఏనుగులు తమ కారిడార్‌లో ట్రాక్ దాటాల్సి వస్తుంది. ఇది పెద్ద సమస్యగా మారింది. 2008 నుంచి 2023 వరకు, మడుక్కరైలో చాలా ఏనుగులు రైలు ఢీకొని చనిపోయాయి. రాత్రి సమయంలో ఏనుగులను గుర్తించడం కష్టం. మరోవైపు రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఇవి ఏనుగులకు మాత్రమే కాదు, రైలు ప్రయాణికులకు కూడా ప్రమాదకరం. 2021లో మద్రాస్ హైకోర్టు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుంది. ఏనుగుల మరణాలను అడ్డుకోవాలి, కొత్త టెక్నాలజీని వాడండి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రైల్వే శాఖకు ఆదేశించింది. అప్పటివరకు ఫారెస్ట్ గార్డులు ట్రాక్‌ల వెంట నడుస్తూ ఏనుగులను చూసి సిగ్నల్ ఇచ్చేవారు. కానీ, రాత్రిపూట ఈ పద్ధతి విఫలమైంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ AI ఆధారిత సర్వైలెన్స్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇది దేశంలోనే మొట్టమొదటి వన్యప్రాణి రక్షణ AI ప్రాజెక్ట్.

ఈ AI సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఈ AI సిస్టమ్ ను మడుక్కరైలోని 7 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ల వెంట 12 హైటెక్ టవర్లు ఏర్పాటు చేశారు. ఈ టవర్లపై 24 థర్మల్ కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు పగలూ, రాత్రీ అని తేడా లేకుండా 24 గంటలూ పనిచేస్తాయి. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ వల్ల చీకట్లో కూడా ఏనుగులు స్పష్టంగా కనిపిస్తాయి. AI సాఫ్ట్వేర్ ఈ వీడియో ఫుటేజ్‌ను రియల్ టైమ్‌లో స్కాన్ చేస్తుంది. ఏనుగు లేదా ఇతర జంతువు ట్రాక్‌కు 30 మీటర్ల లోపలికి వస్తే, వెంటనే అలర్ట్ జనరేట్ అవుతుంది. ఈ అలర్ట్ కంట్రోల్ రూమ్‌లోని 25 మంది ఫారెస్ట్ సిబ్బందికి చేరుతుంది. వాళ్లు వెంటనే రైల్వే స్టేషన్ మాస్టర్లకు, లోకో పైలట్లకు సమాచారం పంపిస్తారు. SMS, కాల్ లేదా డిజిటల్ డిస్ప్లే ద్వారా సమాచారం అందుతుంది. దీంతో రైలు నెమ్మదించడం లేదా ఆగిపోవడం జరుగుతుంది. అదే సమయంలో, ఫారెస్ట్ టీమ్ ఏనుగులను సురక్షితంగా దారి మళ్లిస్తుంది. ఈ సిస్టమ్ భారత సైన్యం సరిహద్దుల్లో వాడే టెక్నాలజీని పోలి ఉంటుంది. కానీ, వన్యప్రాణి రక్షణ కోసం దీన్ని తమిళనాడు ప్రభుత్వం మొదటిసారి అమలు చేసింది.
AI సిస్టమ్ ఫలితాలు ఎలా ఉన్నాయి.?
2023 నవంబర్ నుంచి 2025 ఆగస్టు వరకు, మడుక్కరైలో 6,592 సార్లు ఏనుగులు రైల్వే ట్రాక్‌ను సురక్షితంగా దాటాయి. అంటే, ఒక్క ఏనుగు కూడా చనిపోలేదు. రోజుకు 130 రైళ్లు ఈ రూట్లో వెళ్తాయి. అలాంటి బిజీ ట్రాక్‌లో ఈ సిస్టమ్ 10 వేలకు పైగా అలర్ట్‌లు జనరేట్ చేసింది. ఏనుగులతో పాటు జింకలు, చిరుతలు లాంటి జంతువులను కూడా ఈ కెమెరాలు గుర్తిస్తున్నాయి. వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఒక ఏనుగు కుటుంబం ట్రాక్‌ను సురక్షితంగా దాటుతోంది.
ఈ ప్రాజెక్ట్ ఖర్చు, అమలు ఎలా ఉంది..?
ఈ AI సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి 7.24 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ బడ్జెట్లో 12 టవర్లు, 24 థర్మల్ కెమెరాలు, కంట్రోల్ రూమ్, సాఫ్ట్వేర్ అన్నీ కవర్ అయ్యాయి. తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్ మెంట్ కలిసి ఈ ఖర్చును భరించాయి. ఇంతకు ముందు ఫారెస్ట్ గార్డులు రాత్రిపూట ట్రాక్‌ల వెంట పెట్రోలింగ్ చేసేవారు. కానీ, పెద్ద దూరం కవర్ చేయడం, చీకట్లో ఏనుగులను గుర్తించడం కష్టమవడంతో ఈ పద్ధతి విఫలమైంది. AI సిస్టమ్ ఈ సమస్యను పూర్తిగా మార్చేసింది. మానవ ప్రయత్నాలు ఉపయోగపడులేదు. కానీ, AI రియల్ టైమ్ అలర్ట్‌లతో గేమ్ ఛేంజర్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను 2020లో పైలట్‌గా మొదలుపెట్టి, 2024 ఫిబ్రవరిలో అధికారికంగా ప్రారంభించారు. ఇప్పుడు ఈ సిస్టమ్‌ను ధర్మపురి, హోసూర్ లాంటి ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.
తమిళనాడు మోడల్ ఒక ట్రెండ్ సెట్టర్. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి AI టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నాయి. భారత రైల్వే మంత్రిత్వ శాఖ 2023లో గజరాజ్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కింద 700 కిలోమీటర్ల ఏనుగు కారిడార్లలో AI సర్వైలెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ను ఉపయోగిస్తోంది. ఇది లేజర్ సిగ్నల్ల ద్వారా జంతువుల కదలికలను గుర్తిస్తుంది. కేరళ, కర్ణాటక, అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా తమ ఏనుగు కారిడార్లలో ఇలాంటి టెక్నాలజీని పరీక్షిస్తున్నాయి. కానీ, తమిళనాడు సిస్టమ్ దాని 100% సక్సెస్ పుల్ రేట్ తో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ మోడల్‌ను అనుసరించి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. AI Technology To Protect Elephants.
ఈ AI సిస్టమ్ ఏనుగులను కాపాడడమే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతోంది. అటవీ ప్రాంత గ్రామాల్లో రైతులు ఏనుగులు పంటలు నాశనం చేస్తాయని భయపడతారు. కానీ, ఈ సిస్టమ్ ఏనుగుల కదలికలను ముందుగానే చెబుతుంది. దీంతో గ్రామస్తులు జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ సిస్టమ్ ద్వారా ఏనుగుల సంచార మార్గాలపై డేటా సేకరిస్తున్నారు. ఈ డేటా భవిష్యత్‌లో సంరక్షణ చర్యలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏనుగుల ప్రవర్తన, వాటి మైగ్రేషన్ ప్యాటర్న్స్‌ను అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం కీలకం. తమిళనాడు ఈ సిస్టమ్‌ను ఇతర ఏనుగు కారిడార్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. అలాగే, రైల్వే అండర్‌పాస్‌లు నిర్మించి, ఏనుగులకు సురక్షిత మార్గాలను కల్పించాలని యోచిస్తోంది. ఇప్పటికే రెండు అండర్‌పాస్‌లను ఏనుగులు ఉపయోగిస్తున్నాయి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q