శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది.?

Srikakulam district TDP President: శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది. అచ్చెన్న మద్దతు ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవి రావడం ఖాయమా. దీనిపై జిల్లా నేతలు ఏమంటున్నారు. పార్టీలో జరుగుతోన్న ప్రచారం ఏంటి. వాచ్ దిస్ స్టోరీ.

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై పార్టీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోందట. కేంద్ర, రాష్ట్ర మంత్రలతో పాటు శాసనసభ్యల అభిప్రాయాలను సేకరించేందుకు ఇటీవల హోం మంత్రి అనిత నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి కోసం చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్, పీరుకట్ల విఠల్, అనెపు రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. అవకాశం ఇస్తే ఆ పదవి చేపట్టేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండ శంకర్, పాతపట్నం ఎమ్యెలే మామిడి గోవిందరావు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే అచ్చెన్నాయుడు ఆశీస్సులు ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక జిల్లా నుంచి కాళింగ సామాజికవర్గానికి చెందిన చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్ పోటీ పడుతున్నారట. అలాగే తూర్పుకావు సామాజికవర్గం నుంచి మామిడి గోవిందరావు, అనెపు రామకృష్ణ రేసులో ఉన్నారు. అయితే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కలమట రమణ కాపు సామాజికవర్గమే కాబట్టి మళ్లీ అదే కులానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎంఎల్ఏ కూన రవికుమార్ పట్టుబడితే మాత్రం ఆ పోస్ట్ కాళింగ సామాజిక వర్గానికి చెందిన మొదలవలస రమేష్ కి దక్కడం ఖాయం అనిపిస్తోంది.

ఇదే సమయంలో మరో ప్రచారం కూడా జిల్లాలో జరుగుతోంట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు చౌదరి బాబ్జి. అయితే ఆయన నియోజకవర్గమైన ఎచ్చర్ల పార్లమెంట్ పరిధిలో లేకపోవడం ఒకటైతే, డీసీఎంఎస్ చైర్మన్ పదవి బాబ్జి కుమారుడికి దక్కింది. దీంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు రావడం కష్టమన్న ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా అధ్యక్ష పదవిపై జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో హోం మంత్రి అనిత సమావేశం నిర్వహించినా, అదంతా కేవలం తూతూ మంత్రమే అంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, కింజారపు కుటుంబం ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందట. ఇప్పటికే ఆ పదవి ఎవరికన్నదీ డిసైడ్ కూడా అయినట్లు ప్రచారం జరుగుతోంది. Srikakulam district TDP President.

సామాజిక వర్గ సమన్యాయం ప్రకారం పార్టీ పదవులు వరించాల్సి ఉన్నా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశంలో అందుకు భిన్నంగా సాగుతోంది. సామాజికవర్గ సమీకరణం, ఆధిపత్యం నేపథ్యంలో ఈ పదవి ఎవరి వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఎన్నికల ముందు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కాపు సామాజిక వర్గానికి చెందిన కలమట వెంకటరమణ తాను పదవిలో కొనసాగలేనని రాజీనామా చేశారు. జిల్లాలో అధికంగా ఉన్న తూర్పు కాపులకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో ఉండడంతో ఈ సామాజికవర్గానికి చెందిన వారికే ఈ పదవి దక్కాల్సి ఉందని పలువురు భావిస్తున్నారట. ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి మామిడి గోవిందరావు, అనెపు రామకృష్ణలు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడంతో వారి అనుయాయిలకు మాత్రమే పదవులు దక్కుతున్నాయన్నది వాస్తవంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందన్న చర్చ బాగా జరుగుతోందట.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q